టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం

ABN , First Publish Date - 2021-03-01T06:41:26+05:30 IST

టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం

టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం
ఎన్నికల మేనిఫెస్టో ఆవిష్కరిస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ మంత్రి రవీంద్ర

మచిలీపట్నం టౌన్‌, ఫిబ్రవరి 28 : టీడీపీ పాలనలోనే పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు.  టీడీపీ మునిసిపల్‌ ఎన్నికల మేనిఫెస్టోను కొల్లు రవీంద్ర ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లు తెరిపిస్తామన్నారు. ఇంటి పన్నులుతగ్గిస్తామన్నారు. చంద్రన్న బీమాను పునరుద్ధరిస్తామన్నారు.  నిరుద్యోగులకు భృతి  కల్పిస్తామన్నారు. తాగునీటి వనరులు అభివృద్ధి చేస్తామన్నారు.  చిన్న రుణాలు, ఇంటి పన్నుల బకాయిలు మాఫీ చేస్తామన్నారు. వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఆర్టీసీ చార్జీలు పెంచేశారన్నారు. పెట్రోలు, డీజీల్‌, గ్యాస్‌ ధరలు పెరిగి సామాన్యుల జీవనం భారమైందన్నారు.  ఇసుక సరిగ్గా దొరక్కపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులు పస్త్తులుండే పరిస్థితులు దాపురించాయన్నారు. వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు టీడీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. టీడీపీ నాయకులు మరకాని పరబ్రహ్మం, కరెడ్ల సుశీల, పిప్పళ్ళ కాంతారావు, కట్టా అంజిబాబు, బొడ్డు నాగలక్ష్మి, న్యాయవాదులు లంకే వెంకటేశ్వరరావు, మహమ్మద్‌ సులేమాన్‌,  వెంకటేశ్వరరావు  పాల్గొన్నారు.

టీడీపీని గెలిపించండి : ఆనంద సూర్య

మచిలీపట్నం టౌన్‌: మచిలీపట్నం కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ అధ్యక్షుడు వేమూరి ఆనంద సూర్య కోరారు. రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు వేమూరి రామకృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆనందసూర్య మాట్లాడారు. టీడీపీ పాలనలో ఎస్సీ, బీసీ, మైనారిటీ, బ్రాహ్మణ కార్పొరేషన్లకు సబ్సిడీ రుణాలు అందించామన్నారు. వాటిని వైసీపీ పాలనలో రద్దు చేశారన్నారు. 

  టీడీపీ అభ్యర్ధులను గెలిపిస్తే అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తామన్నారు. పార్టీ శ్రేణులు కార్పొరేషన్‌లో  టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు వేమూరి రామకృష్ణారావు, ఏపీ రాష్ట్ర బ్రాహ్మణ కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ డైరెక్టర్‌ గూడూరు వెంకట హనుమంతరావు, బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ జిల్లా కో ఆర్డినేటర్‌ వాడపల్లి బాలాజీ సువర్ణకుమార్‌, న్యాయవాది లలితకుమారి, వారణాసి దుర్గాసారథి, ఎ.శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.


Updated Date - 2021-03-01T06:41:26+05:30 IST