మార్చి 11కి ‘ఎండెమిక్‌’ దశ

ABN , First Publish Date - 2022-01-20T07:01:56+05:30 IST

ఒమైక్రాన్‌ వల్ల దేశంలో ప్రస్తు తం లక్షలాది కొవిడ్‌ కేసులు వస్తున్నాయి. కొత్త వేరియంట్‌ ఉధృతిపై ఆందోళన నెలకొంది.

మార్చి 11కి ‘ఎండెమిక్‌’ దశ

ఈ నెల 23కు థర్డ్‌ వేవ్‌ తీవ్ర స్థాయికి

దేశంలో మరో 2.82 లక్షల పాజిటివ్‌లు


న్యూఢిల్లీ, జనవరి 19: ఒమైక్రాన్‌ వల్ల దేశంలో ప్రస్తు తం లక్షలాది కొవిడ్‌ కేసులు వస్తున్నాయి. కొత్త వేరియంట్‌ ఉధృతిపై ఆందోళన నెలకొంది. ఈ తీవ్రత ఎప్పటివరకు ఉంటుందనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యం లో మార్చి 11 నాటికి కొవిడ్‌ ఎండెమిక్‌గా మారుతుందం టున్నారు ఐసీఎంఆర్‌ ఎపిడెమియోలాజికల్‌ విభాగాధిపతి సమీరన్‌ పాండా. అయితే, దీనికి కొన్ని పరిమితులున్నాయంటున్నారు. డెల్టా వేరియంట్‌ స్థానాన్ని ఒమైక్రాన్‌ భర్తీ చేస్తే, కొవిడ్‌ నిబంధనలు లేదా జాగ్రత్తలను విస్మరించకుంటే, కొత్త వేరియంట్‌ ఉద్భవించకుంటే.. కొవిడ్‌ ఎండెమిక్‌ దశకు చేరుకుంటుందంటున్నారు. ‘‘మా అంచనాల ప్రకారం డిసెంబరు 11న ప్రారంభమైన ఒమైక్రాన్‌ వేవ్‌ 3 నెలలు కొనసాగుతుంది. మార్చి 11 నుంచి కొంత ఉపశమనం ఉండొచ్చు. ఇక ఢిల్లీ, ముంబైల్లో కేసులు, పాజిటివ్‌ రేటు తగ్గుతున్నా.. అక్కడ కొవిడ్‌ ఉధృత స్థాయికి చేరిందా? విషమ దశ ముగిసిందా? అంటే ఇప్పుడే చెప్పలేం. ఇది తేలాలంటే మరో 2 వారాలు ఆగాలి. ఈ రెండు నగరాల్లో ఒమైక్రాన్‌, డెల్టా నిష్పత్తి 80:20గా ఉంది’’ అని సమీరన్‌ పాండా చెప్పారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కొవిడ్‌ వ్యాప్తి ఉందన్నారు.


రాష్ట్రాలను టెస్టులు తగ్గించమనలేదు

ఎపిడెమియోలాజికల్‌ వైవిధ్యాలకు తోడు వైరస్‌ తన మార్గాన్ని మారుస్తున్న తీరుకు తగినట్లుగా ఐసీఎంఆర్‌ ఇటీవల పరీక్షల వ్యూహాన్ని సవరించిన విషయాన్ని గుర్తుచేసిన సమీరన్‌ పాండా టెస్టులు తగ్గించాలని రాష్ట్రాలను కోరలేదన్నారు. మహమ్మారి స్వభావాన్ని మార్చుకున్నందున టెస్టింగ్‌ వ్యూహాలూ మారుతాయన్నా రు. మరింత నిర్దేశితంగా, లక్ష్యంతో పరీక్షలు చేయాలని కోరినట్లు వివరించారు. కాగా, ఇంట్లోనే పరీక్షలు తదితర అంశాలపై మార్గదర్శకాలను స్థానిక భాషల్లో అందుబాటులో ఉంచితే సందిగ్ధత తొలగుతుందన్నారు. మరోవైపు ఇన్ఫెక్షన్ల తీవ్రతను తెలుసుకోవడానికి ఆస్పత్రుల్లో అధ్యయనం చేస్తున్నట్లు సమీరన్‌ పాండా వివరించారు. కొవిడ్‌ చికిత్స విధానంలో మోల్నుపిరవిర్‌ను తొలగించడంపై ఐసీఎంఆర్‌, డీసీజీఐ భిన్న దారుల్లో ఉన్న అంశమై మాట్లాడుతూ.. ‘‘టీకా తీసుకోని రోగులకు మోల్నుపిరవిర్‌ ఇవ్వొచ్చు. కానీ, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పిల్లలకు ఇచ్చేందుకు మార్గదర్శకాలు లేవు. అందుకే మార్గదర్శకాల్లో చేర్చలేదు’’ అని సమీరన్‌ పాండా పేర్కొన్నారు.


ఉధృత దశకు ఢిల్లీ, ముంబై: మణీంద్ర

దేశంలో కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ ఈ నెల 23 నాటికి ఉధృత స్థాయికి చేరే అవకాశం ఉందని, కేసులు మాత్రం 4 లక్షల్లోపే ఉంటాయని ఐఐటీ కాన్పూర్‌ శాస్త్రవేత్త మణీంద్ర అగర్వాల్‌ అన్నారు. వైరస్‌ వ్యాప్తి తీరును అం చనావేసే ‘కొవిడ్‌ సూత్ర మోడల్‌’లో సభ్యుడైన మణీంద్ర కేసుల పరంగా గత వారంలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా ఉధృత దశకు చేరాయని వివరించారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, హరియాణల్లో ఈ వారం లో, ఏపీ, అసోం, తమిళనాడుల్లో వచ్చే వారంలో కేసులు గరిష్ఠ స్థాయికి చేరుతాయని చెప్పారు. కాగా, ఈ నెల ఆఖరుకు థర్డ్‌ వేవ్‌ ఉధృత స్థాయికి చేరుతుందని, 7 లక్షల పైగా కేసులొస్తాయని గతంలో మణీంద్ర అన్నారు. దేశంలో మంగళవారం 2.82 లక్షల మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. యాక్టివ్‌ కేసులు 19 లక్షలకు చేరాయి. పాజిటివ్‌ రేటు 15.53కు పెరిగింది. కాగా, ఇటీవల కేం ద్రం అప్రమత్తం చేసిన నేపథ్యంలో రాష్ట్రాలు టెస్టుల సం ఖ్యను పెంచాయి. బుధవారం 18 లక్షలపైగా పరీక్షలు నిర్వహించారు. గత 10 రోజుల్లో ఇవే అత్యధికం. ఉత్తరాఖండ్‌ ముస్సోరిలో ఉన్న లాల్‌బహదూర్‌ శాస్త్రి జాతీయ అకాడమీలో శిక్షణ పొందుతున్న 84 మంది ఐఏఎస్‌ అధికారులు వైరస్‌ బారినపడ్డారు. 


కొవిషీల్డ్‌, కొవ్యాక్సిన్‌లకు అనుమతులు!

కొవిషీల్డ్‌, కొవ్యాక్సిన్‌ టీకాలు పూర్తిస్థాయి మార్కెట్‌ అనుమతులు ఇవ్వొచ్చంటూ కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎ్‌ససీవో)కు చెందిన విషయ నిపుణుల కమిటీ బుధవారం సిఫారసు చేసింది. దీని ఆధారంగా త్వరలోనే డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) త్వరలోనే తుది అనుమతులను మంజూరు చేయనుంది. 

Updated Date - 2022-01-20T07:01:56+05:30 IST