మగాడికి మంగళసూత్రం

ABN , First Publish Date - 2021-05-16T21:03:04+05:30 IST

మంగళసూత్రం వధువుకు మాత్రమే ఎందుకు ఉండాలి? మహిళ మెడలో మంగళసూత్రం చూడగానే ఆమెకు పెళ్లయ్యిందని తెలుస్తుంది...

మగాడికి మంగళసూత్రం

మంగళసూత్రం వధువుకు మాత్రమే ఎందుకు ఉండాలి? మహిళ మెడలో మంగళసూత్రం చూడగానే ఆమెకు పెళ్లయ్యిందని తెలుస్తుంది... మరి మగవాడికి పెళ్లయ్యిందని ఎలా తెలుస్తుంది? వరుడు కూడా పెళ్లయినట్టు తెలిపే మంగళసూత్రాన్ని ధరిస్తే తప్పేంటీ?... ‘ఆకాశంలో సగం’, ‘మహిళా వివక్ష’ అనేవి కేవలం మాటలకే పరిమితం అవుతున్నాయి కానీ, ఎన్నో ఏళ్లుగా మహిళలను చిన్నచూపు చూస్తోందీ సమాజం. ముఖ్యంగా పెళ్లి, తాళి విషయంలో ఆమెను మాత్రమే బాధ్యురాలిని చేసి, మగాళ్ల వెనకే అడుగులు వేయాలి అనే భావనను కల్పిస్తున్నారు. మహిళ మెడలో తాళి కట్టగానే తంతు ముగిసినట్టుగా భావిస్తున్నారు. ఆ తాళిని అడ్డు పెట్టుకుని మగాళ్లు భార్యలపై పెత్తనం చెలాయిస్తున్నారు. అందుకే తరతరాలుగా వస్తున్న భారతీయ వివాహ సాంప్రదాయాన్ని కాస్త మార్చాలనుకున్నాడు తనకు తాను ఫెమినిస్టుగా చెప్పుకునే శార్దుల్‌ కదమ్‌. ఈ ప్రశ్నలకు సమాధానం వెదికే ప్రయత్నం చేశాడు. తను నమ్మిన సిద్ధాంతాన్ని ధైర్యంగా ఆచరణలో పెట్టాడు. నాలుగేళ్లుగా ప్రేమిస్తున్న తనూజ పాటిల్‌తో తన మెడలో కూడా తాళి కట్టించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తల్లిదండ్రులతో పాటు పెళ్లికి వచ్చిన బంధువులు, సన్నిహితులు శార్దుల్‌ నిర్ణయం విని నోళ్లు వెళ్లబెట్టారు. వరుడు వధువుకు తాళి కట్టిన తర్వాత, మంగళసూత్రాన్ని పోలిన ఆభరణాన్ని వధువు వరుడికి కట్టింది. ముంబయికి చెందిన ఈ జంట కరోనా కారణంగా కొంతమంది సన్నిహితుల నడుమ ఒక్కటయ్యింది. ‘‘అన్నింటిలో సమానత్వాన్ని కోరుకుంటున్నప్పుడు తాళి అనేది భార్యాభర్తలిద్దరిలో ఒకరికే ఉండటం అర్థం లేనిది. మగాడి మెడలో కూడా తాళి ఉన్నప్పుడే సమానత్వానికి అర్థం... ఆ తాళికి గౌరవం’’ అంటున్న శార్దుల్‌ ఆలోచన కొత్తగా ఉంది కదూ.



Updated Date - 2021-05-16T21:03:04+05:30 IST