Abn logo
Nov 26 2020 @ 03:19AM

బంతి కన్నీరు.. సాకర్‌ మాంత్రికుడు డీగో మారడోనా హఠాన్మరణం

బంతి అతడి దగ్గర ఉంటే.. అది ఆట కాదు.. వేటే.. ప్రత్యర్థుల గుండె గుభేలే..! మెరుపు వేగంతో దూసుకెళ్తుంటే.. అభిమానుల కోలాహలం అంబరాన్నంటేది.. మైదానంలో పాదరసంలా కదులుతూ.. డ్రిబ్లింగ్‌ చేస్తుంటే ప్రత్యర్థులు విస్తుపోయి చూడాల్సిందే. గోల్‌ కొడితే.. దిక్కులు పిక్కటిల్లాల్సిందే. తన ఫుట్‌బాల్‌ మాయాజాలంతో.. ప్రపంచాన్నే నాట్యమాడించిన సాకర్‌ మాంత్రికుడు డీగో మారడోనా.. సెలవు తీసుకున్నాడు. ఆటతో లోకాన్ని ఏలిన దిగ్గజం.. భువికేగాడు.బ్యూన్‌సఎయిర్స్‌: అర్జెంటీనా సాకర్‌ మాంత్రికుడు డీగో మారడోనా.. హఠాత్తుగా కన్నుమూశాడు. ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని శోక సంద్రంలో ముంచాడు. వరల్డ్‌కప్‌ విజేత మారడోనా.. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. 60ఏళ్ల మారడోనా మెదడులో రక్తం గడ్డకట్టడంతో శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జయ్యాడు. అయితే, బుధవారం మారడోనాకు గుండెపోటు రావడంతో తన ఇంట్లోనే మృతి చెందినట్టు అతడి లాయర్‌ తెలిపాడు. కెరీర్‌, జీవితంలో డీగో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. డ్రగ్స్‌ బారినపడి చావు అంచుల వరకు వెళ్లినా.. మళ్లీ రాగలిగాడు. 


చిన్నతనం నుంచే..

ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన దిగ్గజాల్లో మారడోనా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సాకర్‌ ప్రపంచాన్ని శాసించిన మారడోనా అసలు పేరు ‘డీగో అర్మాండో మారడోనా’. 1960 అక్టోబరు 30న అర్జెంటీనా, బ్యూన్‌సఎయిర్స్‌లో పేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి డిగో మారడోనా, తల్లి డల్మా సాల్వర్డో ప్రాంకో. నలుగురు అమ్మాయిల తర్వాత మారడోనా జన్మించాడు. అతడిని ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. ఎనిమిదేళ్ల వయసులోనే ఆటలో అద్భుతాలు చేసేవాడు. 12 ఏళ్ల వయసులో హాఫ్‌ టైమ్‌లో బంతితో మ్యాజిక్‌ చేస్తూ.. ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించే వాడు. పొట్టివాడైనా.. ఆటలో ఎంతో గట్టివాడు. 5 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న మారడోనా.. మైదానంలో పాదరసంలా కదిలేవాడు. బంతిపై నియంత్రణ, డ్రిబ్లింగ్‌ స్కిల్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయ్యేవారు. వ్యూహాత్మకంగా ఆడుతూ.. రెప్పపాటులో ప్రత్యర్థి గోల్‌ పోస్టుపై దాడి చేసి గోల్‌ చేసేవాడు. ఎడమ పాదాన్ని ఎంతో బలంగా వాడేవాడు. డీగో మైదానంలో కదులుతున్నాడంటే.. ప్రేక్షకుల్లో ఉత్సాహం వెల్లువలా పొంగేది. వేగంతోపాటు కచ్చితత్వంతో గోల్స్‌ చేసే డీగోను అభిమానులు ‘ఎల్‌ పైబ్‌ ది ఓరో (ద గోల్డెన్‌ బాయ్‌)’ అని ముద్దుగా పిలుచుకొనేవారు. ‘10’ నెంబర్‌ జెర్సీకి అతడు పర్యాయపదంగా మారాడు. 


ప్రత్యర్థులే సలాం కొట్టగా..

పదహారేళ్ల వయసులో అర్జెంటీనోస్‌ జూనియర్స్‌ తరఫున మారడోనా ప్రొఫెషనల్‌గా అరంగేట్రం చేశాడు. 16 నంబర్‌ జెర్సీతో ఆడిన డీగో.. అర్జెంటీనా ప్రిమెరా డివిజన్‌కు ఆడిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. 1976-81 వరకు అర్జెంటినోస్‌ తరఫున ఆడిన డీగో.. ఆ తర్వాత బోకా జూనియర్స్‌కు మారాడు. ఏడాది తర్వాత బార్సిలోనా అతడిని రికార్డు ధర 8 మిలియన్‌ డాలర్లకు ఖరీదు చేసింది. ఓ మ్యాచ్‌లో రియల్‌ మ్యాడ్రిడ్‌పై బార్సిలోనా విజయం తర్వాత.. ప్రత్యర్థి ఆటగాళ్లు మారడోనాకు నిలబడి ప్రశంసించారు. 1984 కోపా డెల్‌ రే కప్‌ ఫైనల్లో అథ్లెటిక్‌ బిల్‌బావో మ్యాచ్‌లో జరిగిన రచ్చలో మారడోనా ప్రముఖంగా కనిపించాడు. ఈ సందర్భంగా జరిగిన గొడవల్లో అనేక మంది గాయపడ్డారు. బార్సిలోనా క్లబ్‌ పెద్దలతో అనేకసార్లు ఘర్షణ పడడం అతడి కెరీర్‌ను దెబ్బతీసింది. కానీ, ఆటలో అతడు మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో.. 1984లో ఇటలీ క్లబ్‌ నపోలీకి.. మారడోనాను బార్సిలోనా అమ్మేసింది. ఆ క్లబ్‌కు అంతా తానై వ్యవహరించిన డీగో.. ఒంటిచేత్తో ఇటాలీగ్‌ టైటిల్‌ను సాధించిపెట్టాడు. అయితే, ఈ సమయంలోనే వ్యక్తిగత ఇబ్బందులు పెరగడంతో మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. ఒత్తిడి కారణంగా ప్రాక్టీస్‌ కూడా వెళ్లేవాడు కాదు. దీంతో అనేకసార్లు అతడికి జరిమానా కూడా విధించారు. అక్రమ సంతానంతోపాటు డ్రగ్స్‌ మాఫియాతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అనేక కేసులు ఎదుర్కొన్నాడు. అయితే, మారడోనా గౌరవార్థం నపోలీ క్లబ్‌ పదవ నెంబర్‌ జెర్సీని రిటైర్‌ చేసింది. కొకైన్‌ వాడినట్టు తేలడంతో అతడిపై 15 నెలల బ్యాన్‌ విధించారు. 1992లో నపోలీ క్లబ్‌ను వీడిన తర్వాత సివిల్లా, టోటెన్‌ హామ్‌ క్లబ్‌లకు కూడా ఆడాడు. అంతర్జాతీయ కెరీర్‌..

అర్జెంటీనా తరఫున మారడోనా 91 మ్యాచ్‌ల్లో 34 గోల్స్‌ సాధించాడు. 16 ఏళ్ల వయసులో 1977లో హంగేరిపై మ్యాచ్‌ ఆడాడు. 1978లో సొంతగడ్డపై జరిగిన వరల్డ్‌క్‌పలో డీగోకు చోటుదక్కలేదు. వయసు తక్కువ కావడంతో అతడిని టీమ్‌కు ఎంపిక చేయలేదు. 1979లో జరిగిన ఫిఫా యూత్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో మారడోనా స్టార్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో తొలి అంతర్జాతీయ గోల్‌ సాధించాడు. అర్జెంటీనా తరఫున రెండుసార్లు కోపా అమెరికా కప్‌లో కూడా ఆడాడు. ‘విశ్వ’ విజయం

మెక్సికోలో జరిగిన 1986 వరల్డ్‌క్‌పలో.. మారడోనా సారథ్యంలో అర్జెంటీనా విశ్వక్‌పను ముద్దాడింది. టోర్నీ ఆసాంతం డీగో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మారడోనా రెండు గోల్స్‌తో గెలిపించాడు. బెల్జియంతో సెమీ్‌సతో మరో రెండు గోల్స్‌తో అర్జెంటీనాకు ఫైనల్‌కు చేర్చాడు. కానీ, తుది పోరులో జర్మనీ.. డబుల్‌ మార్కింగ్‌తో మారడోనాను కట్టడి చేసింది. అంతిమంగా మాత్రం అర్జెంటీనా 3-2తో గెలిచి.. కలల కప్‌ను అందుకొంది. ఇటలీలో జరిగిన 1990 వరల్డ్‌క్‌పలో మారడోనా కెప్టెన్సీలో బరిలోకి దిగిన డిఫెండింగ్‌ చాంప్‌ అర్జెంటీనా.. ఆరంభంలో నిరాశపరిచినా ఫైనల్‌కు చేరుకొంది. అయితే, ఈ టోర్నీలో మారడోనా ముందులా తన మాయాజాలాన్ని మాత్రం ప్రదర్శించలేక పోయాడు. తుది పోరులో జర్మనీ చేతిలో అర్జెంటీనా ఓడింది. 1994లో అమెరికాలో జరిగిన విశ్వక్‌పలో మారడోనా కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. డోపింగ్‌లో పాజిటివ్‌గా రావడంతో టోర్నీ నుంచి తప్పించారు. ఆ కప్‌లో నైజీరియాతో మ్యాచ్‌లో డీగో చేసిన గోల్‌.. అతడి కెరీర్‌లో చివరిది. 1997లో సుదీర్ఘ కెరీర్‌కు మారడోనా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’..

డీగో మారడోనా తన కెరీర్‌లో ఎన్నో గోల్స్‌ సాధించినా... 1986 ప్రపంచక్‌పలో కొట్టిన రెండు గోల్స్‌ అతడికి ఎనలేని ఖ్యాతిని తీసుకొచ్చాయి. ఒకే మ్యాచ్‌లో నాలుగు నిమిషాల వ్యవధిలో డీగో సాధించిన ఆ రెండు గోల్స్‌లో ఒకటి ‘ఆ శతాబ్దపు గోల్‌’గా రికార్డుకెక్కగా.. వివాదాస్పదమైన మరో గోల్‌ ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’గా అతడిని చరిత్రలో నిలబెట్టింది. మెక్సికో వేదికగా జూన్‌ 22న ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లో అర్జెంటీనా 2-1 స్కోరుతో గెలవగా.. ఆ రెండు గోల్స్‌నూ మారడోనానే సాధించాడు. ద్వితీయార్థం మొదలైన ఆరో నిమిషంలో అతను కొట్టిన తొలి గోల్‌ వివాదాస్పదమైంది. హెడర్‌ గోల్‌గా నమోదైన దాన్ని అతడు చేత్తో కొట్టినట్టుగా స్పష్టమైంది. నిబంధనల ప్రకారం చేత్తో కొట్టిన గోల్‌ లెక్కలోకి  రాదు. కానీ, రెఫరీలు దాన్ని గమనించకపోవడంతో అర్జెంటీనాకు 1-0 ఆధిక్యం దక్కింది. తర్వాత నాలుగు నిమిషాలకే మారడోనా మరో గోల్‌ కొట్టి అర్జెంటీనాను గెలిపించాడు. దీన్ని ‘గోల్‌ ఆఫ్‌ ది సెంచరీ’గా అభివర్ణిస్తారు. ఆ మ్యాచ్‌ తర్వాత వివాదాస్పద గోల్‌ గురించి మారడోనాను ప్రశ్నించగా.. ‘ఆ గోల్‌ను కాస్త నా తలతో.. మరికాస్త దైవ హస్తంతో సాధించా’ అని సమాధానమిచ్చాడు. 
డ్రగ్స్‌కు బానిసై..

1980 మధ్య నుంచి 2004 వరకు కొకైన్‌కు బానిసయ్యాడు. బార్సిలోనా, నపోలి క్లబ్‌లకు ఆడేటప్పుడే డ్రగ్స్‌కు అలవాటుపడినట్టు ఒకానొక సమయంలో చెప్పాడు. క్రమశిక్షణ లేని జీవన విధానం కారణంగా ఊబకాయంతో తీవ్రంగా ఇబ్బందులుపడ్డాడు. గ్యాస్ట్రిక్‌ బైపాస్‌ సర్జరీ కూడా చేయించుకున్నాడు. ఆ తర్వాత మద్యానికి కూడా అలవాటుపడ్డాడు. అయితే, 2007లో తాను వ్యసనాలకు దూరంగా ఉన్నట్టు తెలిపాడు. 


పైలోకంలో మారడోనాతో ఆడతా..

‘ఎంత విషాదకరం. గొప్ప స్నేహితుడిని, కోల్పోయా. ప్రపంచం ఓ దిగ్గజాన్ని కోల్పోయింది. ఏదో ఒకరోజు పైలోకంలో మారడోనాతో కలిసి బంతితో ఆడతా’  

     - పీలే


‘అర్జెంటీనాకు, ఫుట్‌బాల్‌కు ఇది విషాదకరమైన రోజు. మనల్ని వదిలివెళ్లినా అతనెప్పటికీ మనతోనే ఉంటాడు. డీగోకు మరణం లేదు’  - లియోనెల్‌ మెస్సీ

‘అనితరసాధ్యుడు. అతను త్వరగా వెళ్లిపోయుండొచ్చు.. కానీ, ఆటలో అతని మాయాజాలం ఎప్పటికీ ఉంటుంది’                                                 - క్రిస్టియానో రొనాల్డో

‘నా హీరో ఇకలేడు. నేను పిచ్చిగా ఆరాధించే జీనియస్‌ ఆత్మకు శాంతి కలగాలి. నీ కోసమే ఫుట్‌బాల్‌ చూశా’                                                        - సౌరవ్‌ గంగూలీ

‘ఫుట్‌బాల్‌తో పాటు ప్రపంచ క్రీడాలోకం అత్యుత్తమ ఆటగాడిని కోల్పోయింది’

                                                                                   - సచిన్‌ టెండూల్కర్‌

Advertisement
Advertisement
Advertisement