ఎగుమతికి సిద్ధంగా ఉన్న మామిడి

ABN , First Publish Date - 2021-04-11T05:54:29+05:30 IST

జిల్లా నుంచి మామిడి ఎగుమతులు ప్రారంభమయ్యాయి. గత ఏడాది కరోనా ప్రభావం ఎగుమతులు, రవాణాపై చూపింది. రవాణా వ్యవస్థ స్తంభించడంతో దాదాపు రూ.100 కోట్ల నష్టం వాటిల్లినట్టు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులో భాగంగా రవాణాకు అనుమతులు వచ్చినా..అప్పటికే రైతులకు, వ్యాపారులకు నష్టం జరిగిపోయింది. ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందంతో ఉన్నారు. కానీ ప్రస్తుతం రెండో దశలో కరోనా కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. దీంతో ఆ ప్రభావం ఎగుమతులపై చూపుతుందన్న బెంగ మాత్రం వెంటాడుతోంది.

ఎగుమతికి సిద్ధంగా ఉన్న మామిడి
ఎగుమతికి సిద్ధంగా ఉన్న మామిడి

జిల్లా నుంచి మామిడి ఎగుమతులు ప్రారంభం

ఉత్తరాదిన ‘కరోనా’తో తగ్గిన వ్యాపారుల తాకిడి

ప్రస్తుతం కోల్‌కత్తాకే రవాణా

   (కొత్తవలస)

జిల్లా నుంచి మామిడి ఎగుమతులు ప్రారంభమయ్యాయి. గత ఏడాది కరోనా ప్రభావం ఎగుమతులు, రవాణాపై చూపింది. రవాణా వ్యవస్థ స్తంభించడంతో దాదాపు రూ.100 కోట్ల నష్టం వాటిల్లినట్టు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులో భాగంగా రవాణాకు అనుమతులు వచ్చినా..అప్పటికే రైతులకు, వ్యాపారులకు నష్టం జరిగిపోయింది. ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందంతో ఉన్నారు. కానీ ప్రస్తుతం రెండో దశలో కరోనా కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. దీంతో ఆ ప్రభావం ఎగుమతులపై చూపుతుందన్న బెంగ మాత్రం వెంటాడుతోంది. 

వ్యాపారుల వెనుకంజ

మామిడి పంటకు జిల్లా పెట్టింది పేరు. ఏటా వందల కోట్ల రూపాయల మామిడి ఉత్పత్తులు జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. కోల్‌కత్తా, ఢిల్లీ, ముంబాయి, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, అసోం, హర్యానా, పంజాబ్‌, చత్తీస్‌గడ్‌ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ముందుగానే వ్యాపారులు రైతులతో మామిడి కొనుగోలుకు ఒప్పందం చేసుకుంటారు. ఇందుకుగాను కొంత మొత్తాన్ని ముందుగానే చెల్లిస్తారు. సాధారణంగా మార్చి మొదటి వారం నుంచే మామిడి సేకరణ, ఎగుమతులు ప్రారంభమవుతాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉండడంతో వ్యాపారులు రావడానికి వెనుకంజ వేస్తున్నారు. దాని ప్రభావం ఎగుమతులపై పడుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  

ప్రస్తుతం కొన్నిరకాలే..

ప్రస్తుతం కొత్తవలస నుంచి వారానికి  రెండుసార్లు  కోల్‌కత్తా మార్కెట్‌కు మామిడి ఎగుమతులు జరుగుతున్నాయి. పణుకులు, సువర్ణ రేఖ వంటి రకాలను ఎగుమతి చేస్తున్నారు. కోల్‌కత్తా మార్కెట్‌లో మామిడికి గిరాకీ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం 50 మామిడి కాయలు కలిగిన బాక్సు రూ.600 నుంచి రూ.700 పలుకుతోంది. ఏప్రిల్‌ నెలాఖరు నుంచి జూన్‌ నెలాఖరు వరకూ మామిడి ఎగుమతులు ఎక్కువగా జరుగుతాయని కోల్‌కత్తా వ్యాపారులు చెబుతున్నారు. మామిడి ఎగుమతులు బాగుంటే కూలీలకు కూడా చేతి నిండా పని దొరుకుతుంది. ఈ మూడు నెలల పాటు వేలాది మంది కూలీలు మామిడి సేకరణ, రవాణా వంటి పనుల్లో నిమగ్నమవుతారు. అటు కొత్తవలస రోజువారీ మార్కెట్‌ ఆశీల వసూళ్లలో మామిడి ఉత్పత్తులదే సింహభాగం. 

 ఈ ఏడాది పంట బాగుంది

ఈ ఏడాది మామిడి పంట ఆశాజనకంగా ఉంటుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం పంట బాగుంది. ఎగుమతులు కూడా ప్రారంభమయ్యాయి. మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది లాక్‌డౌన్‌తో ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలా నష్టపోయాం. ఈ ఏడాది అటువంటి పరిస్థితి ఉండదని ఆశిస్తున్నాం. 

-కృష్ణంరాజు, మామిడి వ్యాపారి

Updated Date - 2021-04-11T05:54:29+05:30 IST