ఆశలు ఆవరి

ABN , First Publish Date - 2020-10-21T11:48:16+05:30 IST

జిల్లాలో గత వారం కురిసిన భారీ వర్షాలు, వరద ముంపు నుంచి పలు గ్రామాలు ఇంకా తేరుకోలేదు. చోడవరం మండలంలోని చాకిపల్లి, రామజోగిపాలెం, కన్నంపాలెం, బెన్నవోలు ఆవ, గౌరీపట్నం గ్రామాల్లో పంట పొలాలు ఎనిమిదో రోజైన మంగళవారం

ఆశలు ఆవరి

ఎనిమిది రోజులుగా నీటిలోనే వరి పొలాలు  

చోడవరం, రాంబిల్లి మండలాల్లో తగ్గని వరద నీరు

కుళ్లిపోయిన పైరు

వేలాది రూపాయల పెట్టుబడులు గంగపాలు

పాలకులు, అధికారులు కన్నెత్తి అయినా చూడలేదని రైతుల ఆవేదన

నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వానికి వినతి 


చోడవరం, రాంబిల్లి, అక్టోబరు 20:

జిల్లాలో గత వారం కురిసిన భారీ వర్షాలు, వరద ముంపు నుంచి పలు గ్రామాలు ఇంకా తేరుకోలేదు. చోడవరం మండలంలోని చాకిపల్లి, రామజోగిపాలెం, కన్నంపాలెం, బెన్నవోలు ఆవ, గౌరీపట్నం గ్రామాల్లో పంట పొలాలు ఎనిమిదో రోజైన మంగళవారం కూడా నీటి ముంపులోనే ఉన్నాయి. చెరకు మినహా మిగిలిన పంటలపై ఆశలు వదులుకున్నట్టేనని అన్నదాతలు ఆవేదనతో చెబుతున్నారు. శారదా నదిలో వరద ఉధృతి కొంత తగ్గడంతో నదికి ఇరువైపులా ముంపునకు గురైన పొలాల్లో నీరు చాలావరకు బయటకుపోయింది. పెద్దేరు నది నుంచి వరద ప్రవాహం ఇంకా కొనసాగుతుండడంతో గౌరీపట్నం, బెన్నవోలు ఆవ, పీఎస్‌ పేట, కన్నంపాలెం, చాకిపల్లి, రామజోగిపాలెం గ్రామాల్లో సుమారు 400 ఎకరాల్లో పంటలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. పెద్దేరు నదిలో వరద తగ్గితే....అప్పుడు పొలాల్లోని నీరు నదిలోకి వెళుతుందని రైతులు చెబుతున్నారు. వారం నుంచి పూర్తిగా నీటి ముంపులో వుండడంతో వరి పంటపై ఆశలు వదులుకుంటున్నారు. ఇక, చెరకు తోటల్లో ఎక్కువ రోజులు నీరు నిల్వ వుండడం వల్ల దిగుబడి, రసనాణ్యత తగ్గిపోయే ప్రమాదం ఉందని, మరోవైపు తెగుళ్ల బెడద పెరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 


రెండు వేల ఎకరాల్లో కుళ్లిపోయిన వరి

రాంబిల్లి మండలంలోని రజాల అగ్రహారం, రజాల, వై.లోవ, వెల్చూరు, దిమిలి, మర్రిపాలెం, కుమ్మరాపల్లి, రాజుకోడూరు, తదితర గ్రామాలు వరద ముంపు నుంచి ఇంకా బయటపడలేదు. ఈ గ్రామాల పరిధిలో సుమారు రెండు వేల ఎకరాల్లో వరి పంట ఎనిమిది రోజుల నుంచి నీటిలోనే ఉంది. దీంతో కుళ్లిపోయి, మురుగు వాసన వస్తున్నది. ముంపు నుంచి కొద్దిగా తేరుకున్న పొలాల్లో సైతం ఎంతమేర నష్టం వాటిల్లుతుందో చెప్పే పరిస్థితి లేదని రైతులు అంటున్నారు. భారీ వర్షాలు, శారదా నది వరద, గట్లకు గండ్లు పడడం వంటి కారణాల వల్ల గత మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో సుమారు ఐదు వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగి పోయిన విషయం తెలిసిందే. మూడు రోజుల నుంచి శారదా నదిలో వరద తగ్గుతుండడంతో సుమారు మూడు వేల ఎకరాల్లో వరి పంట ముంపు నుంచి బయటపడింది. కాగా భారీఎత్తున పంట నష్టం జరిగినప్పటికీ ఇంతవరకు అధికారులుగానీ, ప్రజాప్రతినిధులుగానీ కన్నెత్తి అయినా చూడలేదని పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల వల్ల వేలాది రూపాయల పెట్టుబడి నీటిపాలైందని, ప్రభుత్వం నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.


పది ఎకరాల్లో బొప్పాయి....రూ.5 లక్షలు నష్టం బలిరెడ్డి రమణ, పీఎస్‌పేట, 

నేను పది ఎకరాల్లో బొప్పాయి మొక్కలు నాటాను. కడియం నుంచి ఒక్కో మొక్క రూ.30 చొప్పున సుమారు 13 వేల మొక్కలు కొనుగోలు చేశాను. మొక్కలు, దుక్కి, కూలి ఖర్చులు, ఎరువులు కలిపి రూ.5 లక్షలకుపైగా పెట్టుబడి అయ్యింది. మొక్కలు ఏపుగా పెరుగుతున్న సమయంలో భారీ వర్షాలకుతోడు పెద్దేరు నది గట్టుకు గండి పడడంతో వరద నీరు పొలాన్ని ముంచెత్తింది. దీంతో మొక్కలన్నీ చనిపోయాయి.  


అధికారులు పట్టించుకోలేదు..బలిరెడ్డి దొరబాబు, పీఎస్‌ పేట

పెద్దేరు నది గట్లు బలహీనంగా ఉన్నాయి. వరద ఉధృతి పెరిగితే గట్లకు గండ్లు పడతాయని, అందువల్ల పటిష్టం చేయాలని ఆరు నెలల నుంచి అధికారులకు విజ్ఞ్ఞప్తి చేస్తున్నాం. అయినా స్పందించలేదు. మేం ఊహించినట్టుగానే వరద ఉధృతికిపెద్దేరు గట్టుకు గండి పడి, వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. గట్లను పటిష్టం చేసివుంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదు.

Updated Date - 2020-10-21T11:48:16+05:30 IST