ప్రతికూల వాతావరణంతో నిరాశలో మామిడి రైతు

ABN , First Publish Date - 2022-01-23T03:30:44+05:30 IST

మామిడి సీజన్‌పై ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశే మిగిలేలా ఉంది. తోటలు పూతకు వచ్చి పిందెకట్టే సమయంలో వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పులు రైతన్నకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. డిసెంబరు ఆఖరు వారంలోనే పూర్తిస్థాయి పూతకు రావాల్సిన తోటలు ఇంతవరకు మొగ్గ కూడ కట్టక పోవడంతో దిగుబడిపై గుబులుపట్టుకుంది.

ప్రతికూల వాతావరణంతో నిరాశలో మామిడి రైతు
మామిడి తోట

ప్రతికూల వాతావరణంతో పూతకు రాని తోటలు

అకాల వర్షాలతో కోలుకోలేని దెబ్బ

శాపంగా మారిన మబ్బులు... పొగమంచు

నెన్నెల, జనవరి 22: మామిడి సీజన్‌పై ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశే మిగిలేలా ఉంది.  తోటలు పూతకు వచ్చి పిందెకట్టే సమయంలో వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పులు రైతన్నకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. డిసెంబరు ఆఖరు వారంలోనే పూర్తిస్థాయి పూతకు రావాల్సిన తోటలు ఇంతవరకు మొగ్గ కూడ కట్టక పోవడంతో దిగుబడిపై గుబులుపట్టుకుంది. చలితీవ్రతలో హెచ్చుతగ్గులు, అకాల వర్షాలు, రోజుల తరబడి మబ్బులతో పాటు పొగమంచు (మూడం) కమ్ముకొని ఉండటం, చీడపీడల దాడి లాంటి పరిణామాలతో పూత వచ్చే అవకాశం లేదని వాపోతున్నారు. ఆలస్యంగా పూతవచ్చినా అది పిందెకట్టదని చెబుతున్నారు.  రైతులు నవంబరు నుంచే వేల రూపాయల పెట్టుబడులు పెట్టి తోటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టారు. దున్నడం, ఎండు కొమ్మలు తొలగించడం, మందులు పిచికారి చేయడం, ఎరువులు వేయడంలాంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రతికూల పరిస్థితులతో మామిడి  రైతులు నిరాశలో మునిగిపోగా, ఈ పాటికే  అడ్వాన్సుగా  లక్షలు చెల్లించి తోటలు లీజుకు తీసుకున్న  గుత్తేదారులు లబోదిబోమంటున్నారు.

జిల్లాలో 22 వేల ఎకరాల్లో సాగు

మామిడికి మంచిర్యాల జిల్లా పెట్టింది పేరు. జిల్లాలో వరి, పత్తి తరువాత ప్రధాన పంట మామిడే. జిల్లాలో 22 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఎక్కువ శాతం నెన్నెల, జైపూర్‌, చెన్నూరు. తాండూర్‌, మందమర్రి, కోటపల్లి, బెల్లంపల్లి మండలాల్లోనే ఉన్నాయి. దేశంలో లభించే అన్ని రకాల మామిడి పండ్లు ఇక్కడ లభ్యమవుతాయి. ఇక్కడి మామిడి కాయలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. మామిడి పంటపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న వేలాదిమంది నిరాశలో ఉన్నారు.

 5 ఏళ్లుగా నష్టాలే

మామిడి రైతుల పరిస్థితి యేటేటా దిగజారిపోతోంది. ఒకప్పుడు మంచి దిగుబడితో ఆదాయం పొందిన రైతులకు ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. అతివృష్టి, అనావృష్టి, గాలిదుమారాలు, వడగళ్లవానలు, చీడపీడలు, తెగుళ్ల కారణంగా ఐదేళ్లుగా మామిడి రైతులు వరుస నష్టాలను చవిచూస్తున్నారు. ఈ ఏడు సైతం పంట వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. 

ప్రతికూల వాతావరణం.... చీడపీడల దాడి 

మామిడికి వాతావరణం ప్రతికూలంగా ఉంది. చలితీవ్రత, రోజుల తరబడి మబ్బులు పట్టి ఉండటం, అకాల వర్షాలు లాంటి అంశాలు మామిడి పూతపై ప్రభావం చూపిస్తున్నాయి. మామిడి చెట్లు ఇప్పటికే పూర్తిస్థాయి పూతకు రావాల్సి ఉండగా.. ఈ సారి ఆలస్యం అయ్యేలా ఉంది. ఫిబ్రవరి రెండో వారంలోగా పూతకు వచ్చే అవకాశం ఉందని అధికారులంటున్నారు. దీనికి తోడు రోజుల తరబడి మబ్బులు పట్టి ఉండటంతో తెగుళ్లు, చీడపీడల ఉధృతి పెరిగిపోయింది. తోటల్లో తేనెమంచు, బూడిద తెగుళ్ల, రసంపీల్చే పురుగులు కనిపిస్తున్నాయి. ఆకుమచ్చ, పూతమాడు, నల్లమచ్చ తెగుళ్ల  ఉనికి ఉంది.  బల్లిపాతర (బూజు) అధికంగా ఉందని రైతులంటున్నారు. ఈ తెగుళ్ల వల్ల దిగుబడిపై ప్రభావం పడుతుంది. పూత ఆలస్యంగా వచ్చినపుడు కాయ పెరుగుదల దశలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి పొడి వాతావరణం ఉంటుంది. రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించి నష్టపరిచే అవకాశం ఉంటుందని నిఫుణులంటున్నారు.

 పూతకు రాని తోటల్లో ఇలా చేయాలి

-డాక్టర్‌ రాజేశ్వర్‌నాయక్‌, సీనియర్‌ శాస్త్రవేత్త,

మామిడి పూత రావడం పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైనా తగు జాగ్రత్తలు పాటిస్తే పూత వచ్చే అవకాశం ఉంది. వచ్చిన పూతను సంరక్షించకుని నష్టాలను పూడ్చుకోవచ్చు. ప్రస్తుత సమయంలో నీటి తడులను నిలిపివేసి తోటలకు బెట్ట పరిస్థితి కల్పించాలి. దీంతో శాకీయ పెరుగుదల నిలిచిపోయి మొక్కకు తగినంత విశ్రాంతి లభిస్తుంది. దీని వల్ల చెట్టు పూత సమయానికి సరిపడ పిండి పదార్థం నిల్వ చేసుకోవడమే కాకుండా కొమ్మలు పూర్తి పక్వతకు చేరుకుని ఎక్కువ పూత రావడానికి దోహదపడతాయి. పూమొగ్గలు రావడం ఆలస్యమైనప్పుడు  లీటరు నీటిలో పది గ్రాముల మల్టీ-కే (పొటాషియం నైట్రేటు), 5 గ్రాముల యూరియా కలిపి చెట్ల కొమ్మలు బాగా తడిచేలాగా పిచికారి చేసుకోవాలి.  పూత వచ్చే సమయంలో వాతావరణ పరిస్థితులు అధిక ప్రభావాన్ని చూపుతాయి.  చలి తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా పూత వచ్చే అవకాశం ఉంటుంది. పగలు 18-28, రాత్రి 10-13 సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రతలు  నమోదైతే మెరుగైన ఫలితాలుంటాయి. పూమొగ్గ ఏర్పడిన తరువాత నీటితడులిచ్చి పైపాటుగా ఎరువులు వేసుకోవాలి. చెట్టు వయసును బట్టి సాధారణంగా 500 గ్రాముల నుంచి ఒక కిలో  యూరియా, మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ ఎరువులను వేయాలి. ఆకుమచ్చ, పూతమాడు, నల్లమచ్చ, బూడిదరంగు తెగులు, తేనెమంచు తెగులు సోకే అవకాశం ఎక్కువగా ఉంది. తెగులు ఉనికి గమనించిన వెంటనే లీటరు నీటిలో 3 గ్రాముల కాపర్‌ఆక్సిక్లోరైడ్‌ లేదా ఒక శాతం బోర్డు మిశ్రమం కలిపి స్ర్పే చేయాలి. పచ్చి పూత మీద ఒక గ్రాము కార్బండిజం, ఒక గ్రాము థయోఫినేట్‌ మిథైల్‌ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పిందె దశలో లీటరు నీటిలో 2.5 గ్రాముల మాంకోజెబ్‌ కలిపి స్ర్పే చేసుకోవాలి. బూడిదరంగు తెగులు మొగ్గ దశలో సోకితే మూడు గ్రాముల గందకం, పూత దశలో కన్పిస్తే హెక్సాకోనోజోల్‌ ఒక మిల్లీలీటరు లేదా డైనోకాఫ్‌ ఒక మిల్లీలీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తేనెమంచు తెగులు నివారణకు మొగ్గ, పూత దశలో ఒక మిల్లీలీటరు డైక్లోరోవాస్‌ లేదా 3 గ్రాముల కార్పోరిల్‌ కలిపి చెట్టంతా తడిచేలా స్ర్పే చేయాలి. పచ్చపూత దశలో కాండాలు వికసించకుండా మొగ్గ దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి డైమిథోయేట్‌ లేదా 3 మిల్లీలీటర్ల మిథైల్‌ డెమటాన్‌ లేదా 0.25 శాతం మిల్లీ లీటర్ల ఇమిడా క్లోప్రిడ్‌ పిచికారి చేసుకుంటే ఆశించిన ఫలితాలు వస్తాయి. తోటల్లో ఎలాంటి సమస్యలున్న బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ఉద్యాన శాస్త్రవేత్త స్రవంతిని స్రంప్రదిస్తే తగిన సూచనలు, సలహాలిస్తారు. 

పూత జాడే లేదు

-బెల్లం రాజిరెడ్డి, ఆవడం, నెన్నెల మండలం

డిసెంబరు ఆఖరు కల్లా తోటలన్నీ పూతకు రావాలి. ఇప్పటికీ పూత జాడే లేదు.  అంతంత మాత్రంగా వస్తున్న పూత మబ్బులు, పొగమంచుతో మాడి పోతోంది. చీడపీడలు కూడా ఎక్కువయ్యాయి. ఆలస్యంగా వచ్చే పూత పిందెకడ్తుందనే నమ్మకం లేదు. తోటలో దుక్కి, ఎరువులు, పురుగు మందులకు పెట్టిన పెట్టుబడి వచ్చేలా లేదు.  

Updated Date - 2022-01-23T03:30:44+05:30 IST