మారని నేపాల్ తీరు.. స్కూలు పుస్తకాల్లోనూ అదే పాట!

ABN , First Publish Date - 2020-09-18T22:59:52+05:30 IST

నేపాల్ తీరు ఏమాత్రం మారలేదు. భారత భూభాగంలోని కొన్ని ప్రాంతాలను తమవిగా చూపుతూ ఇటీవల వివాదాస్పద మ్యాపులను

మారని నేపాల్ తీరు.. స్కూలు పుస్తకాల్లోనూ అదే పాట!

కఠ్మాండు: నేపాల్ తీరు ఏమాత్రం మారలేదు. భారత భూభాగంలోని కొన్ని ప్రాంతాలను తమవిగా చూపుతూ ఇటీవల వివాదాస్పద మ్యాపులను విడుదల చేసిన పొరుగు దేశం.. ఈసారి స్కూలు పుస్తకాల్లోనూ అదే పని చేసింది. కొత్తగా పరిచయం చేసినపాఠ్యపుస్తకాల్లో సవరించిన రాజకీయ మ్యాప్‌ను ముద్రించింది. అందులో వ్యూహాత్మకంగా ముఖ్యమైన భారత భూభాగంలోని మూడు ప్రాంతాలను తమవిగా పేర్కొంది.


ఇటీవల నేపాల్ సవరించిన తన కొత్త మ్యాప్‌లో భారత భూభాగంలోని లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలను తమవిగా చూపించి వివాదానికి ఆజ్యం పోసింది. ఈ కొత్త పొలిటికల్ మ్యాప్‌కు నేపాల్ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది కూడా. ఈ మ్యాప్‌పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నేపాల్ చర్యను ‘కృత్రిమ విస్తరణ’గా అభివర్ణించింది. 


ఇక, తాజా విషయానికి వస్తే నేపాల్ విద్యా మంత్రిత్వ శాఖలోని కరిక్యులమ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఇటీవల ప్రచురించిన పాఠ్యపుస్తకాల్లో సవరించిన మ్యాప్‌ను ముద్రించింది. 9, 12వ తరగతి విద్యార్థుల కోసం ముద్రించిన ఈ పుస్తకాలకు ‘నేపాల్ భూభాగం మరియు సరిహద్దు సమస్యల పఠన సామగ్రి’ అనే టైటిల్ పెట్టింది. ఈ పుస్తకాలకు విద్యాశాఖ మంత్రి గిరిరాజ్ మణి పోఖరెల్ ముందుమాట రాశారు.   

Updated Date - 2020-09-18T22:59:52+05:30 IST