ఖాళీగా ఉన్న ఇల్లు సునీత మేడం ఇల్లని తెలిసి...: మణికంఠా రెడ్డి

ABN , First Publish Date - 2021-08-15T02:51:48+05:30 IST

పులివెందులలో తాను ఫుడ్ సప్లై చేసే చిన్న వ్యాపారినని మణికంఠా రెడ్డి అన్నారు. ఈనెల 10న అద్దె ఇంటి కోసం వెతుకుతూ వైఎస్ సునీతా ఇంటివద్దకు వెళ్ళానని చెప్పారు.

ఖాళీగా ఉన్న ఇల్లు సునీత మేడం ఇల్లని తెలిసి...: మణికంఠా రెడ్డి

కడప: పులివెందులలో తాను ఫుడ్ సప్లై చేసే చిన్న వ్యాపారినని మణికంఠా రెడ్డి అన్నారు. ఈనెల 10న అద్దె ఇంటి కోసం వెతుకుతూ వైఎస్ సునీతా ఇంటివద్దకు వెళ్ళానని చెప్పారు. ఖాళీగా ఉన్న ఒక ఇల్లు సునీత మేడం ఇల్లు అని తెలిసి పెద్దవారితో మనకెందుకని వెనుతిరిగి వెళ్ళానని పేర్కొన్నారు. తనకు  ఏ పాపం తెలీదన్నారు. వైఎస్ సునీత నన్ను అనుమానించి ఫిర్యాదు చేసిందని చెప్పారు., ఈ విచారణ, ఇవన్నీ చూస్తుంటే తనకు భయంగా ఉందని మణికంఠా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణ భయం ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. 


కాగా ‘‘పులివెందులలోని తమ ఇంటి పరిసరాల్లో అనుమానిత వ్యక్తులు తిరుగుతున్నారని, ఈ నెల 10న కూడా ఓ వ్యక్తి అనునామాస్పదంగా తిరుగుతూ కనిపించాడని, వారి ఉద్దేశం ఏమిటో తమకు తెలియదంటూ కడప ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌కు సీఎం జగన్‌ చిన్నాన్న, మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత శుక్రవారం విన్నవించి రక్షణ కల్పించమని కోరిన  విషయం తెలిసిందే.


సునీత ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో..... ‘మా కుటుంబ భద్రతపై ఆందోళనగా ఉంది. ఈనెల 10న సాయంత్రం 5.20గంటల సమయంలో ఓ వ్యక్తి మా ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. వివేకా హత్య కేసులో అనుమానితుడిగా నేను పేర్కొన్న వ్యక్తుల్లో డి.శివశంకర్‌రెడ్డి ఒకరు. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మా ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా తిరుతున్న వ్యక్తి ఫొటో ఉన్నట్లు గుర్తించాం. ఇదే విషయాన్ని 12న సీఐ భాస్కరరెడ్డి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన మా ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి, కేటరింగ్‌ వ్యాపారం చేసుకునే మణికంఠరెడ్డి అనే వ్యక్తి తన వ్యాపారం కోసం అద్దె స్థలం కోసం అన్వేషిస్తున్నాడు'' అని వివరించారు.


శివశంకరరెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడు. శివశంకరరెడ్డి అనుచరులు తమ ఇంటిచుట్టూ అనుమానాస్పదంగా తిరగడం ఆందోళన కలిగిస్తోందని సునీత ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది.

Updated Date - 2021-08-15T02:51:48+05:30 IST