కొవిడ్‌ ఆస్పత్రుల్లో మ్యాన్‌పవర్‌ ఏదీ?

ABN , First Publish Date - 2021-05-20T06:16:32+05:30 IST

ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత నెలకొంది.

కొవిడ్‌ ఆస్పత్రుల్లో మ్యాన్‌పవర్‌ ఏదీ?

ముందుకురాని స్పెషలిస్టులు, నర్సులు, పారిశుధ్య సిబ్బంది


తిరుపతి, మే 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత నెలకొంది. నోటిఫికేషన్లు ఇచ్చినా పలు విభాగాల్లో చేరేందుకు సుముఖత చూపడంలేదు. సరైన వేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపకపోవడం వల్లే సిబ్బంది నియామకం జరగడంలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొవిడ్‌ బాధితులకు నిబంధనల మేరకు చికిత్స అందించేందుకు ప్రస్తుతం ఉన్న సిబ్బందితో పాటు మరికొంతమందిని నియమించుకోవాలని ప్రభుత్వం విభాగాలవారీగా సూచనలు చేసింది. ఆ మేరకు జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్‌ ఇచ్చింది. అయితే స్పెషలిస్టులు, శానిటరీ సిబ్బంది ముందుకు రావడంలేదు.  141 మంది స్పెషలిస్టు వైద్యులు అవసరం ఉండగా కేవలం 4 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. శానిటేషన్‌ సిబ్బంది అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ద్వారా 289మందిని కొత్తగా నియమించుకోవాల్సి ఉండగా కేవలం 50 మందే వచ్చారు. ట్రైనీ నర్సులు 1720మందికి అవకాశం ఉండగా 56మంది మాత్రమే ఉన్నారు. మెడికల్‌ ఆఫీసర్లు మాత్రం 340కి అనుమతి ఉంటే 401 మందిని, స్టాఫ్‌ నర్సులు 261కి అనుమతి ఉంటే 345 మందిని యంత్రాంగం నియమించింది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ కలిపి 46 ఆస్పత్రుల్లో కొవిడ్‌కు చికిత్స అందుతోంది. వీటిలో ప్రభుత్వ ఆస్పత్రులైన స్విమ్స్‌, రుయా, చిత్తూరు, మదనపల్లెలోని జిల్లా ఆసుపత్రులు, శ్రీకాళహస్తి, కుప్పంలోని ఏరియా ఆసుపత్రులు, రేణిగుంట రైల్వే హాస్పిటల్‌, ఈఎస్‌ఐ, ఎస్వీ ఆయుర్వేద హాస్పిటల్స్‌లో ఐసీయూ పడకలు 350, ఆక్సిజన్‌ పడకలు 1480, నాన్‌ ఆక్సిజన్‌ పడకలు 1044 మొత్తం 2874 పడకలు ఉన్నాయి. వీటిలో 294 వెంటిలేటర్లతో చికిత్స అందిస్తున్నారు. స్పెషలిస్టు వైద్యులు లేకపోవడం కొవిడ్‌ బాధితులకు శాపంగా మారుతోంది. అదేవిధంగా సరిపడనంత శానిటేషన్‌ సిబ్బంది కూడా కొవిడ్‌ ఆస్పత్రుల్లో పనిచేసేందుకు ముందుకు రావడంలేదు. దీనివల్ల ప్రభుత్వాస్పత్రుల్లోని కొవిడ్‌ వార్డులు అధ్వానంగా ఉన్నాయని బాధితులు వాపోతున్నారు.

Updated Date - 2021-05-20T06:16:32+05:30 IST