మామిడి రైతు వ్యథ

ABN , First Publish Date - 2021-05-08T05:43:28+05:30 IST

కళకళలాడుతున్న మామిడి తోటల్లో పూత రాలిపోయింది.

మామిడి రైతు వ్యథ

  1.  తెగుళ్లతో రాలిన పూత
  2. అకాల వర్షాలతో నేలపాలైన కాయలు
  3. కర్ఫ్యూతో నిలిచిన రవాణా
  4. తీవ్రంగా నష్టపోతున్న రైతులు
  5. ప్రభుత్వం ఆదుకోవాలని వినతి


ఓర్వకల్లు, మే 7: కళకళలాడుతున్న మామిడి తోటల్లో పూత రాలిపోయింది. రూ. లక్షలు చెల్లించి కౌలుకు తీసుకున్న రైతులు ఆందోళనలో కూరుకపోయారు. తెగుళ్లు సోకి మామిడి పూత రాలిపోయింది. భారీ దిగుబడులు ఆశించిన కౌలు రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. దీనికితోడు చేతికొచ్చిన కొద్దిపాటి పంట కూడా అకాల వర్షాలతో నేలపాలైంది. ఐదు సంవత్సరాలుగా రైతుల పరిస్థితి  దారుణంగా ఉంటోంది. దీంతో పాటు రెండేళ్లుగా కరోనాతో అదనంగా ఇబ్బందులు వచ్చి పడ్డాయి. జిల్లాలో మామిడి దాదాపు 10వేల హెక్టార్లలో సాగు చేశారు.
 

జిల్లాలో 10 వేల హెక్టార్లలో సాగు: జిల్లాలోని డోన్‌, బనగానపల్లె, పత్తికొండ, నంద్యాల, పాణ్యం నియోజకవర్గాల్లో దాదాపు 10 వేల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. ఉద్యానశాఖ అధికారుల అంచనా ప్రకారం మూడు టన్నుల దిగుబడి రావాలి కాని.. ఈ ఏడాది ఒక టన్నుకు కూడా అవకాశం లేదని రైతులు అంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో మామిడి పండ్లు కోతకు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే.. ధరలు కాస్త పెరిగాయి. కానీ దిగుబడి ఆశించిన స్థాయిలో లేదు.


విస్తారంగా సాగు
ఓర్వకల్లు, బేతంచెర్ల, వెల్దుర్తి మండలాల్లో దాదాపు 6 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఓర్వకల్లు మండలంలోని పాలకొలను, కొమరోలు, బ్రాహ్మణపల్లె, కాల్వ, ఉయ్యాలవాడ, ఉప్పలపాడు, బేతంచెర్ల మండలంలోని రుద్రవరం, మండ్లవానిపల్లె గ్రామాల్లో ఎక్కడ చూసినా మామిడి తోటలే కనిపిస్తాయి. తెగుళ్లు సోకి పూత రాలిపోవడం దగ్గరి నుంచి అనేక సమస్యలు మామిడి రైతును వెంటాడుతున్నాయి. చేతికొచ్చిన పంట కూడా కరోనా దెబ్బతో డబ్బుగా మారలేదు. కరోనా వల్ల రైతులు, కౌలు రైతులు గత రెండేళ్లుగా కోలుకోలేదు. పంట చేతికి వచ్చే సమయానికి ఎండల తీవ్రత, అకాల వర్షం, గాలివాన బీభత్సం వంటివి ఎన్నో చుట్టుముట్టాయి. దీంతో రైతులకు అప్పులే మిగిలాయి. రూ. లక్షలు వెచ్చించి కౌలుకు తీసుకొన్న మామిడి తోటల నుంచి అప్పు ఎలా చెల్లించాలో తెలియక ఇబ్బందిపడుతున్నారు. ఇంతలో మరలా కర్ఫ్యూ రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్‌లో క్వింటం 20వేల నుంచి 30 వేల దాకా ధర ఉంటుందని రైతులు అంటున్నారు.


రవాణాకు ఇబ్బంది
కరోనా కర్ఫ్యూ అమలతున్న దృష్ట్యా ఇతర రాష్ట్రాలకు మామిడి పండ్లను సరఫరా చేసే పరిస్థితి లేదు. వాహనాలు అందుబాటులో లేవు. ఇప్పటి దాకా కోత కోసిన కాయలు కర్నూలు, నంద్యాల తదితర ప్రాంతాలకు మాత్రమే తరలిస్తున్నామని కౌలు రైతులు తెలిపారు. దేశ వ్యాప్తంగా మార్కెట్లకు తరలిస్తే మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని రైతులు తెలిపారు.



Updated Date - 2021-05-08T05:43:28+05:30 IST