Abn logo
Nov 11 2020 @ 00:27AM

అనేక గుణపాఠాలు

తెలంగాణలో మంగళవారం నాడు దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓట్ల లెక్కింపు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగి, ఆశ్చర్యకరమైన ఫలితాన్ని ఇచ్చింది. అధికార తెలంగాణ రాష్ట్రసమితికి ఈ ఫలితం ఊహించనిది, తీవ్రమైనది. విజేత అయిన భారతీయ జనతాపార్టీకి ఇది కీలకమయిన గెలుపు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొని, గతంలో టిఆర్‌ఎస్‌లో కూడా పనిచేసిన ప్రస్తుత బిజెపి అభ్యర్థి రఘునందన్‌ రావుకు ఇది ప్రతిష్ఠాత్మక విజయం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల భవిష్యత్‌ గమనానికి బీజాలు ఈ ఉప ఎన్నికలో కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా పెద్ద ప్రతిపక్షంగా, ప్రత్యామ్నాయంగా భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి ఈ ఎన్నిక ఫలితంలో జీవన్మరణ గుణపాఠాలు ఉన్నాయి.


ఒక రాష్ట్రంలో అధికారపక్షాన్ని నిర్ణయించడమే కాకుండా, దేశ రాజకీయాలను మలుపుతిప్పగల ఎన్నికలుగా భావించిన బిహార్‌ ఓట్ల లెక్కింపు కంటె, ఎంతో ప్రాముఖ్యం ఉన్న మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికలతో సహా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన 58 అసెంబ్లీ స్థానాల ఎన్నికల కంటె– తెలంగాణకు, తెలుగు రాష్ట్రాలకు దుబ్బాక ఉప ఎన్నికే ఎక్కువ ఆసక్తికరమైనది, సంచలనశీలమైనది. అప్రతిహతంగా సాగుతున్న టిఆర్‌ఎస్‌ జైత్రయాత్రకు గట్టి కుదుపు ఎదురుకావడం పర్యవసానాల రీత్యా ప్రాముఖ్యం కలిగిన పరిణామం. 


ఇది టిఆర్‌ఎస్‌ అపజయమా, లేక బిజెపి విజయమా–అని విశ్లేషకులు చర్చించుకుంటూనే ఉంటారు. టిఆర్‌ఎస్‌ పరిపాలనాదోషాల కారణంగా ఏర్పడిన ప్రతికూల ఓటు మాత్రమేనని, బిజెపి ప్రభావం కాదని వాదించడం ఆత్మసంతృప్తికి లేదా ఆత్మవంచనకు మాత్రమే పనికివస్తుంది. ప్రజల అసమ్మతి పొందడానికి అర్హమైన అనేక తప్పులు ప్రభుత్వం చేసినా, వాటిని సమర్థంగా ఉపయోగించుకోగల శక్తి కూడా అవసరం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దుబ్బాక ప్రచారంలో, పోలింగ్‌ నిర్వహణలో మునుపెన్నడూ చూడనంత క్రియాశీలంగా కాంగ్రెస్‌ కనిపించిందని జనం చెప్పుకున్నారు కానీ, రాజకీయ కార్యాచరణ అన్నది కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే చేపట్టేది కాదు. భారతీయ జనతాపార్టీ ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో క్రియాశీలంగా మారడంతో పాటు, ప్రభుత్వ విధానాల మీద ఎప్పటికప్పుడు ఏదో ఒక కార్యక్రమం తీసుకుంటూ తనను తాను ప్రత్యామ్నాయంగా మలచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉండడం, కేంద్రీకృత మార్గదర్శనం వారికి బలం కావచ్చును కానీ, క్షేత్రస్థాయిలో కార్యశూరత్వం ఉంటేనే కదా, ఫలితాలు వచ్చేది? దుబ్బాక ఫలితంలో బిజెపి పార్టీ నాయకత్వం, కార్యకర్తల శ్రేణులు, అభ్యర్థి అందరూ తమ వంతు కష్టపడ్డారు. ప్రచారపర్వంలో అధికారపార్టీ వైపు నుంచి జరిగిన అత్యుత్సాహపు పనులు కూడా బిజెపిపై సానుభూతి పెంచి ఉండవచ్చును. విరక్తులై ఉన్న ఓటర్లకు బిజెపి అభ్యర్థిపైననే గురి ఏర్పడడం ప్రధానమైన కారణం. 


అశక్తత కారణంగా తెలంగాణ క్షేత్రాన్ని బిజెపికి అప్పగించడానికి కాంగ్రెస్‌ సిద్ధపడితే, కాంగ్రెస్‌ను వెంటాడి వేటాడి బలహీనపరచడం ద్వారా టిఆర్‌ఎస్‌ కూడా ఈ పరిస్థితిని కొనితెచ్చుకున్నది. ఇప్పుడు వచ్చిన ప్రమా  దం ఏమున్నది, ఒకస్థానమున్న పార్టీ రెండుస్థానాలకు చేరింది అంతే కదా– అని తేలికగా తీసేయవచ్చు. ముప్పు ఏమిటో వారికి తెలియకపోలేదు. అంచనాలే తప్పు. రానున్న జిహెచ్‌ఎంసి ఎన్నికలు మరో రంగస్థలం. అప్పటికి దిద్దుబాట్లు జరిగితే సరే, లేకపోతే, పతాకసన్నివేశం మరింత సమీపానికి వస్తుంది. 


దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికలలో భారతీయ జనతాపార్టీయే అత్యధికంగా గెలిచి, తన సర్వవ్యాప్త ప్రభావాన్ని మరోసారి ప్రకటించుకుంది. కరోనా వ్యాప్తి, రైతుచట్టాలు, ఆర్థికరంగ వైఫల్యాలు– ఇవేవీ బిజెపి స్థితిని కొద్దిగా కూడా కదిలించలేకపోయాయి. ఎంతో కీలకమయిన బిహార్‌లో, ఫలితం ప్రతికూలం అయ్యే ప్రమాదం ఉండి కూడా, నితీశ్‌ కుమార్‌ బలాన్ని కుంచించివేసే రాజకీయ యుక్తిని కూడా బిజెపి ప్రయోగించింది. ఊహించినంతగా తేజస్వి తేజస్సు వెలిగిపోలేదు. అట్లాగని మరీ తీసేయలేము. 2015 ఫలితాలతో పోలిక అసంగతం కానీ, 2019 లోక్‌సభ ఎన్నికల నాటి దుస్థితితో పోలిస్తే ఇప్పటి ఫలితాలు అద్భుతమైనవే. జెడి–యు ప్రభావాన్ని తగ్గించి, ఆ మేరకు తన బలాన్ని పెంచుకున్న బిజెపి కూడా ఏకైక పెద్దపార్టీ స్థాయి దగ్గర ఊగిసలాడుతూ వచ్చింది. కూటమి పరిస్థితి మెజారిటీకి ఒక సీటు అటూ ఇటూగానే ఉండింది. అధికారంలోకి అంటూ వస్తే, ఆ తరువాత బలం సమకూర్చుకోవడం బిజెపికి కష్టం కాదు. కానీ, కూటమి వారీగా తగిన బలం వచ్చి, అతిపెద్ద పార్టీగా ఆర్‌జెడియే ఉంటే, ఎవరికి పిలుపు వస్తుందో, ఎవరికి బలం సమకూరుతుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే బొటాబొటి బలాలే కనిపిస్తున్నాయి. బిహార్‌ సంగతేమిటో కానీ, దేశరాజకీయాలలో మార్పు మొదలుకావాలని ఆశించేవారికి మాత్రం ఈ ఫలితాలతో నిరుత్సాహమే కలిగింది. 


తెలంగాణ ఫలితం అధికారపక్షం సుపరిపాలన ఇవ్వడంలేదన్న సూచన స్పష్టంగా చేసింది. బిహార్‌ ఫలితం ఏమయినప్పటికీ, అధికారపక్షం ప్రభుత్వ వ్యతిరేక జనాభిప్రాయాన్ని ఎదుర్కొన్నది. నిరుద్యోగం, వలసకార్మికుల సమస్యను ఎదుర్కొన్న తీరు నితీశ్‌ సర్కార్‌ను అప్రదిష్టపాలు చేశాయి. వాటితో పాటు, పదిహేనేళ్ల పాలన సహజంగానే కలిగించే విముఖత. నితీశ్‌కున్న లోటుపాట్లను ప్రధాని మోదీ ప్రచారం భర్తీ చేసిందంటారు. లేదు, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నదని భయపెట్టి నితీశ్‌ను కుంగదీశారని, చిరాగ్‌ పాశ్వాన్‌ చేత విడిగా పోటీచేయించకుండా ఉంటే, నితీశ్‌ పార్టీయే బిజెపి కంటె అధికంగా సీట్లు సంపాదించేదని వ్యాఖ్యానిస్తున్నవారూ ఉన్నారు.