లొంగిపోయిన జలేందర్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-04-21T06:08:46+05:30 IST

సరిగ్గా 22 ఏళ్లకు..

లొంగిపోయిన జలేందర్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఎదుట లొంగిపోయిన జలేందర్‌రెడ్డి

ముగిసిన 22 ఏళ్ల ‘మావోయిస్టు’ బాట


దుబ్బాక/మిరుదొడ్డి: సరిగ్గా 22 ఏళ్లకు.. మావోయిస్టు జలేందర్‌రెడ్డి ఉద్యమ ప్రస్థానం ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల ఎదుట ఆయన మంగళవారం లొంగిపోయారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామానికి చెందిన ముత్తంగారి జలేందర్‌రెడ్డి.. 1998లో సిద్దిపేటలో ఇంటర్‌ చదువుతున్న సమయంలో మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడు. సిద్దిపేట డివిజన్‌ ఆర్‌ఎస్‌యూ విద్యార్థి సంఘంలో చేరి.. ఆ తర్వాత గిరాయిపల్లి దళంలో చేరారు. గిరాయిపల్లి ఎన్‌కౌంటర్‌ తర్వాత పార్టీ ఆయనను మైదాన ప్రాంతానికి తరలించింది. కొన్నాళ్లు దండకారణ్యంలో పని చేశారు. పార్టీలో వివిధ బాధ్యతలను చేపట్టారు. ఉమ్మడి మెదక్‌, వరంగల్‌ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పలు సంఘటనల్లో పాల్గొన్నారు. 1999లో గిరాయిపల్లి దళం (మొహదీపూర్‌లో), 2000లో దుబ్బాక దళం ఎన్‌కౌంటర్‌లో అంతం కావడంతో ఇక్కడ మిగిలిన క్యాడర్‌ను వివిధ ప్రాంతాలకు తరలించారు. అప్పటికే ఆయనపై మెదక్‌ పోలీసులు రూ.5 లక్షల రివార్డును ప్రకటించారు. దండకారణ్యం నుంచి పలు బాధ్యతలు నిర్వర్తించిన జలేందర్‌రెడ్డి క్రమంగా ఎదుగుతూ ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతాల స్పెషల్‌ జోన్‌ కమిటీ సభ్యుడిగా, మిలీషియా సభ్యుడిగా పని చేశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ సవాంగ్‌ ఎదుట లొంగిపోయారు. 


ఉద్యమ ప్రస్థానంలో భాగంగా జలేందర్‌రెడ్డి.. ఆంధ్ర- ఒడిశా స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. మారన్న అలియాస్‌ కృష్ణగా వ్యవహరించారు. పోలీసులతో 19 సందర్భాల్లో ఎదురుకాల్పుల్లో పాల్గొన్నారు. 2008లో సంచలనం సృష్టించిన బలిమెల సంఘటనతో పాటు సున్నిపెంట, ఎర్రగొండపాలెం ఘటనలో కూడా ఆయన భాగస్వామి. మల్కాన్‌గిరి కలెక్టర్‌ వినికృష్ణ కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడు. జలేందర్‌పై ఆరు హత్యకేసులున్నట్టు పోలీసులు ప్రకటించారు. 


నెలరోజుల ముందే ప్రణాళిక

జలేందర్‌రెడ్డి లొంగుబాటుకు నెలరోజుల క్రితమే ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు బాబాయి భూంపల్లి నర్సింహారెడ్డికి చెప్పినట్టు సమాచారం. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించేలోపే కరోనా సోకి బాబాయి ఆస్పత్రిపాలయ్యారు. ఆ తర్వాత గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్న సన్నిహితుల ద్వారా లొంగుబాటుకు యత్నించారని తెలుస్తున్నది. 


కొడుకును చూడక 22 ఏళ్లాయె..: సులోచన, బాలకృష్ణారెడ్డి

మా చివరిచూపులకైనా రావాలని ఎన్నోసార్లు టీవీల్లో, పేపర్లలో కొడుకుకు చెప్పుకున్నం. 22 ఏళ్ల కింద వెళ్లిపోయిన కొడుకు తలకొరివి పెట్టడానికైనా వస్తడో రాడోనని బాధపడ్డం. కొడుకు లొంగిపోయిండని తెలిసి సంతోషమైతుంది. మంచం కూడా కదలలేకుంటున్నం. కొడుకు వస్తడని గడప దగ్గర కూసున్నం. టీవీల్లో ఎప్పుడు ఎన్‌కౌంటర్‌ వార్త వచ్చినా కొడుకు ఉన్నడో పోయిండోనని కంటికి నిద్ర ఉండేది కాదు. ఇప్పుడు కొడుకు వస్తుండని సంబరమైతుంది. ఎవుసానికి కొదువ లేదు. తిండికి తిప్పలు లేదు. పానం మంచిగుండకనే లొంగిపోతున్నట్టున్నడు. చిన్నకొడుకు జలేందర్‌ పెద్ద ఉద్యోగం చేస్తడనుకున్నం. కానీ అన్నలల్ల గలిసి ఇంత పెద్దోడవుతడనుకోలే.

Updated Date - 2021-04-21T06:08:46+05:30 IST