ఎన్నెన్నో వర్ణాలు.. కథలు

ABN , First Publish Date - 2021-03-26T05:33:52+05:30 IST

వేలాది సంవత్సరాలుగా మన దేశంలో నిర్వహిస్తున్న వేడుకల్లో హోలీ ఒకటి. వేదవ్యాసుడి శిష్యుడైన జెమిని మహర్షి

ఎన్నెన్నో  వర్ణాలు..  కథలు

ఈనెల 28న హోలీ

వేలాది సంవత్సరాలుగా మన దేశంలో నిర్వహిస్తున్న వేడుకల్లో హోలీ ఒకటి. వేదవ్యాసుడి శిష్యుడైన జెమిని మహర్షి రచించిన పూర్వ-ఉత్తర మీమాంస లాంటి పురాతన గ్రంథాల్లోనూ, పూర్వ కవులు రాసిన వివిధ కావ్యాల్లోనూ హోలీ ప్రస్తావన ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని శిల్పాల్లో హోలీ దృశ్యాలు కనిపిస్తాయి. శ్రీ కృష్ణ దేవరాయలు ప్రతి సంవత్సరం వసంతోత్సవాల పేరుతో హోలీ సందర్భంగా కవితాగోష్టులను నిర్వహించేవారన్న కథనాలు ఉన్నాయి. ఇలా ఎంతో ప్రాచీనత ఉన్న హోలీ పండుగ ఎలా ఆవిర్భవించిందో తెలిపే కథలు అనేకం ఉన్నాయి. 


పక్షం రోజుల్లో రాబోయే వసంత కాలాన్ని స్వాగతిస్తూ చేసుకొనే పండుగ ఇది. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిని హోలీ పౌర్ణమిగా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా కొత్త చిగుర్లు తొడుగుతున్న పువ్వులతో చేసిన రంగులూ, ఓషధీ గుణాలున్న పదార్థాలు కలిపిన నీళ్ళూ చల్లుకోవడం ఆనవాయితీ.



హోళికా దహనం

ప్రధానంగా ఉత్తరాదిన ప్రాచుర్యంలో ఉన్న కథల్లో... దసరా, దీపావళి పండుగల్లాగానే... హోలీని కూడా చెడుపై మంచి సాధించిన విజయానికి తార్కాణంగా చూస్తారు. శ్రీరాముడి పూర్వీకుడైన రఘు మహారాజు రాజ్యం చేస్తున్న సమయంలో... హోళిక అనే రాక్షసి పిల్లలను ఎత్తుకుపోయి, చంపి తినేదనీ, ఇది తెలుసుకున్న రఘు మహారాజు ఆ రాక్షసిని చంపాడనీ, హోళిక పీడ వదిలినందుకు సంబరపడుతూ ప్రజలు  ఆమె పేరుతో బొమ్మలను తయారు చేసి దగ్ధం చేసి, రంగులు చల్లుకున్నారనీ, అదే హోలీ పండుగకు మూలమనీ ఒక కథ ఉంది. మరో పౌరాణిక గాథ ప్రకారం..  హిరణ్య కశిపుని సోదరి హోళిక.


మంటల్లో ఎంతసేపు ఉన్నా చెక్కుచెదరకుండా బయటకు వచ్చే వరం ఆమెకు ఉంది. హరి ద్వేషి అయిన హిరణ్య కశిపుడికి తన కుమారుడైన ప్రహ్లాదుడి విష్ణుభక్తి నచ్చదు. ప్రహ్లాదుణ్ణి చంపాలని అనేక ప్రయత్నాలు చేసి, విఫలమై, చివరకు హోళికకు ఆ పని అప్పగిస్తాడు హిరణ్య కశిపుడు. అన్న కోరిక మేరకు ప్రహ్లాదుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకొని, హోళిక మంటల్లోకి వెళుతుంది. కానీ, విష్ణుమూర్తి అనుగ్రహంతో ప్రహ్లాదుడు సురక్షితంగా ఉంటాడు. హోళిక దగ్ధమైపోతుంది. అంతకుముందు హోళిక కారణంగా కష్టాలు పడిన ప్రజలు సంతోషంతో చేసుకున్న వేడుకలే హోలీ పండుగగా రూపుదిద్దుకున్నాయనీ చెబుతారు. ఈ ఉదంతాన్ని గుర్తు చేసుకుంటూ హోళికా దహనం జరపడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే దీన్ని ‘హోలికా పౌర్ణమి’ అని అంటారు.


శివపురాణంలో...

హోలీని ‘అనంగ పౌర్ణమి’, ‘మదన పౌర్ణమి’, ‘కాముని పున్నమి’ అని కూడా పిలుస్తారు. ఇవన్నీ మన్మధుడిని సూచించే పేర్లు. శివపురాణంలోని ఒక కథ ప్రకారం... బ్రహ్మదేవుడి కోసం తారకాసురుడు తపస్సు చేశాడు. భార్యకు దూరమై, ఎప్పుడూ తపస్సులో ఉంటూ, శాశ్వత వైరాగ్యంలో ఉండే వ్యక్తికి పుట్టిన కుమారుడి చేతిలో తప్ప మరెవరి వల్లా తనకు మరణం రాకూడదని వరం పొందాడు. ఆ వర గర్వంతో దేవ, మానవులను హింసించసాగాడు. బ్రహ్మను దేవతలు వేడుకోగా, శివుడి కుమారుడు మాత్రమే తారకాసురుణ్ణి చంపగలడని బ్రహ్మ సూచించాడు. దాంతో విరాగియైు, తపోదీక్షలో ఉన్న శివుడికి పార్వతీదేవిపై అనురక్తి కలిగేలా చేయాలని మన్మధుణ్ణి దేవతలు కోరారు.


తన తపస్సును భగ్నం చెయ్యబోయిన మన్మధుణ్ణి శివుడు మూడోకంటితో భస్మం చేస్తాడు. ఆ తరువాత, రతీదేవి ప్రార్థన మేరకు... ఆమెకు మాత్రమే శరీరంతో మన్మధుడు కనిపించేలా శివుడు వరం ఇస్తాడు. అనంతరం పార్వతిని శివుడు వివాహం చేసుకుంటాడు. వారి పుత్రుడిగా కార్తికేయుడు జన్మించి, తారకాసురుణ్ణి సంహరిస్తాడు. ఈ కథను గుర్తు చేసుకుంటూ, అరిషడ్వర్గాల్లో ఒకటైన విపరీతమైన కామాన్ని తొలగించుకోవాలనే సూచనగా... ఈ రోజున కామ దహనాన్ని జరుపుతారు.




వ్రజ్‌... రాధా కృష్ణుల హోలీ

శ్రీకృష్ణుడు నడయాడిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన ఉత్తరప్రదేశ్‌లోని వ్రజ్‌ (బ్రజ్‌) ప్రాంతంలో ఈ పండుగ సందడే వేరుగా ఉంటుంది. ఆ ప్రాంతానికే పెద్ద పండుగైన హోలీ వేడుకలు పదహారు రోజుల పాటు సాగుతాయి. ప్రత్యేకించి కృష్ణుడు జన్మించిన మధుర, పెరిగిన ఊరైన నందగ్రామ్‌, ఆయన ప్రేయసి రాధ పుట్టిన బర్సానా, రాధాకృష్ణుల విహార భూమి బృందావనాల్లో ఈ సంబరాలు అంబరాన్నంటుతాయి. బృందావనంలోని బన్‌కే బిహారీ ఆలయంలో రంగులతో కాకుండా పూలతో హోలీ జరుపుతారు.


కాగా, హోలీ అనే పేరు ‘డోలీ’ లేదా ‘డోలిక’ (ఊయల) అనే మాట నుంచి వచ్చిందనే అభిప్రాయం కూడా ఉంది. కృష్ణుడిని ఊయలలో వేసిన రోజుగా... ‘డోలికా పూర్ణిమ’, ‘డోలా పూర్ణిమ’గా దీన్ని కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తారు. మీనాక్షీ సుందరేశ్వరుల వివాహ దినోత్సవంగా... తమిళనాడులోని మదురైలో ఈ రోజు ఉత్సవాలు జరుగుతాయి.   


Updated Date - 2021-03-26T05:33:52+05:30 IST