బ్రాండెడ్‌ కంపెనీ లోగోతో నకిలీ మాస్క్‌ల తయారీ

ABN , First Publish Date - 2021-04-16T07:03:53+05:30 IST

సిరిసిల్ల పట్టణంలోని శివనగర్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ కేంద్రంగా ఓ బ్రాండెడ్‌ కంపెనీ లోగోతో మాస్క్‌లు తయారు చేసి విక్ర యిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది.

బ్రాండెడ్‌ కంపెనీ లోగోతో నకిలీ మాస్క్‌ల తయారీ
వివరాలు వెల్లడిస్తున్న సీఐ ఉపేందర్‌

- ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు  

- రూ. 5 లక్షల విలువైన మాస్క్‌లు, కంప్యూటర్‌ సీజ్‌ 

- వ్యాపారి, ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వాహకుడి రిమాండ్‌ 

- సిరిసిల్ల టౌన్‌ ఇన్‌చార్జి సీఐ ఉపేందర్‌ 

సిరిసిల్ల క్రైం, ఏప్రిల్‌ 15: సిరిసిల్ల పట్టణంలోని శివనగర్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ కేంద్రంగా ఓ బ్రాండెడ్‌ కంపెనీ లోగోతో మాస్క్‌లు తయారు చేసి విక్ర యిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. గురువారం సాయంత్రం  సిరిసిల్ల టౌన్‌ ఇన్‌చార్జి సీఐ ఉపేందర్‌  వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్ల పట్ట ణంలోని గీతానగర్‌కు చెందిన ఈగ బలరాం గాంధీనగర్‌లో ఎంఎస్‌ బలరాం వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఓ బ్రాండెడ్‌ కంపెనీ మాస్క్‌లు ఎక్కువగా అమ్మ కాలు సాగుతున్నాయనే ఉద్దేశంతో మూడు నెలల క్రితం సిరిసిల్ల పట్టణంలోని శివనగర్‌లో గల ఉమ ప్రింటర్స్‌ నిర్వహకుడితో జత కలిశాడు. ప్రింటింగ్‌ ప్రెస్‌లో సదరు కంపెనీ లోగోను కంప్యూటర్‌లో డిజైన్‌ చేసి మామూలూ మాస్క్‌లపై స్ర్కీన్‌ ప్రింటింగ్‌ వేసి తయారు చేశారు. ఈ విధంగా ప్రతి రోజు 2 వేల మాస్క్‌ల చొప్పున 3 నెలలుగా లక్ష 20 వేల మాస్క్‌లను విక్రయిస్తూ సొమ్ము చేసుకున్నారు. ఈ క్రమంలో బ్రాండెడ్‌ కంపెనీ డిస్ర్టిబ్యూ టర్‌గా చెలామణీ అవుతూ దొంగ మాస్క్‌లు రూ. 20 నుంచి రూ. 50 వరకు విక్రయిస్తూ మూడు నెలలుగా రూ. 50 లక్షల వ్యాపారం నిర్వహించినట్లు బహిర్గతమైంది. ఈ మేరకు టౌన్‌ ఎస్‌ఐ సుధాకర్‌ ఆధ్వర్యంలో ఉమాశంకర్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌పై, అతడి ఇంటిపై దాడులు చేశారు. ఈ దాడుల్లో దాదాపు రూ. 5లక్షల విలువైన నకిలీ మాస్క్‌లు, ప్రింటింగ్‌ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యాపారానికి పాల్పడి సొమ్ము చేసుకున్న వస్త్ర వ్యాపారి ఈగ బలరాం, ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వహకులు ఉమాశంకర్‌ను ఆరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. 

Updated Date - 2021-04-16T07:03:53+05:30 IST