తెలుగు రాష్ట్రాల్లో ‘తయారీ’ బంద్

ABN , First Publish Date - 2020-03-24T09:54:21+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కంపెనీలు కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు చేపట్టాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేశాయి. ఉద్యోగుల ఆరోగ్య భద్రత...

తెలుగు రాష్ట్రాల్లో ‘తయారీ’ బంద్

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కంపెనీలు కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు చేపట్టాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేశాయి. ఉద్యోగుల ఆరోగ్య భద్రత, నియమనిబంధనలకు అనుగుణంగా వీలైన చోట ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాయి. కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ హైదరాబాద్‌లోని తన రిజిస్టర్‌ కార్యాలయం, ప్రభుత్వం నోటిఫై చేసిన జిల్లాల్లోని డివిజినల్‌ కార్యాలయాల్లోని ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయమని కోరింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుల్లోని ఎరువుల ప్లాంట్లలో పని చేసే వారి సంఖ్యను తగ్గించింది.


ఈ నెల 31 వరకూ అమలులో ఉంటుందని కంపెనీ తెలిపింది. జీఓసీఎల్‌ కార్పొరేషన్‌ హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయాన్ని మూసివేసింది. ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు కల్పించింది. మరోవైపు ఈ నెల 31 ప్లాంట్లలో వరకూ నిలిపివేస్తున్నట్లు పిట్టి ఇంజనీరింగ్‌ వెల్లడించింది. హైదరాబాద్‌తో సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న యూనిట్లలో అత్యవసరమైన ఉత్పత్తి కార్యకలాపాలను మాత్రమే చేపడుతున్నట్లు భెల్‌ వెల్లడించింది. 


అదే బాటలో సిమెంట్‌ కంపెనీలు..

తెలుగు రాష్ట్రాలు సిమెంట్‌ ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో సిమెంట్‌ యూనిట్లు కలిగిన కొన్ని కంపెనీలు ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను అమలు చేయడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో సహా తమిళనాడు, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లోని సిమెంట్‌ ఉత్పత్తి యూనిట్లలో ఉత్పత్తిని ఇండియా సిమెంట్స్‌ నిలిపివేసింది. సాగర్‌ సిమెంట్స్‌, దాని అనుబంధ కంపెనీలు సైతం తెలుగు రాష్ట్రాల్లోని యూనిట్లలో సిమెంట్‌ ఉత్పత్తిని బంద్‌ చేశాయి. కాగా తెలంగాణాలోని సిమెంట్‌ ప్లాంట్‌లో ఉత్పత్తిని 31 వరకూ నిలిపివేస్తున్నట్లు అంజనీ పోర్ట్‌లాండ్‌ వెల్లడించింది.


కరోనా ఎఫెక్ట్‌   

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తమ ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు కియా మోటార్స్‌, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్‌, రెనో, బజాజ్‌, యమహా, టీవీఎస్‌ సోమవారంనాడు ప్రకటించాయి.   


కోవిడ్‌-19 పాలసీ కవర్‌ కింద ప్రభుత్వ సదుపాయాల్లో క్వారంటైన్‌ అయిన వారికి బీమా సదుపాయం కల్పించనున్నట్టు ఎడెల్‌వీస్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ తెలిపింది. కరోనా నిర్ధారణ అయి హాస్పిటల్లో  చేరిన వారికే కాకుండా ప్రభుత్వం గుర్తించిన ప్రత్యేక సదుపాయాల్లో ఉన్న వారికీ కవరేజీ ఇస్తున్నట్టు తెలిపింది.     


మార్చి 31 వరకు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు సామ్‌సంగ్‌, ఎల్‌జీ, పానసోనిక్‌, గోద్రెజ్‌ అప్లయెన్సెస్‌ ప్రకటించాయి. అనేక రాష్ర్టాల్లో లాక్‌డౌన్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. ప్రభుత్వం నుంచి వెలువడే తదుపరి ప్రకటనలను బట్టి ఉత్పత్తిని ప్రారంభించే అంశంపై సమీక్ష జరపనున్నట్టు కంపెనీలు తెలిపాయి.     


కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే చర్యల కోసం ప్రైవేటు రంగంలోని యాక్సిస్‌ బ్యాంక్‌ రూ.100 కోట్ల నిధిని ఏర్పాటు చేసింది. ఈ సొమ్మును కస్టమర్లు, ఉద్యోగులు, వెండార్లు, ప్రభుత్వం ఏజెన్సీలు, కమ్యూనిటీకి మద్దతుగా వినియోగించనుంది.     


కరోనా వైరస్‌ కట్టడి కోసం కంపెనీలు వెచ్చించే మొత్తాన్ని కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కార్యకలాపాల కింద పరిగణించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. కంపెనీల చట్టం కింద కంపెనీలు తమ వార్షిక లాభాల్లో రెండు శాతాన్ని సీఎ్‌సఆర్‌ కోసం వెచ్చించాల్సి ఉంటుంది.   


 దేశంలోని అన్ని బ్రాంచ్‌లను కూడా మార్చి 31 వరకు మూసివేస్తున్నట్టు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) తెలిపింది. అత్యవసరం ఉన్న అంశాలను యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ అధ్యక్షతన సింగిల్‌ మెంబర్‌  సారథ్యంలోని ఎన్‌సీఎల్‌టీ - చెన్నై బెంచ్‌ విచారిస్తుందని, బుధ, శుక్రవారాల్లో మాత్రమే ఈ విచారణ ఉంటుందని పేర్కొంది.

Updated Date - 2020-03-24T09:54:21+05:30 IST