భార్య హత్య కేసులో భర్త అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-09-18T03:40:03+05:30 IST

మద్యం తాగేందుకు డబ్బివ్వలేదని భార్యను హత్య చేసిన భర్త పాలూరి మోహనచారిని రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

భార్య హత్య కేసులో భర్త అరెస్ట్‌
నిందితుల వివరాలు వెళ్లడిస్తున్న డీఎస్పీ ప్రసాద్‌

వివరాలు వెల్లడించిన డీఎస్పీ ప్రసాద్‌

కావలి రూరల్‌, సెప్టెంబరు 17: మద్యం తాగేందుకు డబ్బివ్వలేదని భార్యను హత్య చేసిన భర్త పాలూరి మోహనచారిని రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు స్థానిక డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ డీ.ప్రసాద్‌ కేసు వివరాలు వెళ్లడించారు. కావలి పట్టణంలోని ముసునూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన మోహనచారి, వెంకటలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారికి వివాహాలు చేశారు. పట్టణంలోని వెక్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో క్యాంటిన్‌ నిర్వహిస్తూ మోహనచారి, వెంకటలక్ష్మి దంపతులు జీవనం సాగిస్తున్నారు. మద్యం, చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఆయన డబ్బుల కోసం నిత్యం భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీన భార్యాభర్తల మధ్య వివాదం జరిగింది. ఈ విషయాన్ని తన పెద్ద కుమారై వడ్లమాని లక్ష్మీప్రసన్నకు తల్లి వెంకటలక్ష్మి ఫోన్‌ చేసి చెప్పగా ఆమె సర్ది చెప్పింది. అయితే తన భార్యను చంపేస్తే క్యాంటిన్‌ ఒక్కడే నడుపుకోవచ్చని, తన జల్సాలకు ఎవ్వరూ అడ్డురారని నిర్ణయించుకున్న మోహనచారి గురువారం ఉదయం మిద్దెపై నిద్రిస్తున్న వెంకటలక్ష్మి తలపై రోకలిబండతో కొట్టి చంపి రోకలి బండను ముళ్లచెట్లలో వేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు  ముసునూరులోని పమిడి స్కూల్‌ సమీపంలో మోహనచారిని అదుపులోకి తీసుకుని విచారించగా జరిగిన విషయమంతా వెలుగు చూసింది. దీంతో అతనిని అరెస్ట్‌ చేసి, రోకలిబండను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని అరెస్ట్‌ చేయడంలో చొరవ చూపిన సీఐ అక్కేశ్వరరావు, ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి, సిబ్బంది వేణు కుమార్‌, మాధవరావు, రాజేష్‌లను అభినందించారు.

Updated Date - 2021-09-18T03:40:03+05:30 IST