‘ఎయిడెడ్‌’పై పోరుకు మావోల మద్దతు

ABN , First Publish Date - 2021-11-13T02:07:54+05:30 IST

రాష్ట్రంలో ఎయిడెడ్‌ విద్యా సంస్థల విలీనానికి నిరసనగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేపడుతున్న ఆందోళనలకు మావోయిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు

‘ఎయిడెడ్‌’పై పోరుకు మావోల మద్దతు

పాడేరు: రాష్ట్రంలో ఎయిడెడ్‌ విద్యా సంస్థల విలీనానికి నిరసనగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేపడుతున్న ఆందోళనలకు మావోయిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఏవోబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి గణేశ్‌ ప్రకటించారు. శుక్రవారం ఆయన ఈ మేరకు మీడియాకు ఓ లేఖను విడుదల చేశారు. ఏడు దశాబ్దాలుగా నడుస్తున్న వందలాది విద్యాలయాలను ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రభుత్వంజీవో-42 జారీ చేసిందన్నారు. దీనివల్ల 223 పాఠశాలల్లోని 1,96,313 మంది, 182 జూనియర్‌ కళాశాలల్లోని 71,031 మంది విద్యార్థులు, 116 డిగ్రీ కళాశాలల్లోని 2,50,000 మంది విద్యార్థులు ఇబ్బంది పడతారన్నారు. విద్యాలయాల మూతతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు విశాఖపట్నం, అనంతపురం, కాకినాడ, గుంటూరు ప్రాంతాల్లో ఆందోళనలు చేశారని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు మీడియాలో ప్రచారం చేసుకుంటోందని, కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయని గణేశ్‌ విమర్శించారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వం...ఇప్పుడు ఎయిడెడ్‌ పాఠశాలల ఆస్తులపై కన్నేసిందన్నారు. విద్యా సంస్థల మూసివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు, ఉద్యమాలకు తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. జీవో-42ను రద్దు చేయాలని, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అందరూ ఖండించాలని మావోయిస్టు నేత గణేశ్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-13T02:07:54+05:30 IST