మావోయిస్టు నేత ‘కత్తి’ మృతి

ABN , First Publish Date - 2021-06-14T09:34:21+05:30 IST

మావోయిస్టు పార్టీ కీలక నేత కత్తి మోహన్‌రావు (61) మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.

మావోయిస్టు నేత ‘కత్తి’ మృతి

ఈనెల 10న గుండెపోటుతో మరణం

దండకారణ్యంలోనే అంత్యక్రియలు 

హైదరాబాద్‌, ఇల్లెందు, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ కీలక నేత కత్తి మోహన్‌రావు (61) మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఈ నెల 10న గుండెపోటుతో మరణించినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. మోహన్‌రావు పార్థివ దేహానికి ఈ నెల 11న దండకారణ్యంలో అంత్యక్రియలను నిర్వహించినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. భౌతిక కాయాన్ని కుటుంబసభ్యులకు అందించలేకపోయినందుకు చింతిస్తున్నామని, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. మోహన్‌రావును మావోయిస్టు పార్టీలో ప్రకాశన్న, దామదాదాగా పిలుస్తారు. మహబుబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం గార్లలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, కల్లుగీత కార్మికుడు కత్తి రామయ్య-వీరలక్ష్మి దంపతులకు 1954లో జన్మించిన మోహన్‌రావు 1982లో కాకతీయ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు రాడికల్‌ విద్యార్థి సంఘంలో పనిచేశారు.  1991లో మావోయిస్టు పార్టీలో చేరి.. తక్కువ సమయంలోనే ఆ దళ కమాండర్‌ స్థాయికి ఎదిగారు. 2008లో పార్టీ ఆయనను దండకారణ్యానికి బదిలీ చేయగా, క్రియశీలక బాధ్యతలు చేపట్టారు. మోహన్‌రావు తలపై పోలీసులు ప్రకటించిన రూ.8 లక్షల రివార్డు ఉంది.  

Updated Date - 2021-06-14T09:34:21+05:30 IST