పచ్చిమామిడి బెస్ట్‌!

ABN , First Publish Date - 2020-05-02T16:35:49+05:30 IST

కరోనా ఉంది కదా... ఈ సమయంలో పచ్చిమామిడి వాడొచ్చా? పచ్చిమామిడి కాయతో హెల్దీ వంటకాలు చెప్పండి.

పచ్చిమామిడి బెస్ట్‌!

ఆంధ్రజ్యోతి(02-05-2020)

ప్రశ్న: కరోనా ఉంది కదా... ఈ సమయంలో పచ్చిమామిడి వాడొచ్చా? పచ్చిమామిడి కాయతో హెల్దీ వంటకాలు చెప్పండి. 


-సుప్రియ


డాక్టర్ సమాధానం: ఈ క్వారంటైన్‌ సమయంలో మనదేశంలో ఉన్న పద్ధతులు, వాతావరణం, దొరికే పండ్లు, కూరగాయలు, మసాలాలు... ఇవన్నీ కూడా మనకు వరంగా చెప్పుకోవచ్చు. వీటివల్ల మన రోగనిరోధక శక్తి ఇతర దేశస్థుల కన్నా మెరుగ్గా ఉంది. వీటిలో ప్రస్తుతం చెప్పుకోదగినది పచ్చి మామిడికాయ. దీనిలోని విటమిన్‌-సి నిమ్మ కాయ కన్నా ఆరు రెట్లు ఎక్కువ ఉంటుంది. కరోనా సమయంలో విటమిన్‌-సి ఎంతో అవసరం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో విటమిన్‌ -ఎ కూడా ఉంటుంది. అందేకాదు పచ్చిమామిడిలోని పీచు, మెగ్నీషియం ప్రేగుల్ని శుభ్రపరుస్తుంది. మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. దీనిలో సోడి యం తక్కువ, పొటాషియం ఎక్కువ ఉండటం వల్ల రక్తపోటు ఉన్నవారికి చాలా మంచిది. సులువుగా చేసుకునే రెండు వంటకాలివి. ట్రై చేయండి.


పచ్చిమామిడి పోహా

కావాల్సినవి: తురిమిన పచ్చిమామిడి- ఒక కప్పు, పోహా (అటుకులు)- 2 కప్పులు, సెనగపప్పు- 1 టీ స్పూను, మినపపప్పు- 1 టీ స్పూను, జీడిపప్పు- 10, సన్నగా తరిగిన పచ్చిమిర్చి-4, ఎండుమిర్చి -1, ఆవాలు- అర టీ స్పూను, పసుపు- అర టీ స్పూను, కరివేపాకు- ఒక రెబ్బ, నువ్వుల నూనె- 2 టీ స్పూన్లు, ఉప్పు- తగినంత


తయారీ: ముందుగా అటుకులను నీళ్లలో పోసి, రెండు నిమిషాలాగి నీళ్లు వడకట్టి, అటుకులు పిండాలి. ఒక బాండీలో నూనె వేసి, వేడైన తర్వాత ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేయాలి. అవి వేగిన తర్వాత సెనగపప్పు, మినపపప్పు, జీడిపప్పు, పచ్చిమిర్చి, పసుపు వేసి, దోరగా వేగిన తర్వాత తురిమిన మామిడికాయ వేయాలి. బాగా కలిపి ఉప్పు, నీళ్లలో పిండిన అటుకులు వేసి కలపితే పోహా రెడీ. పుల్లగా, కారంగా ఉండే ఈ స్నాక్‌ హెల్దీ కూడా. ఇంటిల్లిపాది ఇష్టంగా తినొచ్చు.


పచ్చిమామిడి పానీయం

కావాల్సినవి: పచ్చిమామిడి కాయ-1, పంచదార- అరకప్పు, ఉప్పు- చిటికెడు, నీళ్లు- 4 గ్లాసులు


తయారీ: పచ్చి మామిడి కాయను స్టవ్‌ మీద కాల్చాలి. తర్వాత తోలు తీసేసి, గుజ్జును వేరుచేయాలి. ఈ గుజ్జు, పంచదార, ఉప్పు, నీళ్లు కలిపి బ్లెండ్‌ చేసి, ఫ్రిజ్‌లో పెట్టాలి. ఈ పానీయాన్ని రోజుకు రెండుసార్లు తాగితే ఎండ దెబ్బ కొట్టదు.


డాక్టర్‌ బి.జానకి, న్యూట్రిషనిస్ట్‌

drjanakibadugu@gmail.com 

Updated Date - 2020-05-02T16:35:49+05:30 IST