లాసెట్‌ నిర్వహణలో అవకతవకలు..?

ABN , First Publish Date - 2021-10-12T06:04:01+05:30 IST

ఏపీ న్యాయ విద్య ప్రవేశాల పరీక్ష (లాసెట్‌) నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

లాసెట్‌ నిర్వహణలో అవకతవకలు..?

నిధుల వినియోగ బిల్లుల సమర్పణలో జాప్యం

వెంటనే పంపాలని ఉన్నత విద్యామండలి లేఖ

స్పందించని ఎస్కేయూ పాలనాధికారులు


అనంతపురం అర్బన, అక్టోబరు 11 : ఏపీ న్యాయ విద్య ప్రవేశాల పరీక్ష (లాసెట్‌) నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇందులో భాగంగానే నిర్వహణకు సం బంధిన బిల్లులను ఎస్కేయూ అధికారులు సమర్పించడంలేదని వి ద్యార్థుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2018-19, 2019-20, 2020-21 సంవత్సరాల్లో ఏపీ లాసెట్‌ నిర్వహణ, ప్రవేశాలకు సంబంధించిన యుటిలైజేషన సర్టిఫికెట్‌, ఆడిట్‌ స్టేట్‌మెంట్‌, విభాగాలవారీగా ఖర్చుల వివరాలను సమర్పించాలని ఈ ఏడాది మార్చి 16వ తేదీన రాష్ట్ర ఉన్నత విద్యామండలి.. ఎస్కేయూ అధికారులను ఆదేశించింది. మూడేళ్ల వివరాలను పంపాలని అందులో పేర్కొంది. దానిపై మూడు నెలలైనా అధికారులు స్పందించలేదు. దీంతో ఉన్నత విద్యామండలి జూలై 17దీన మరొక ఉత్తర్వు జారీచేసింది. ఏకంగా లాసెట్‌ కన్వీనర్‌ జ్యోతి విజయకుమార్‌కు మెమో జారీ చేసింది. అయినా ఎస్కేయూ అధికారులు నిర్లక్ష్యం వీడకపోవడం వెనుక నిధుల అవకతవకలే ప్రధాన కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.


బిల్లుల సమర్పణలో జాప్యం...

లాసెట్‌ నిర్వహణకు రాష్ట్ర ఉన్నతవిద్యామండలి ప్రతి సంవంత్సరం ముందస్తు నిధులను చెల్లిస్తుంది. ఇందులో భాగంగా 2018-19, 2019-20 సంవత్సరాలకు దాదాపు రూ.1.20కోట్లు విడుదల చేసింది. వీటి వినియోగ బిల్లులను సమర్పించకపోవడంతో 2020-2021 సం వత్సరానికి ముందస్తు నిధులను ఇవ్వలేదు. పరీక్షల నిర్వహణకు ఖర్చు చేసిన వాటి బిల్లులను ఉన్నత విద్యామండలికి సమర్పించాలి. అందులో ఎస్కేయూ అధికారులు జాప్యం చేస్తున్నారు.


పెన్షన నిలిపేయండి...

లాసెట్‌ను ఎస్కేయూ ఆధ్వర్యంలో మూడేళ్లు నిర్వహించారు. 2018-19, 2019-20, 2020-21 సంవత్సరాలకు లాసెట్‌ కన్వీనర్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్‌ జ్యోతి విజయకుమార్‌ ఇటీవలే ఉద్యోగ విరమణ పొందారు. దీంతో అడ్వాన్స బిల్లులు చెల్లంచనందున ఆయనకు పెన్షన నిలిపివేయాలని ఎస్కేయూకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి లేఖరాసింది. ఈ మేరకు ఎస్కేయూ పాలనాధికారులు నిర్ణయాన్ని ఉన్నత విద్యామండలికి ఇంకా స్పష్టం చేయలేద ని తెలుస్తోంది.


నిధుల వినియోగంలో గోల్‌మాల్‌...?

లాసెట్‌ నిర్వహణ నిధుల వినియోగంలో గోల్‌మాల్‌ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిధుల వివరాలను ఏటా అడిట్‌ చేయించాలి. ఆ బిల్లును రాష్ట్ర ఉన్నత విద్యామండలికి సమర్పించాలి. కరోనా సాకు చూపుతూ మూడు సంవత్సరాలుగా ఆలస్యం చేయడం నిధుల వినియోగం గోల్‌మాల్‌ ఆరోపణలకు మరింత ఊతమిస్తోందన్న వాదన ఎస్కేయూ వర్గాల నుంచే వినబడుతోం ది. ఏపీ లాసెట్‌ నిర్వహణ, ప్రవేశాలకు సంబంధించిన యుటిలైజేషన సర్టిఫికెట్‌, ఆడిట్‌ స్టేట్‌మెంట్‌, విభాగాలవారీగా ఖర్చుల వివరాలను సమర్పించాలని ఈ ఏడాది మార్చి 16న రాష్ట్ర ఉన్నత విద్యామండలి.. ఎస్కేయూ అధికారులకు ఉత్తర్వులు జారీచేశారు. మూడు సంవత్సరాల వివరాలను పంపాలని అందుతో స్పష్టంగా పేర్కొంది. వాటి వివరాలను అందజేయడంలో మూడు నెలలైనా అధికారులు స్పందించలేదు. దీంతో ఉన్నత విద్యామండలి జూలై 17వ తేదీన మరొక ఉత్తర్వు జారీచేసింది. ఏకంగా లాసెట్‌ కన్వీనర్‌ జ్యోతి విజయకుమార్‌కు మెమో జారీ చేసింది. అయినా ఎస్కే యూ అధికారులు నిర్లక్ష్యం వీడకపోవడం గమనార్మం.


ఉన్నత విద్యామండలికి సమర్పిస్తా: ప్రొఫెసర్‌ జ్యోతి విజయకుమార్‌, లాసెట్‌ కన్వీనర్‌

ఎస్కేయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ లాసెట్‌కు సబంధించిన నిధుల వినియోగ బిల్లుల సమర్పణ కరోనా కారణంగా ఆలస్యమైంది. మూడు సంవత్సరాల నిధుల వినియోగ సర్టిఫికెట్లు, ఆడిట్‌ స్టేట్‌మెంట్లు, హెడ్‌వైజ్‌ ఖర్చుల వివరాలు అన్నీ ఉన్నాయి. వాటిని ఉన్నత విద్యామండలికి సమర్పిస్తా.


Updated Date - 2021-10-12T06:04:01+05:30 IST