మావోయిస్టు మారన్న లొంగుబాటు

ABN , First Publish Date - 2021-04-21T09:47:09+05:30 IST

మావోయిస్టు పార్టీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ (ఏవోబీ) సభ్యుడు ముత్తన్నగిరి జలంధర్‌ రెడ్డి అలియాస్‌ మారన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌ విన్ని కృష్ణ కిడ్నాప్‌ వ్యవహారంలో మారన్న కీలక నిందితుడు. ఆరు హత్యలతోపాటు పోలీసు స్టేషన్లపై దాడులకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి.

మావోయిస్టు మారన్న లొంగుబాటు

  • -కలెక్టర్‌ విన్నికృష్ణ కిడ్నా్‌పలో కీలకం
  • -మారన్న తలపై 20 లక్షల రివార్డు
  • -ఆ డబ్బు ఆయనకే ఇస్తాం : డీజీపీ
  • -పెరిగిన సంక్షేమంతో పార్టీ బలహీనం
  • -అందుకే బయటకు వచ్చా: మారన్న


అమరావతి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ (ఏవోబీ) సభ్యుడు ముత్తన్నగిరి జలంధర్‌ రెడ్డి అలియాస్‌ మారన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌ విన్ని కృష్ణ కిడ్నాప్‌ వ్యవహారంలో మారన్న కీలక నిందితుడు. ఆరు హత్యలతోపాటు పోలీసు స్టేషన్లపై దాడులకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లో మంగళవారం డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ముందు ఆయన సరెండర్‌ అయ్యారు. మారన్న ఉద్యమ జీవితం, లొంగుబాటుకు దారితీసిన పరిస్థితులను ఈ సందర్భంగా డీజీపీ వివరించారు. ‘‘తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా కొంపల్లి జలంధర్‌ రెడ్డి స్వస్థలం చాలాకాలం క్రితం మెదక్‌ జిల్లా పీపుల్స్‌వార్‌ కమిటీలో సభ్యుడిగా చేరాడు. నల్లమలలోని సున్నిపెంట, ఎర్రగొండపాలెంలో జరిగిన బాంబు పేలుళ్లలో పాల్గొన్నాడు. ఏవోబీలో పనిచేస్తున్నప్పుడు మల్కన్‌గిరి కలెక్టర్‌ విన్ని కృష్ణను కిడ్నాప్‌ చేశాడు. 30మందికిపైగా సీఆర్పీఎఫ్‌ జవాన్లను హత్యచేసిన బలిమెల దాడిలో కీలకంగా వ్యవహరించాడు. అయితే ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకుతోడు, పోలీసుల ఉమ్మడి కూంబింగ్‌ తీవ్రతరం కావడంతో మావోయిస్టు పార్టీ బలహీన పడింది. రోజురోజుకూ రిక్రూట్‌మెంట్లు తగ్గిపోతూ, మావోయిస్టు పార్టీలో పరిస్థితులు దిగజారుతుండటంతో లొంగిపోవాలని మారన్న నిర్ణయించుకొన్నాడు.’’ అని వివరించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం కల్పించే ప్రోత్సాహకాలన్నీ మారన్నకు అందిస్తామనీ, ఆయనపై ఉన్న రూ.20లక్షల రివార్డును కూడా అందజేస్తామని చెప్పారు. మావోయిస్టులు ఇకనైనా హింసను, అడవులను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సూచించారు. రాష్ట్రంలో గడిచిన రెండేళ్లలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎనిమిదిసార్లు ఎదురు కాల్పులు జరిగినట్లు డీజీపీ వెల్లడించారు. ఒక డీసీఎం, మరో ఏసీఎంతోపాటు ఎనిమిది మంది ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. స్పెషల్‌ జోన్‌ కమాండర్‌, ఇద్దరు డీసీఎంలు, ఇద్దరు ఏసీఎంలు, మరో ఇద్దరిని కలిపి ఆరుగురిని ఈ రెండేళ్లలో అరెస్టు చేశామనీ, మరో ఇద్దరు డీసీఎంలు, ఏడుగురు ఏసీఎంల సహా 31మంది లొంగిపోయారన్నారు. ఇందులో తూర్పుగోదావరి జిల్లా నుంచి 11మంది, ఏవోబీ నుంచి 20మంది ఉన్నారని వివరించారు. 


ఆదివాసీల అనాసక్తి వల్లే....: మారన్న 

మావోయిస్టు పార్టీలో రిక్రూట్‌మెంట్లు జరగడంలేదని, ఆదివాసీలు ఉద్యమం పట్ల ఆసక్తి చూపడంలేదని మారన్న వెల్లడించారు. ‘‘పోలీస్‌ ఆపరేషన్ల వల్ల ఏవోబీ లో ఒత్తిడి పెరిగింది. ఛత్తీ్‌సగఢ్‌ నుంచి కొందరిని తీసుకొచ్చి పార్టీలో చేర్చుకొంటున్నారు. చేయూత, ప్రేరణ వంటి పోలీసు కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు పెరగడంతో రిక్రూట్‌మెంట్లు జరగడంలేదు.  ఆర్‌వోఎ్‌ఫఆర్‌ ద్వారా ఆదివాసీల సాగు భూమి వారికి వచ్చేలా చేయడంతో లక్షన్నర మంది లబ్ధిపొందారు. రిక్రూట్‌మెంట్లపై ప్రభావం చూపిన కారణాల్లో ఇదీ ఒకటి.  ఇలా మావోయిస్టు పార్టీకి ప్రజాబలం తగ్గుతున్న కారణంగానే నేను జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నాను’’ అని మారన్న స్పష్టం చేశారు.

Updated Date - 2021-04-21T09:47:09+05:30 IST