మనోహర్‌ పంతులు ఇక లేరు

ABN , First Publish Date - 2021-10-22T07:13:42+05:30 IST

స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ జడ్పీటీసీ, మాజీ సర్పంచ్‌ రామన్నపేట మండలంలోని జనంపల్లి గ్రామానికి చెందిన వేమవరపు మనోహర్‌ పంతులు(101) గురువారం రాత్రి మృతి చెందారు.

మనోహర్‌ పంతులు ఇక లేరు
మనోహర్‌ పంతులు(ఫైల్‌)

స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ తొలి, మలి ఉద్యమకారుడు

స్వగ్రామం జనంపల్లిలో నేడు అంతిమ వీడ్కోలు

రామన్నపేట, అక్టోబరు 21: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ జడ్పీటీసీ, మాజీ సర్పంచ్‌ రామన్నపేట మండలంలోని జనంపల్లి గ్రామానికి చెందిన వేమవరపు మనోహర్‌ పంతులు(101) గురువారం రాత్రి మృతి చెందారు. 1921 జనవరి 1న వెంకటరత్నం - సత్తమ్మ దంపతులకు జనంపల్లి గ్రామంలో జన్మించిన ఆయన విద్యార్థి దశలోనే ఆర్య సమాజ ఉద్యమానికి ఆకర్షితులై రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. జవహర్‌లాల్‌ నెహ్రూ స్థాపించిన భారత్‌ సేవా సమాజ్‌కు రామన్నపేట సమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆంధ్ర మహాసభ, ఆంద్ర జనసంఘం ఉద్యమాలతోపాటు పలు ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో చురుకుగా పాల్గొని ప్రజల హృదయాలను చూరగొన్నారు. వివాహం అనంతరం పిల్లలు లేకపోవటంతో సోదరుడి పిల్లలను పోషించారు. గుండ్రాంపల్లి, వాయిళ్ళపల్లి రజాకార్ల క్యాంపులపై జరిగిన దాడుల్లో పాల్గొన్నారు. 1989లో భారత ప్రభుత్వం మనోహర్‌ పంతులును స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తించింది. నిజాం సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం అయిన తర్వాత జనంపల్లి గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు.  నిరంతరం ప్రజా సేవకు అంకితమై రెండుసార్లు గ్రామ సర్పంచ్‌గా, జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందరికీ విద్యను అందించాలన్న ఉద్దేశ్యంతో గ్రామంలో బాలికల గురుకుల పాఠశాలకు 10 ఎకరాలు, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు మూడున్నర ఎకరాల భూమిని దానం చేశారు. ఎందరో నిరుపేద విద్యార్థులు ఆయన అందించిన ఆర్థికసాయంతో డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లుగా ఎదిగారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఎన్‌ఎ్‌సఎ్‌స భవన నిర్మాణానికి రూ.2లక్షల విరాళం అందజేశారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు అందించేందుకు రూ.లక్ష విరాళం అందజేశారు. ఇబ్రహీంపట్నం, వినోభానగర్‌లో జ్యోతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంధుల పాఠశాలకు ప్రతి సంవత్సరం రూ. 50వేలు అందజేస్తున్నారు. రామన్నపేటలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కళావేదిక నిర్మించడంతోపాటు మండలంలోని అనేక దేవాలయాల నిర్మాణానికి చేయూతనందించారు. కొద్దిరోజులుగా  మనోహర్‌ పంతులు మృతికి పలువురు సంతాపం తెలిపారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేమవరపు మనోహర్‌పంతులు హైదరాబాద్‌లోని కిమ్స్‌  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందారు. మృతదేహాన్ని స్వగ్రామం జనంపల్లికి తీసుకువచ్చారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

Updated Date - 2021-10-22T07:13:42+05:30 IST