టీఎన్జీవో భూముల్లో అవకతవకలు

ABN , First Publish Date - 2020-07-14T08:58:43+05:30 IST

హైదరాబాద్‌లోని టీఎన్జీవో ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో జరిగిన అవకతవకలపై

టీఎన్జీవో భూముల్లో అవకతవకలు

  • ఏసీబీతో విచారణ జరిపించాలి.. గవర్నర్‌కు ఎఫ్‌జీజీ లేఖ

హైదరాబాద్‌, జూలై 13(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని టీఎన్జీవో ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో జరిగిన అవకతవకలపై ఏసీబీతో విచారణ జరిపించాలంటూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు సోమవారం ఫోరంఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) లేఖ రాసింది. గోపన్‌పల్లిలో 160 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం టీఎన్జీవో ఉద్యోగులకు కేటాయించిందని, అందులో 2102 ప్లాట్‌లు అభివృద్ధి చేశారని గుర్తు చేసింది. 1938 ప్లాట్‌లు మాత్రమే ఉద్యోగులకు కేటాయించారని, 164 ప్లాట్‌లు ఇప్పటికీ ఇవ్వలేదని గవర్నర్‌  దృష్టికి తీసుకెళ్లింది. 760 ప్లాట్‌లు సొసైటీలో సభ్యులు కాని వారికి  కేటాయించారని ఆరోపించింది. ప్లాట్‌ల అభివృద్ధి పేరుతో సొసైటీ సభ్యుల నుంచి రూ.97 కోట్లు వసూలు చేశారని, అందులో చాలా డబ్బు అవినీతిపాలైందని పేర్కొంది. ఈ అవకతవకలపై అప్పటి సొసైటీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌, ఇతర సభ్యులపై బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయిందని వివరించింది. ప్రభుత్వం చిరు ఉద్యోగులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను సొసైటీ అధ్యక్షుడు, ఇతర కార్యవర్గ సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా ఇతరులకు అమ్ముకున్నారని ఆరోపించింది. ఇళ్లస్థలాల అవకతవకలపై జోక్యం చేసుకుని ఏసీబీతో విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని  గవర్నర్‌ను ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖలో కోరారు.  

Updated Date - 2020-07-14T08:58:43+05:30 IST