రుతుపవనాల వల్ల విస్తారంగా వర్షాలు: వాతావరణ శాఖ

ABN , First Publish Date - 2020-06-01T21:59:19+05:30 IST

నైరుతి రుతుపవనాల వల్ల దేశంలో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ...

రుతుపవనాల వల్ల విస్తారంగా వర్షాలు: వాతావరణ శాఖ

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాల వల్ల దేశంలో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తాయని  వాతావారణ శాఖ వెల్లడించింది. ఈరోజు కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలకు ఎటువంటి ఆటంకాలు లేవని, దీనివల్ల దేశ వ్యాప్తంగా 102శాతం వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను జాతీయ వాతావరణ శాఖ(ఐఎండీ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహోపాత్ర మీడియాకు వెల్లడించారు. ‘నైరుతి రుతుపవనాల వల్ల రాబోయే మూడు రోజుల్లో కేరళ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు 80శాతం ఐఎండీ సెంటర్లు గుర్తించాయి’ అని మహోపాత్ర తెలిపారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం గురించి వివరిస్తూ, దాని ప్రభావం కచ్చితంగా నైరుతి రుతుపవనాలపై ఉంటుందని అన్నారు. అయితే ఆ అల్పపీడనం కూడా జూన్ 3వ తేదీనాటికి భారత్ వైపు మళ్లుతుందని, దీనివల్ల గుజరాత్, మహరాష్ట్ర రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. రానున్న 48 గంటల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అందువల్ల మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లవద్దని సూచించామని మహోపాత్ర తెలిపారు.

 

భూ పరిజ్ఞాన మంత్రిత్వ  శాఖ(ఎర్త్ సైన్స్ మినిస్ట్రీ) కార్యదర్శి డాక్టర్ మాధవన్ నాయర్ రాజీవన్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది రుతుపవనాలకు పూర్తిగా అనుకూలమైన వాతావరణం ఉందని తెలిపారు. జూన్ నుంచి సెప్టెంబరు మధ్యలో దాదాపు 102 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. భారత వార్షిక వర్షపాతంలో ఈ రుతుపవనాల వల్ల 70 శాతం నమోదవుతుందని వివరించారు.

Updated Date - 2020-06-01T21:59:19+05:30 IST