Abn logo
Aug 2 2021 @ 00:04AM

పింఛన్ల గోల్‌మాల్‌

 - ఇంటింటి సర్వేతో వెలుగులోకి 

- మరణించిన వారి ఖాతాల్లోకి డబ్బులు 

- ఒకరి పింఛన్‌ మరొకరి ఖాతాలో 

-  పెద్దోళ్ల ఇళ్లలోనూ లబ్ధిదారులు 

-  ఆసరా, బీడీ కార్మికుల పింఛన్లలో అవకతవకలు 

- సిరిసిల్ల మున్సిపాలిటీలో సర్వే

- వెలుగులోకి 200 మంది పింఛన్లు  


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఆసరా  పింఛన్లు డబుల్‌ కావడంతో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి.  బీడీ కార్మికుల పింఛన్లలో అనేక అవకతవకలు చోటుచేసుకోగా తాజాగా చనిపోయిన వారి ఖాతాల్లో పింఛన్లు జమవుతుండడం,  కొంతమంది ప్రజాప్రతినిధులు, ధనవంతుల ఇళ్లలోకి కూడా పింఛన్లు చేరుతుండడం వంటివి వెలుగు చూస్తున్నాయి. అర్హతలు ఉండి  పేదరికంతో కొట్టుమిట్టాడుతూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వారికి మాత్రం పింఛన్లు అందడం లేదు.   రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగు చూస్తున్న పింఛన్ల గోల్‌మాల్‌ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.  ఐదేళ్ల క్రితం చనిపోయిన వారి పింఛన్లు కూడా ఇంకా కొనసాగుతున్న వైనం  తాజాగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో మరణ  ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నా పింఛన్ల తొలగింపులో నిర్లక్ష్యం కనిపిస్తోంది. మరోవైపు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు కూడా పింఛన్లు పొందుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటనలతో అధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు.  సిరిసిల్ల మున్సిపాలిటీలో కొనసాగుతున్న సర్వేలో ఇప్పటి వరకు చనిపోయిన  200 మంది ఖాతాల్లో పడుతున్నట్లు తేలింది.  వీటితోపాటు దాదాపు 30 మంది ఉద్యోగుల ఇళ్లలోనూ ఆసరా పింఛన్లు పొందుతున్నవారు ఉన్నారు.  ప్రస్తుతం సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న సర్వే అన్ని మండలాలు, గ్రామాల్లోనూ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో గతంలో ఆసరాలో అనేక అక్రమాలు వెలుగు చూశాయి.  ప్రొసీడింగ్‌లు ఉన్నా డబ్బులు రాని వైనం బయటపడింది. ఒక బీడీ కార్మికురాలు నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగింది.  ప్రొసిడింగ్‌ వచ్చినా డబ్బులు రావడం లేదని వాపోయింది. చివరకు పరిశీలించగా ఆమె డబ్బులు వేరే ఖాతాల్లో పడుతున్న వైనం వెలుగుచూసింది.  పింఛన్‌ హ్యాకింగ్‌ ద్వారా 15 మంది డబ్బులు కాజేసిన వైనం కూడా సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో వెలుగు చూసింది. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వేములవాడ, చందుర్తి, మండలాల్లో పీఎఫ్‌ లేకపోయినా ఇతర పత్రాలతో పింఛన్లు పొందిన వారిని గుర్తించి తొలగించారు. తాజాగా జిల్లాలో జరుగుతున్న సర్వేలో కొంతమంది ప్రజాప్రతినిధులు, ఉద్యోగులతోపాటు నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు పొందుతున్నావారు ఉన్నారు. చనిపోయినా  పింఛన్‌ డబ్బులు ఖాతాల్లో పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. 


జిల్లాలో 1,08,796 పింఛన్‌ దారులు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,08,796 మంది పింఛన్‌ దారులు ఉన్నారు.  ప్రతి నెలా రూ.22,99,75,976 పింఛన్ల సొమ్ము అందుకుంటున్నారు. ఇందులో వృద్ధాప్య  పింఛన్లు 25,528 మందికి, వితంతు 22,169, దివ్యాంగులు 10,093, చేనేత 3,731, గీత కార్మికులు 2,131, బీడీ కార్మికులు 43,337 మంది, ఒంటరి మహిళలు 1,807 మంది ఉన్నారు. మండలాల వారీగా చూస్తే పింఛన్‌ దారుల్లో బోయినపల్లిలో 6,019 మంది, చందుర్తి 6,302, ఇల్లంతకుంట 6,906, గంభీరావుపేట 10,811, కోనరావుపేట 8,511, ముస్తాబాద్‌ 9,681, రుద్రంగి 2,642, సిరిసిల్ల మున్సిపాలిటీ 21,426, తంగళ్లపల్లి 9,800, వీర్నపల్లి 1,804, వేములవాడ 2,757, వేములవాడ రూరల్‌ 5,164, వేములవాడ మున్సిపాలిటీ 6,597, ఎల్లారెడ్డిపేట 10,376 మంది లబ్ధిదారులు ప్రతి నెలా పింఛన్‌ పొందుతున్నారు. ఈ పింఛన్‌ దారుల్లో ఇటీవల కాలంలో కరోనా, వృద్ధాప్యం, అనారోగ్యం కారణాలతో అనేక మంది చనిపోయిన వారు ఉన్నారు. వారితోపాటు చాలాకాలం క్రితమే చనిపోయిన వారి ఖాతాల్లోనూ పింఛన్లు జమవుతున్నాయి. ఈ పింఛన్ల ఏరివేత కార్యక్రమంలో భాగంగా అధికారులు ఇంటింటి సర్వే ప్రారంభించారు. దీంతో అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.