ముందు పైలెట్.. వెనుక గంజాయి

ABN , First Publish Date - 2021-11-16T16:21:23+05:30 IST

ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నా అంతర్రాష్ట్ర నేరగాళ్లు గంజాయి స్మగ్లింగ్‌ను ఆపడం లేదు. పోలీసుల కళ్లు గప్పి యథేచ్ఛగా గంజాయిని తరలిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ, ఒడిశా

ముందు పైలెట్.. వెనుక గంజాయి

 సరుకున్న వాహనానికి జీపీఎస్‌.. రవాణాలో కొత్త ఎత్తులు

రాష్ట్రాలు దాటిస్తున్న అక్రమార్కులు.. అడ్డుకుంటున్న పోలీసులు


హైదరాబాద్‌ సిటీ: ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నా అంతర్రాష్ట్ర నేరగాళ్లు గంజాయి స్మగ్లింగ్‌ను ఆపడం లేదు. పోలీసుల కళ్లు గప్పి యథేచ్ఛగా గంజాయిని తరలిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ, ఒడిశా బోర్డర్‌ల నుంచి నగరానికి, ఇతర రాష్ర్టాలకూ చేరవేస్తున్నారు. ఆదివారం రాచకొండ పోలీసులు 12.40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గత నెల 30న 110 కిలోల గంజాయిని పట్టుకున్నారు. స్మగ్లర్లు టెక్నాలజీని ఉపయోగిస్తూ, హైటెక్‌ హంగులతో గంజాయిని తరలిస్తున్నారు. 


స్మగ్లింగ్‌ ఇలా..

విశాఖ ఏజెన్సీ, ఆంధ్రా ఒడిశా బోర్డర్లలో గంజాయిని లారీల్లో నింపిన తర్వాత ముందుగా కొంతమంది ముందు కారులో బయల్దేరుతారు. 3-4 కిలోమీటర్లు వెళ్లి ఎక్కడా ఎలాంటి పోలీస్‌ తనిఖీలు లేవని, రూట్‌ చాలా క్లియర్‌గా ఉందని వారు సమాచారం ఇచ్చిన తర్వాత వెనుక గంజాయి తరలిస్తున్న వాహనం బయల్దేరుతుంది. ఇలా వందలాది కిలోమీటర్లు ముందు కారులో పైలెట్‌లా పరిసరాలను గమనిస్తూ, వెనకాల గంజాయి లారీకి రూట్‌ క్లియర్‌ చేస్తూ వివిధ రాష్ట్రాలను దాటించి గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్నారు. గంజాయి తరలించే లారీల్లో నేరగాళ్లు కొత్తగా జీపీఎస్‌ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జీపీఎస్‌ ట్రాకింగ్‌ ప్రధాన స్మగ్లర్స్‌కు, కారులో పైలెట్‌గా ఉన్న వారికి తెలిసేలా సెట్‌ చేస్తున్నారు. మార్గమధ్యలో ఎక్కడైనా లోడుతో ఉన్న లారీ ఆగిపోతే వెంటనే పైలట్‌  టీమ్‌కు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన స్మగ్లర్లకు తెలుస్తుంది. వారు వెంటనే అప్రమత్తమై ఏం జరిగిందో తెలుసుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు. 


ఇంట్లోనే సాగు.. 

నగరంలో గంజాయి దొరకడం కష్టంగా మారడంతో, దానికి అలవాటు పడ్డవాళ్లు, అవసరమున్న వారు ఇళ్లలో పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. జనావాసాలకు దూరంగా ఉన్న ఇళ్లు, ఫామ్‌హౌ్‌సలు, ఇండిపెండెంట్‌ ఇళ్లు, ఇంటిపై మిద్దె  ఉన్నవారు ఈ తరహా ప్రయోగాలు చేస్తున్నారు. జవహర్‌నగర్‌ పరిధిలో నివసించే బేకరీ నిర్వాహకుడు పిల్లుట్ల వెంకట నర్సింహశాస్త్రి తన ఇంటి మేడపై ఏడు కుండీల్లో గంజాయి మొక్కలు పెంచుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఓనర్‌ అమెరికాలో ఉండటం, నిఘా లేకపోవడంతో ఇతడు ఈ ప్రయోగం చేశాడు. తాను వినియోగించడంతో పాటు అమ్ముకునేందుకు ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచడం ప్రారంభించాడు. ఇదే ప్రాంతంలో అంబులెన్స్‌ డ్రైవర్‌ ఆయూబ్‌ఖాన్‌కు సొంత ఇల్లు ఉండగా, మరో ఇల్లు అద్దెకు తీసుకొని గంజాయి మొక్కలను పెంచుతూ పోలీసులకు చిక్కాడు. ఇతడి వద్ద నాలుగు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యసనపరులు ఇదే తరహా సాగుకు అలవాటుపడితే గంజాయి కుటీర పరిశ్రమగా మారే ప్రమాదముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


రంగంలోకి స్నిఫర్‌ డాగ్స్‌

గంజాయి, డ్రగ్స్‌ వంటి మాదక ద్రవ్యాలను నగరంలోకి రాకుండా చేయడానికి పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. రాచకొండ పరిధిలో ఉన్న హైవేలపై ప్రత్యేక బృందాలు నిఘా పెట్టాయి. గంజాయి, డ్రగ్స్‌ను పట్టించే ప్రత్యేక స్నిఫర్‌  డాగ్స్‌ను రంగంలోకి దింపుతున్నాం. నిర్మానుష్య ప్రాంతాలు, హాట్‌ స్పాట్స్‌లు, హైవే చెక్‌పాయింట్స్‌ వద్ద ఈ డాగ్‌ స్క్వాడ్స్‌ అందుబాటులో ఉంచుతున్నాం.

- మహేష్‌ ఎం. భగవత్‌, రాచకొండ సీపీ.

Updated Date - 2021-11-16T16:21:23+05:30 IST