పేదింటిపై కనికట్టు!

ABN , First Publish Date - 2020-10-14T08:15:00+05:30 IST

పేదలకు ఇంటిస్థలాల లెక్కల్లో ప్రభుత్వం కనికట్టు ప్రదర్శిస్తోంది. లబ్ధిదారుల జాబితాతో పాటే భూ సేకరణ బడ్జెట్‌ను కూడా ...

పేదింటిపై కనికట్టు!

ఇంటిస్థలాల లబ్ధిదారులు, బడ్జెట్‌పై భారీ లెక్కలు

  భూ సేకరణ విలువే రూ.22,285 కోట్లుగా నివేదిక 

ఇందులో పాత పథకాలు, ప్రభుత్వ భూమి విలువ 

లబ్ధిదారులు 29,32,588 మంది అంటున్న రెవెన్యూ 

టిడ్కో, క్రమబద్ధీకరణ జాబితా కూడా దీనిలోనే 

కొత్తగా స్థలాలు ఇచ్చేది 21,90,654 మందికే... 


 (అమరావతి-ఆంధ్రజ్యోతి): పేదలకు ఇంటిస్థలాల లెక్కల్లో ప్రభుత్వం కనికట్టు ప్రదర్శిస్తోంది. లబ్ధిదారుల జాబితాతో పాటే భూ సేకరణ బడ్జెట్‌ను కూడా అమాంతం పెంచేసింది.


ఈ లెక్కలతో తయారు చేసిన నివేదికలను కేంద్రానికి పంపించి ప్రధానితో శెభాష్‌ అనిపించుకోవాలని తాపత్రయపడుతోంది. దీనికోసం అధికారులు తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే, ఆ లెక్కలను తరచిచూస్తే అసలు లోగుట్టు బోధపడుతుంది. జగన్‌ సర్కారు కొలువుదీరిన వెంటనే ‘నవరత్నాలు’ కింద రాష్ట్రంలోని 25లక్షల మంది పేదలకు ఇంటిస్థలాలు ఇస్తామని, ఆ తర్వాత వివిధ పథకాల కింద ఇంటి నిర్మాణం చేపడతామని ప్రకటించారు. ఈ ప్రక్రియ మొదలయ్యే నాటికి ప్రభుత్వం వద్ద ఉన్న భూమి 6వేల ఎకరాలే. మరో 25వేల ఎకరాలకు పైగా ప్రైవేటు భూమిని సేకరించాల్సి వస్తుందని, ఇందుకు రూ.14వేల కోట్ల వరకూ వ్యయమవుతుందని రెవెన్యూశాఖ గతేడాది ఆర్ధికశాఖకు డీపీఆర్‌ ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోటులో ఉన్నందున అంత బడ్జెట్‌ ఇవ్వడం అసాధ్యమని, ప్రైవేటు భూ సేకరణను తగ్గించుకోవాలని, ప్రభుత్వ స్థాయిలోనే అత్యధిక భూమిని సేకరించాలని ఆ శాఖ సూచించింది.    


తాజాగా కేంద్రానికి పంపిన నివేదిక, ఇటీవల సీఎం పరిశీలనకు ఇచ్చిన మరో నివేదికను పరిశీలిస్తే లబ్ధిదారులు, బడ్జెట్‌ లెక్కలు అమాంతం పెరిగిపోయినట్లు స్పష్టమవుతుంది.   ఇతర పథకాలు, స్కీముల్లో ఉన్నవాటిని కూడా ఇంటిస్థలాల జాబితా కిందకు తీసుకొచ్చారు. అధికారిక నివేదిక ప్రకారం... ఇంటిస్థలాల కోసం 29,32,588మంది లబ్ధిదారులను గుర్తించామని రెవెన్యూశాఖ చెబుతోంది. భూసేకరణ, సమీకరణ పేరిట రూ.22,285 కోట్ల వ్యయం అవుతోందని అంచనా వేసింది. నిజానికి ప్రభుత్వం కొత్తగా ఇచ్చే ఇంటిస్థలాలు 21,90,654 మందికే. ఇప్పటికే అమల్లో ఉన్న టిడ్కో పథకం కింద గుర్తించిన లబ్ధిదారులు 2,55,096 మందిని కూడా ఈ జాబితాలో కలిపారు. పేదల ఆధీనంలో ఉన్న, ఆక్రమణలో ఉన్నవాటిని రెగ్యులరైజ్‌ చేసిన కేసులను కూడా దీనిలో కలిపేశారు. ఈ జాబితాలో 4,86,838 మంది ఉన్నారు. ఏఎంఆర్‌డీ పరిధిలో 50,695 మందికి ఇచ్చే ఇళ్లను కూడా కలిపేశారు.    భూసేకరణ మరింత భారం   భూ సేకరణకు రెవెన్యూశాఖ ఇచ్చిన డీపీఆర్‌ ప్రకారం రూ.14వేల కోట్లు ఖర్చువుతుందనుకున్నారు. చివరికి ఇప్పుడు రూ.22,285 కోట్లకు అంచనాలను చూపించారు. ప్రభుత్వం వద్ద 25,193.33 ఎకరాల భూమి ఉంది. పేదలకు ఇస్తున్న ఆ భూమి విలువను రూ.7,700 కోట్లుగా అంచనా వేశారు. ప్రైవేటుగా సేకరించిన 23,342.54 ఎకరాల ఖర్చు రూ.9,200 కోట్లని తేల్చారు. ఇక, భూ సమీకరణకు రూ.1,350 కోట్లు, అమరావతి మెట్రో రీజియన్‌లోని భూమికి రూ.325కోట్లు, టిడ్కో కింద ఇచ్చే ఇంటిస్థలాలు, ప్లాట్లకు రూ.810కోట్లు లెక్క చూపారు. పేదల స్వాధీనంలో ఉన్నవి, ఆక్రమణలో ఉన్నవి క్రమబద్ధీకరించిన ఇళ్లకు రూ.2,900కోట్ల వ్యయం చూపారు. దీంతో భూసేకరణ వ్యయం అమాంతం పెరిగిపోయింది.

Updated Date - 2020-10-14T08:15:00+05:30 IST