పక్కా వ్యూహంతో దాడి

ABN , First Publish Date - 2021-04-05T07:39:52+05:30 IST

పక్కా వ్యూహంతో దాడి

పక్కా వ్యూహంతో దాడి

  • ఎత్తైన ప్రదేశాల్లో మాటువేసిన గెరిల్లాలు.. కూంబింగ్‌ దళాలపై నిఘా
  • వ్యూహాత్మక ప్రదేశానికి రాగానే దాడి చేసిన మావోయిస్టులు
  • మూడువైపులా చుట్టు ముట్టి ఎల్‌ఎంజీలు.. గ్రెనేడ్‌లతో విధ్వంసం
  • పక్కనే ఉన్న జొన్నగడ్డ గ్రామంలోనూ పాగా వేసిన నక్సల్స్‌
  • జవాన్లు అక్కడికి వెళ్లగానే కాల్పులు.. ఆపై కత్తులతో ఊచకోత


రాయ్‌పూర్‌, చర్ల, చింతూరు, ఏప్రిల్‌ 4: ఛత్తీస్గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా టెర్రాం వద్ద మావోయిస్టులు భారీ వ్యూ హంతోనే కూంబింగ్‌ దళాలపై దాడికి తెగబడ్డారు. వ్యూహాత్మక ప్రదేశాల్లో మాటువేసి.. తమ టాక్టికల్‌ కౌంటర్‌-అఫెన్సివ్‌ కాంపెయిన్‌(టీసీఓసీ)ని పక్కాగా అమలు చేశారు. కూంబింగ్‌లో ఉన్న జవాన్లను 3 వైపులనుంచి చుట్టుముట్టి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. మావోయిస్టులు చెట్లపైన ముళ్ల పొదల్లో నక్కి కాల్పులు జరపడంతో ఎటువైపునుంచి దాడి జరుగుతుందో తెలుసుకునేలోపే భద్రత సిబ్బందివైపు జరగరాని నష్టం జరిగిపోయింది.


హిడ్మా వ్యూహరచన

మావోయిస్టు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) ఒకటో బెటాలియన్‌ కమాండర్‌గా ఉన్న హిడ్మా.. టీసీఓసీలో భాగంగా ఈ దాడికి వ్యూహరచన చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. 10 రోజుల క్రితమే ఇంటెలిజెన్స్‌ వర్గాలకు హిడ్మా కదలికలపై ఉప్పందింది. దీంతో బీజాపూర్‌-సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో శుక్రవా రంరాత్రి నుంచి 2వేల మందితో కూంబింగ్‌ ప్రారంభించా రు. టెర్రాం వద్ద 760 మంది జవాన్లు కూంబింగ్‌లో ఉ న్నారు. అటువైపు 400 మంది నక్సల్స్‌ ఉన్నారు. అయితే.. భద్రత బలగాలవైపే ఎక్కువగా ప్రాణనష్టం జరగడాన్ని బట్టి.. మావోయిస్టుల వ్యూహాన్ని అర్థం చేసుకోవచ్చు. హిడ్మానే తన గురించి ఇన్ఫార్మర్ల ద్వారా లీకులు ఇప్పించి, ఈ దాడికి వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది.


గ్రామాన్ని ఆక్రమించి..

మావోయిస్టుల వ్యూహం ఎలా ఉందంటే సంఘటన స్థలం నుంచి జవాన్లు ఒకవేళ తప్పించుకుంటే ఎక్కడికి వెళ్తారు? అనే విషయాన్ని కూడా ముందుగానే పసిగట్టి.. అక్కడా మాటువేశారు. అడవుల్లో మూడు వైపుల నుంచి జవాన్లను చుట్టు ముట్టిన మావోయిస్టులు ఎక్కడికీ వెళ్లే చాన్స్‌ ఇవ్వలేదు. ‘‘మృతదేహాల కోసం గాలింపు చేస్తున్న సమయంలో ఎక్కువ మంది జవాన్లు చెట్లను ఆనుకుని మరణించి కనిపించారు. అంటే డిఫెన్స్‌ కోసం వారు చివరిదాకా చెట్ల చాటునే ఉండి పోరాడారు. అక్కడ కొన్ని చెట్ల కాండాలు తూటాల దెబ్బకు ఛిద్రం అయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నక్సలైట్లు లైట్‌ మెషీన్‌గన్‌(ఎల్‌ఎంజీ)లు, గ్రనేడ్‌ లాంచర్లతో దాడులకు తెగబడ్డారు’’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు. అక్కడికి సమీపంలో జొన్నగడ్డ గ్రామం ఉంది. బుల్లెట్‌ గాయాలై నా ప్రాణాలతో బయటపడే అవకాశం ఉందని ఆయన  తెలిపారు. అయితే మూడు గంటలపాటు ఏకధాటిగా కాల్పులు జరగడంవల్ల రక్తస్రావంతో జవాన్లు నేలకొరిగి ఉంటారని చెబుతున్నారు. తప్పించుకునే ప్రయత్నంలో కొందరు జవాన్లు ఆ గ్రామానికి వెళ్లారు. అయితే మావోయిస్టులు అప్పటికే ఆ గ్రామాన్ని ఖాళీ చేయించి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. జవాన్లు గ్రామంలోకి అడుగు పెట్టగానే కాల్పులకు తెగబడ్డారు. ఏడుగురు జవాన్ల మృతదేహాలు ఆ గ్రామ వీధుల్లో ఒకేచోట లభించాయి.


తమ వారి కోసం నీటిని వదిలేసి..

సాధారణంగా కూంబింగ్‌కు వెళ్లే దళాలు సరిపడా నీటిని, తినుబండారాలను వెంట తీసుకెళ్తాయి. అయితే.. శనివారం నాటి కాల్పుల తర్వాత.. క్షతగాత్రులైన తమ వారిని భుజాలపై మోసుకెళ్లేందుకు జవాన్లు తమ బ్యాక్‌ప్యాక్‌ల బరువును తగ్గించుకున్నారు. ఆ క్రమంలో నీటి బాటిళ్లు/ప్యాకెట్లు, తినుబండారాలను పారేశారు. దాంతో.. మండుటెండలో ఆకలి, దాహంతో.. కొంతమంది మరణాలకు డీహైడ్రేషన్‌ కారణమని ఉన్నతాధికారులు గుర్తించారు. ప్రాణాలతో దొరికిన జవాన్లను నక్సలైట్లు కత్తులతో చిత్రహింసలు పెట్టి, చంపినట్లు తెలుస్తోంది. కోబ్రా దళం ఇన్‌స్పెక్టర్‌ చేతులను మావోయిస్టులు నరికేశారు.


ప్రత్యక్ష యుద్ధానికి సంకేతం?

నిజానికి మావోయిస్టులు ఇప్పటి వరకు మందుపాతరలు, ఎల్‌ఈడీని పేల్చడం ద్వారా ఎక్కువ మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. ఎదురుకాల్పుల్లో ఎక్కువసేపు బలగాలను నిలువరించలేకపోయారు. అందుకు కారణం వారి వద్ద తగినన్ని ఆయుధాలు లేకపోవడం.. శిక్షణ లోపం. కానీ, శనివారంనాటి ఘటనతో నక్సలైట్లు ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమనే సంకేతాలిచ్చారు. మూడు గంటల పాటు ఏకబిగిన కాల్పులు జరిపారు. జవాన్ల వైపు ప్రాణనష్టం, క్షతగాత్రుల సంఖ్యను బట్టి ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది.  


హెలికాప్టర్‌ను దిగనివ్వకుండా..

మావోయిస్టుల దాడుల్లో గాయపడ్డ జవాన్లకు తక్షణ సాయం అందించేందుకు కేంద్ర బలగాలు హెలికాప్టర్లను వినియోగిస్తాయి. ఈ విషయంపై అవగాహన ఉండడంతో మావోయిస్టులు వాటిని నిలువరించే ప్రయత్నాలు చేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకే వాయుసేనకు చెందిన హెలికాప్టర్‌.. సహాయక చర్యల కోసం ఘటనాస్థలికి రాగా మావోయిస్టులు కాల్పుల తీవ్రతను పెంచారు. మూడు గంటల పాటు ఇదే పరిస్థితి. దీంతో క్షతగాత్రులను తరలించేందుకు హెలికాప్టర్‌ సాయంత్రం 5 గంటల వరకు గానీ, కిందకు దిగే పరిస్థితి లేదు. తక్షణ వైద్య సేవలు అందకపోవడం.. తీవ్ర రక్తస్రావం, డీహైడ్రేషన్‌ కారణంగా ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని పోలీసులు చెబుతున్నారు.


ఎవరీ హిడ్మా?

సుక్మా జిల్లా పువర్తీ గ్రామానికి చెందిన మాద్వీ హిడ్మా వయసు 40 సంవత్సరాలు. యుక్తవయసులోనే అంటే 90లలోనే ఇతను నక్సలిజం వైపు ఆకర్షితుడయ్యాడు. ప్రస్తుతం పీఎల్‌జీఏ 1వ బెటాలియన్‌ కమాండర్‌గా, దండకారణ్యం స్పెషల్‌ జోన్‌ కమిటీ(డీకేఎ్‌సజడ్‌) కీలక సభ్యుడిగా ఉన్నాడు. మావోయిస్టు కేంద్ర కమిటీలో కూడా సభ్యత్వం ఉందని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. మావోయిస్టు కేంద్ర కమిటీలో ఇతడే చిన్న వయస్కుడని చెబుతున్నాయి. వ్యూహాత్మకంగా భద్రతా బలగాలను దెబ్బకొట్టడంలో ఇతడు దిట్ట అని పోలీసులు చెబుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండ్వీ హత్య సహా పలు కేసుల్లో ఇతను నిందితుడు. ఇతని తలపై రూ.40 లక్షల రివార్డు ఉంది.


మావోయిస్టుల టీసీఓసీ ఆపరేషన్లు ఇలా..

మావోయిస్టులు ఏటా టాక్టికల్‌ కౌంటర్‌-అఫెన్సివ్‌ కాంపెయిన్‌(టీసీఓసీ) ఆపరేషన్లు నిర్వహిస్తుంటారు. జనవరి-జూన్‌ మధ్య కాలాన్ని ఇందుకోసం ఎంచుకుంటారు. ఎండాకాలంలో అడవుల్లో చెట్ల ఆకులు రాలిపోయి, ఎండిపోవడంతో.. ఎదుటి వారి కదలికలను సులభంగా గుర్తించవచ్చు. అందుకే.. ఈ సమయంలో భద్రతా బలగాలపై దాడులకు వ్యూహాలు పన్నుతారు.


  • గత నెల 22న నారాయణపూర్‌ జిల్లాలో మావోయిస్టుల మందుపాతరకు ఐదుగురు జవాన్లు బలయ్యారు.
  • గత ఏడాది మార్చిలో సుక్మాలోని మినప ప్రాంతంలో జరిపిన దాడిలో 17 మంది పోలీసులు మృతి చెందారు.
  • 2019 ఏప్రిల్‌లో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండ్వీ, అతని డ్రైవర్‌, ముగ్గురు భద్రతా సిబ్బందిని చంపేశారు.
  • 2010 ఏప్రిల్‌లో సీఆర్పీఎఫ్‌ జవాన్లతో వెళ్తున్న బస్సును మందుపాతరలతో పేల్చారు. ఈ ఘటనలో 76 మంది జవాన్లు చనిపోయారు.




తగిన సమయంలో గుణపాఠం: అమిత్‌షా

అసోంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఛత్తీ‌స్‌గఢ్‌ ఘటన గురించి తెలియగానే తన కార్యక్రమాలను రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. ఛత్తీస్గఢ్‌లో పరిస్థితిపై ఆ రాష్ట్ర సీఎం, సీఆర్పీఎఫ్‌ చీఫ్‌తో సమీక్షించారు. మధ్యాహ్నం ఐబీ చీఫ్‌, హోంశాఖ, సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనకు గట్టి జవాబిస్తామని, తగిన సమయంలో గుణపాఠం చెబుతామని మావోయిస్టులను హెచ్చరించారు. శాంతికి విఘాతం కలిగించే నక్సలైట్లకోసం వేటను కొనసాగిస్తామని ప్రకటించారు. కాగా, మావోయిస్టులపై పోరులో వెనక్కి తగ్గేది లేదని సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కుల్‌దీప్‌ సింగ్‌ ప్రకటించారు. మరోవైపు  బీజాపూర్‌ ఘటనపై స్థానిక పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కి బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ కావాల్సి ఉంది. 

Updated Date - 2021-04-05T07:39:52+05:30 IST