Abn logo
Oct 29 2020 @ 01:04AM

భయం గుప్పిట మన్యం

పోలీస్‌ ఇన్‌ఫార్మర్ల వేటలో మావోయిస్టులు

అన్నల జాడలో  పోలీసులు 

పోటాపోటీగా హెచ్చరికల ప్రకటనలు

దండకారణ్యంలో బిక్కుబిక్కుమంటున్న గిరిజనులు


ఇల్లెందు, అక్టోబరు 28: మావోయిస్టులకు సహకరిస్తున్న వారిపై పోలీసులు, ఖాకీలకు సాయమందిస్తున్న వారిపై అన్నలు సాగిస్తున్న అణిచివేత చర్యలు, పోటాపోటీ హెచ్చరికలు దండకారణ్యంలో దడపుట్టిస్తున్నాయి. అణిచివేతకు ఒకరు, పట్టుబిగించేందుకు మరొకరు చేపడుతున్న చర్యలు మన్యంవాసులను హడలెత్తిస్తున్నాయి. వేలాది మంది బలగాలతో ఇప్పటికే దండకారణ్యాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. నిత్యం ఏదో ఒకచోట తుపాకీ మోతలతో ఇరువర్గాల్లో జరుగుతున్న ప్రాణనష్టంతో ప్రతీకారేచ్ఛ పదునెక్కుతోంది. గడిచిననెల రోజుల వ్యవధిలో ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు, పోలీసు బలగాల దాడుల్లో 50మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం ఇరువర్గాల నడుమ జరుగుతున్న యుద్దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

పోలీసు అధికారులు మావోయిస్టు నేతలు పరస్పర అరోపణలతో, హెచ్చరికలతో విడుదల చేస్తున్న పత్రిక ప్రకటనలు ఏజన్సీ ప్రాంతాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం- తూర్పుగోదావరి జిల్లాల డివిజనల్‌ కమిటీ కార్యదర్శి ఆజాద్‌ పేరిట పోలీస్‌ హోంగార్డుగా పనిచేస్తున్న నాయకులపు ఈశ్వర్‌ను ప్రజాకోర్టులో ఎందుకు శిక్షించాల్సి వచ్చిందో మంగళవారం ప్రకటన విడుదల చేశారు.


వరంగల్‌ నగరంలోని లేబర్‌కాలనీకి చెందిన ఈశ్వర్‌ను పోలీసు ఎస్‌ఐబీ అధికారులు ఇన్‌ఫార్మర్‌గా మార్చుకొని హోంగార్డు ఉద్యోగం ఇచ్చి మావోయిస్టు దళాలను నిర్మూలించడానికి పథకం వేశారని  పేర్కొన్నారు. దాని ప్రకారం సెప్టెంబరు 7న మావోయిస్టు పార్టీ సభ్యులు శ్రీను, ఐతులను పట్టుకొని బూటకపు ఎన్‌కౌంటర్‌లో హత్యచేశారని, అందుకే ప్రజలు ఈశ్వర్‌కు ప్రజాకోర్టులో మరణశిక్ష విధించారని ఆజాద్‌ ప్రకటించారు. దీనికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎస్‌ఐబీ పోలీసు అధికారులే బాధ్యులని, నమ్మకద్రోహం చేసే వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు.

 

కౌంటరిచ్చిన ఎస్పీ సునీల్‌దత్‌

 కాగా ఆజాద్‌ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే మావోయిస్టుల చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ కౌంటర్‌ప్రకటన విడుదల చేయడం గమనార్హం.  రెండు నెలల కాలంలో మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతాల్లో 25 మంది అమాయక ఆదివాసీ ప్రజలను పోలీస్‌ ఇన్‌ఫార్మర్ల పేరిట హత్యలు చేశారని, సరిహద్దున ఉన్న తెలంగాణ జిల్లాల్లో 15రోజుల్లో ఇద్దరు అమాయక ప్రజలను పొట్టనపెట్టుకున్నారని పేర్కొన్నారు. ప్రజలతో అవసరాలు తీరిన తరువాత మావోయిస్టులు వారిని పోలీస్‌ ఇన్‌ఫార్మర్ల నేపంతో  చంపడం ఎంత వరకు సమంజసమని ఎస్పీ ప్రశ్నించారు. అందుకే మావోయిస్టులకు సహకరించేందుకు ఎవరూ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోకి వెళ్లవద్దని, అటవీ ప్రాంతాల్లోకూంబింగ్‌లు జరుగుతున్నాయని, పట్టుబడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో పోలీస్‌నిఘా పెంచామని ఆర్‌ఎంపీ డాక్లర్లు, వ్యాపారులు మావోయిస్టులకు సహకరించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించడంతో ఏజన్సీ ప్రాంతాల్లో ఏక్షణంలో ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. 


నివురుగప్పిన నిప్పులా వ్యూహలు

ఛత్గీస్‌గఢ్‌, తెలంగాణ, ఆంధ్రా, ఒడిస్సా, మహారాష్ట్ర అటవీప్రాంతాలతో కూడిన దండకారణ్యంలో మావోయిస్టులు, పోలీసు బలగాల నడుమ యుద్ధ వాతావరణ నెలకొంది. ఇరు వర్గాలు పైచేయి సాధించేందుకు అమలుచేస్తున్న వ్యూహలు ఆదివాసుల మనుగడకే ముప్పుగా మారుతున్నాయి. ఎవరికి సహకరిస్తే ఏమవుతుందో అని భయపడుతున్నారు. బతుకు దెరువు కోసం మైదాన ప్రాంతాలకు వలస బాట పడుతున్నారు. అణిచివేత ప్రతిఘటనల వ్యూహల నడుమ ఆదివాసీ ప్రజలు సమిధలుగా మారుతున్నారన్న ఆవేదన సర్వత్రా నెలకొంది. 


ప్రజాకోర్టుల్లో శిక్షలు

అక్టోబరు 7న దండకారణ్యం స్పెషల్‌జోనల్‌ కమిటీ అధికార ప్రతినిది వికల్ప విడుదల చేసిన పత్రికా ప్రకటనలో సైతం దండకారణ్యంలో సాగుతున్న మారణకాండ వెలుగులోకి వచ్చింది.  మావోయిస్టు పార్టీ దళాలే 12మంది పోలీసు రహస్య ఏజెంట్లను, ఐదుగురు కోవర్టులను, ఎనిమిది మంది పోలీస్‌ ఇన్‌ఫార్మర్లను ప్రజాకోర్టుల నిర్ణయాల మేరకు శిక్షించామని అధికార ప్రతినిధి వికల్ప ప్రకటించడం గమనార్హం. ఏకంగా మావోయిస్టు పార్టీ డివిజనల్‌ కమిటీ సభ్యుడు విజ్జాలు, గోనీని సైతం పోలీస్‌ ఇన్‌ఫార్మర్లుగా మార్చుకోని సాయుధ దళాలను నిర్మూలించే కుట్రలకు పోలీసులు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ డీజీపీలు, ఐదు రాష్ట్రాల నిఘా అధికారులు, సీఆర్‌పీఎఫ్‌ డీజీపీలు ములుగుజిల్లా వెంకటాపురంలో సమావేశం నిర్వహించి  దాడులకు వ్యూహాలు రూపొందించారని ఆరోపించారు. నెల రోజుల వ్వవదిలో తమ పార్టీకి చెందిన ఎనిమిది మంది కార్యకర్తలను బూటకపు ఎన్‌కౌంటర్ల పేరిట హత్యలు చేశారని ఆయన ఆరోపించారు. పోలీసులు, మావోయిస్టులు సాగిస్తున్న ప్రకటనల యుద్ధంతోపాటు, దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్న తీరు, మోహరిస్తున్న పోలీస్‌ బలగాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఏక్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. 

Advertisement
Advertisement