Abn logo
Feb 24 2020 @ 01:08AM

మంత్రసాని

దేహం సమస్తం మొస మర్రని ఆయాసం

నలుదిక్కులా బంధించబడ్డ విశ్వాసం

మూకుమ్మడి గాయాలతో కమిలిన దేశం


ఏక దృవాత్మతా రంపె కోతకు

వచ్చెలు వచ్చెలవుతున్న బహుళత్వం

వైవిధ్య ఆత్మకు తుమ్మ ముల్లు


మన్ను మన సరిహద్దులదే

ఇత్తనం ఇక్కడి వారసత్వపు అంకురోత్పత్తి

గాలి, గంగ నీళ్ల జవకు

మొక్కలు విస్తరించిన వృక్షారణ్యం


ఆకాశంలో ఆమ్లజని కలిసినట్లు

వేల ఏండ్ల నుంచీ పాలల్ల పంచదార


తాతలనాటి సమాధుల కెల్లి

పుర్రె పుర్రెనూ ఏరి, జల్లెడ పట్టు

బొక్క బొక్కకూ కార్బన్‌ డేటింగ్‌ చెయ్యి

మన హోమోసెపియనే లేచి నవ్వుతడు


జన్మమొక క్రోమోజోముల కలయిక

పుట్టిన మాయనే వాని లోకం

సంచారం సహజీవనం అంతర్ధానం

అన్నీ ఈ భూమండలం మీన్నే


రకరకాల చెట్లు రంగురంగుల పూలు

చెట్టు చెట్టుదొక సాంస్కృతిక వైచిత్రి

పిట్ట పిట్టదీ తీరు తీరు కూత


పుట్టిన ఊరే పురా ప్రపంచం

మంత్రసానే మనస్సాక్షి

డియన్‌ఏ పరీక్షలు చేస్తేనే

కుల్లం కుల్ల తెల్లగోలు అయితది.

అన్నవరం దేవేందర్‌

Advertisement
Advertisement
Advertisement