పాతాళానికి మామిడి ధరలు

ABN , First Publish Date - 2021-05-17T05:41:39+05:30 IST

రైల్వేకోడూరు పండ్ల తోటలకు పెట్టింది పేరు. కోడూరు మామిడికి మంచి గిరాకీ ఉంటుంది. గత ఏడాది కంటే ఈ ఏడాది ధరలు పూర్తిగా పడిపోయాయి. ఉన్న ధరకైనా కాయలను మహారాష్ట్ర, రాజస్థాన్‌ వంటి నగరాలకు పంపుదామంటే అక్కడ ఉదయం

పాతాళానికి మామిడి ధరలు
కరోనాతో వెలవెలపోతున్న రైల్వేకోడూరు మార్కెట్‌ యార్డు

అరటి కిలో రూ.4

దోసకాయలను అడిగేవారు లేరు

కరోనాతో పండ్ల తోటల రైతులకు భారీగా నష్టం


కరోనా దెబ్బకు మామిడి ధరలు పాతాళానికి పడిపోయాయి. అదే విధంగా అరటి కిలో రూ.4కు పడిపోయింది. దోసకాయలను అడిగే వారు లేక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పండ్ల తోటల్లో కాయలు మాగి కింద పడిపోతున్నాయి. దీంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ముంబాయి తదితర నగరాల్లోకి మామిడి కాయలు తీసుకుని పోవాలంటే మార్కెట్‌ మధ్యాహ్నానికి మూసివేస్తుండటంతో పంపిన సరుకు మొత్తం మాగిపోతోందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


రైల్వేకోడూరు, మే 16: రైల్వేకోడూరు పండ్ల తోటలకు పెట్టింది పేరు. కోడూరు మామిడికి మంచి గిరాకీ ఉంటుంది.  గత ఏడాది కంటే ఈ ఏడాది ధరలు పూర్తిగా పడిపోయాయి. ఉన్న ధరకైనా కాయలను మహారాష్ట్ర, రాజస్థాన్‌ వంటి నగరాలకు పంపుదామంటే అక్కడ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే మార్కెట్‌ ఉంటుంది. రైల్వేకోడూరు నుంచి లారీల్లో కాయలు వెళ్లేసరికి మార్కెట్‌ మూసి ఉండడం, లేదా పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఉండడంతో లారీ డ్రైవర్లు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కాయలు తీరా మార్కెట్‌కు తరలించేలోపు మాగుతున్నాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మామిడి కాయలు అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో రైతులు, వ్యాపారులు ఆందోళన పడుతున్నారు. ఇదిలా ఉంటే అరటి పరిస్థితి కూడా చాలా దారుణంగా మారింది. కిలో రూ.4 లకు అమ్ముడుపోవడం కష్టంగా మారింది. తోటల్లో గెలలు పక్వదశకు వచ్చి ఉన్నాయి. అరటి కూడా తిరుపతి, రాపూరు, రేణిగుంట, చిత్తూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే మార్కెట్‌లో కరోనా దెబ్బకు అడిగే వారు కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. కొన్ని ప్రాంతాలకు ఎగుమతి ఉన్నా కాయలు అమ్ముడుపోవడం లేదు. అలాగే దోసకాయలను కూడా అడిగే వారు లేరు. కరోనా సెకెండ్‌ వేవ్‌ రాక మునుపు కొంత మేరకు దోస కాయల వ్యాపారం జోరుగా జరిగింది. కరోనా పుంజుకున్న తర్వాత దోస కాయలకు డిమాండు పడిపోయింది. కరోనా పండ్ల తోటల రైతులను కూడా నిలువునా ముంచింది. కూలీలకు పనులు అంతంత మాత్రంగా ఉండడంతో వారికి ఇబ్బందిగా మారింది. గుత్తి, అనంతపురం, నంద్యాల, గుంతకల్లు, ఆళ్లగడ్డ, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి మామిడి సీజన్‌ ప్రారంభం నుంచి మూడు నెలల పాటు వివిధ రకాల పనులు చేసుకుని జీవనోపాధి పొందుతుంటారు. సుమారు 2 వేల మంది కూలీలు ఉన్నారు. కరోనాతో వీరికి జీవనోపాధి ఇబ్బందిగా మారింది. ఇదిలా ఉండగా రైల్వేకోడూరు మార్కెట్‌ యార్డు సీజన్‌లో కళకళలాడుతుండేది. ప్రస్తుతం సీజన్‌ మొదలైనా బోసిపోయి ఉంది.


మామిడి ధరలు ఇలా

మామిడి రకం గత ఏడాది (టన్ను) ఈ ఏడాది

పులిహోర 22-24 వేలు 9-10 వేలు

తోతాపురి 16-18 వేలు 10-11 వేలు

బేనీషా 35-37 వేలు 20-21 వేలు

నాటురకాలు 12-14 వేలు 6 వేలు

రుమాని 18-20 వేలు 8-9 వేలు

ఖాదర్‌ 25-27 వేలు 24-25 వేలు

మల్లిక 35-37 వేలు 27-28 వేలు


పండ్ల తోటల రైతులను ఆదుకోవాలి..

-సాదు చంద్రపాల్‌, మైసూరివారిపల్లె, మామిడి వ్యాపారి 

పండ్ల తోటల రైతులను ఆదుకోవాలి. కరోనా సెకెండ్‌వేవ్‌లో పండ్ల తోటల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్‌లో డిమాండు లేదు. ఇతర ప్రాంతాల్లో ఉన్న మార్కెట్లకు కాయలు వెళ్లేసరికి మాగిపోతున్నాయి. మామిడి తోటల్లో కాయలు ఇప్పటికే మాగుతున్నాయి. ఇటు రైతులు, అటు వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇతర నగరాల్లో అమ్ముకునేందుకు వెసులుబాటు కల్పించాలి.


అప్పులు తీరుతాయని అనుకున్నా..

- కూటాల్‌రెడ్డి, రైతు, మారావారిపల్లె, రైల్వేకోడూరు మండలం

ఈ ఏడాది చేసిన అప్పులు తీరుతాయని అనుకున్నాము. మామిడి మంచి ధరలు పలుకుతాయని పెట్టిన పెట్టుబడులు వస్తాయని అనుకున్నాము. కరోనా దెబ్బకు వ్యాపారం కుప్పకూలింది. దీంతో రైతులు కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. రైతులకు ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాలు, చీడ పీడలతో పాటు ప్రస్తుతం రెండుసార్లు కరోనా దెబ్బ పడింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మామిడి కాయలు కోతలు కోయక తోటల్లోనే ఉన్నాయి. ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించాలి.



Updated Date - 2021-05-17T05:41:39+05:30 IST