ఎల్‌జీ పాలిమర్స్‌లో గృహోపకరణాల తయారీ

ABN , First Publish Date - 2021-09-17T05:39:37+05:30 IST

గోపాలపట్నం సమీపానున్న ఎల్‌జీ పాలిమర్స్‌లో ప్రమాదకరమైన రసాయనాలు, ప్లాస్టిక్‌ తయారీకి అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.

ఎల్‌జీ పాలిమర్స్‌లో గృహోపకరణాల తయారీ

మంత్రి మండలి పచ్చజెండా

గతంలో పనిచేసిన సిబ్బందిని తీసుకోవాల్సిందిగా ప్రజా సంఘాల డిమాండ్‌


విశాఖపట్నం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): గోపాలపట్నం సమీపానున్న ఎల్‌జీ పాలిమర్స్‌లో ప్రమాదకరమైన రసాయనాలు, ప్లాస్టిక్‌ తయారీకి అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. గత ఏడాది మే ఏడో తేదీన ఆ పరిశ్రమలో విషవాయువు లీకై 12 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన తరువాత పరిశ్రమను మూసివేశారు. ప్రమాదకరమైన ఆ పరిశ్రమను అక్కడి నుంచి తరలించాలని ప్రజా సంఘాలు, వామపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ యాజమాన్యం తాము గతంలో మాదిరిగా కెమికల్‌ సంబంధిత ఉత్పత్తులు తయారు చేయబోమని, గృహోపకరణాలు తయారుచేస్తామని, అనుమతి ఇవ్వాలని కోరింది. ఇదే సమయంలో ఆ పరిశ్రమలో గతంలో పనిచేసి, ఇప్పుడు ఉపాధి లేకుండాపోయిన 400 కుటుంబాలు కూడా తమకు అక్కడే ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థ ప్రతిపాదననను పరిశీలించిన మంత్రి మండలి గురువారం నాటి సమావేశంలో గృహోపకరణాల తయారీకి పచ్చజెండా ఊపింది. అయితే, ఏమి తయారుచేస్తారు?, వాటి వల్ల ఏయే వ్యర్థాలు వస్తాయి?, వాటి వల్ల పర్యావరణ ప్రభావం ఎంత అనేది వెల్లడించాల్సి ఉంది. అలాగే గతంలో ఆ సంస్థలో పనిచేసిన వారికి తిరిగి ఉపాధి కల్పించాల్సి ఉంది. ఇవన్నీ సక్రమంగా వుంటేనే అనుమతిస్తామని, లేదంటే...మళ్లీ ఆందోళన తప్పదని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Updated Date - 2021-09-17T05:39:37+05:30 IST