మత్తు.. మస్తు!

ABN , First Publish Date - 2021-10-28T04:47:28+05:30 IST

ఉమ్మడి జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది.

మత్తు.. మస్తు!

  • ఉమ్మడి జిల్లాలో గంజాయి కలకలం
  • బానిసవుతున్న యువత, కార్మికులు
  • మేడ్చల్‌ జిల్లాకు అరబ్‌, వైజాగ్‌, ధూల్‌పేట్‌, ఫత్తేనగర్‌, బాల్‌నగర్‌ నుంచి గుట్టుచప్పుడు కాకుండా సరఫరా
  • గ్రామీణ ప్రాంతాల్లో కంది, జొన్న,మొక్కజొన్న, పత్తి పంటల మధ్య సాగు


ఉమ్మడి జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. ఇదివరకు పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి.. చాపకింద నీరులా గ్రామాలకు వ్యాపిస్తోంది. మత్తుకు యువత, విద్యార్థులు చిత్తవుతున్నారు. నేరాలకు పాల్పడుతూ బంగారు భవిష్యత్‌ను బలిపెడుతున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు కూడా క్రమంగా బానిసవుతున్నారు. 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌ / ఉమ్మడి జిల్లా విలేకరుల బృందం) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మత్తుకు అలవాటు పడుతున్న వారిలో ఎక్కువగా 20 ఏళ్లలోపు వారే అధికంగా ఉంటున్నారు. విద్యార్థులు, యువకులతోపాటు కూలీ చేసుకునే వారు కూడా మత్తుకు బానిసవుతున్నారు. సిగరేట్‌లో పొగాకు తీసేసి, గంజాయి పౌడర్‌ పెట్టుకుని పీలుస్తున్నారు. వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికులు గంజాయి మత్తులో చిత్తవుతున్నారు. ఏడాది నుంచి ఇప్పటివరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్సైజ్‌ అధికారులు 56.53 కిలోల గంజాయిని పట్టుకు న్నారు. పట్టుబడిన ఈ గంజాయి విలువ సుమారు రూ. 11 లక్షలు ఉంటుందని అంచనా.


అరబ్‌, వైజాగ్‌ నుంచి... 

ఘట్‌కేసర్‌ ప్రాంతానికి అరబ్‌, వైజాగ్‌, పీలేరు ప్రాంతాల నుంచి గం జాయి వస్తుంది. మేడ్చల్‌ నియోజకవర్గానికి ధూల్‌ పేట్‌, ఫత్తేనగర్‌, బాల్‌నగర్‌ నుంచి గుట్టుచప్పుడు కాకుండా సరఫరా అవుతోంది. గతేడాది కిలో గంజాయి రూ.15 వేలు పలికింది. గంజాయిపై సర్కార్‌ ఉక్కుపాదం మోపడంతో... కొరత ఏర్పడి కిలో గంజాయి రూ.40 వేల వరకు విక్రయిస్తున్నారు. యువత, కార్మి కులను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యాపారులు గంజాయి అమ్ముతున్నారు. యువత సరదాగా ప్రారంభిస్తున్న గం జాయి వాడకం.. క్రమేణా బానిసలుగా మారిపోతున్నారు. గంజాయి విక్రయించే ముఠాలు పోలీసులకు చిక్కకుండా  విభిన్న రూపాల్లో తరలిస్తున్నారు. 


జొన్న, మొక్కజొన్న, కంది చేనుల్లో సాగు

ఉమ్మడి జిల్లాలో గంజాయి సాగు గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్నారు. పత్తి, కంది సాగు మధ్యలో అంతర పంటగా గంజాయిని సాగుచేస్తున్నారు. వికారాబాద్‌ నియోజకవర్గం పరిధిలో బంట్వారం, కోట్‌పల్లి, మర్పల్లి మండలాల్లో కొందరు రైతులు తమ పొలాల్లో రహస్యంగా గంజాయి సాగు చేస్తున్నారు. 

ఇటీవల బంట్వారం మండల కేంద్రంలో ఓ రైతు నుంచి కిలో ఎండు గంజాయి స్వాధీనం చేసుకోగా, అదే మండలం రొంపల్లి గ్రామంలో ఓ రైతు పొలంలో సాగు చేస్తున్న 32 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. మర్పల్లి మండలంలో తుమ్మలపల్లి గ్రామంలో 41 గంజాయి మొ క్కలు స్వాధీనం చేసుకోగా, ఇదే మండలంలోని ఖల్కోడ గ్రామంలో 9 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. చేవెళ్ల డివిజన్‌ పరిధిలోని షాబాద్‌ మండలంలో ఇటీవలే 4.13 కిలోల గంజాయిని పట్టుకు న్నారు. తాజాగా 3.5 కిలోల గంజాయి పట్టుకున్నారు. శంషాబాద్‌ మండలంలోని పెద్దషాపూర్‌లో గత జూలైలో ఆరు కిలోల గంజాయిని పట్టుకున్నారు 


ఉక్కుపాదం..

ఉమ్మడి జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. గం జాయి సాగు చేసే వారితోపాటు అమ్మినా, కొనుగోలు చేసినా, ఉపయోగించిన వారెవరినీ వదిలి పెట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పోలీసు, ఎక్సైజ్‌ అధికారులు రంగంలోకి దిగారు. తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. పంట పొలాల్లో రహస్యంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు.


తొమ్మిదిన్నర కిలోల గంజాయి పట్టివేత

ఆమనగల్లు / షాబాద్‌ / ఘట్‌కేసర్‌ రూరల్‌ : కడ్తాల, షాబాద్‌, ఘట్‌కేసర్‌ మండలాల్లో బుధవారం ఒక్కరోజే తొమ్మిదిన్నర కిలోల గంజాయి పట్టుబడింది. వివరాలు ఇలా ఉన్నాయి. 

కడ్తాల మండలం, బాలాజీనగర్‌ తండాలోని రాధాకృష్ణ దేవాలయం సమీపంలో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో బుధవారం కడ్తాల ఎస్‌ఐ హరిశంకర్‌గౌడ్‌తో కలిసి ఆమనగల్లు సీఐ జాల ఉపేందర్‌ దాడి నిర్వహించారు. బాలాజీనగర్‌ తండా శివారులోని జయరామ్‌నాయక్‌ పశువుల కొట్టం ఆవరణలో అక్రమంగా పెంచుతున్న రెండు గంజాయి చెట్లను గుర్తించారు. పోలీసు సమాచారం మేరకు కడ్తాల తహసీల్దార్‌ మహేందర్‌రెడ్డి అక్కడికి చేరుకొని పంచనామా నిర్వహించారు. బట్టలు కప్పి రహ స్యంగా ఉంచిన నాలుగు కిలోల బరువుతో ఉన్న చెట్లను స్వాధీనం చేసుకొని పరీక్షల నిమిత్తం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపినట్లు సీఐ ఉపేందర్‌ పేర్కొన్నారు. క్లూస్‌టీం వివరాలు సేకరించింది. ఈమేరకు జయరామ్‌నాయక్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. అయితే స్థానిక కొందరు అధికార పార్టీ అగ్రనేతలు నిందితుడిని కేసు నుంచి రక్షించడానికి పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

షాబాద్‌ మండలం హైతాబాద్‌ ఇండస్ర్టియల్‌ ఏరియాలోని లేబర్‌ రూంలో ఒడిశాకు చెందిన సనాతన్‌రౌత్‌, బిక్రంరౌత్‌ అనే ఇద్దరు గంజాయి అమ్ముతున్నట్లు పోలీ సులకు సమాచారం అందింది. పోలీసులు తనిఖీ చేసి 3.5కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ తెలిపారు.

ఘట్‌కేసర్‌ ఎక్సైజ్‌ పోలీసులు బుధవారం ఇద్దరు వ్యక్తుల నుంచి 2కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఘట్‌ కేసర్‌ మండలం ఫిర్జాదిగూడలోని బుద్దానగర్‌ రాఘవేంద్రనగర్‌ కాలనీలో గంజాయి అమ్ముతున్నట్లు సమా చారం అందడంతో పోలీసులు తనిఖీ చేశారు. దైద సురేష్‌, తిరుమలేష్‌ వద్ద 2కిలోల గంజాయి పట్టుబడింది. దాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసు కుని రిమాండ్‌కు తరలించినట్లు ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లయ్య తెలిపారు. 


గంజాయి అమ్మితే క్రిమినల్‌ కేసులు  : చేవెళ్ల ఎక్సైజ్‌ సీఐ రాకేష్‌

గంజాయి అమ్మితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైనా మత్తు పదార్థాలు, అమ్మినా, సేవించినా కఠిన శిక్ష తప్పదు. మొయినాబాద్‌లో 150 గ్రాములు, షాబాద్‌ మండలంలో 100 గ్రాముల గంజాయిని రెండు నెలల క్రితం పట్టుకున్నాం. ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నారని తెలిస్తే సమాచారం అందించండి. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. 


గంజాయిపై పోలీస్‌ పంజా :ఏసీపీ కుశాల్కర్‌ 

షాద్‌నగర్‌ : గంజాయి అమ్మ కాలను అరికట్టడానికి షాద్‌నగర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సీహెచ్‌ కుశాల్కర్‌ వ్యుహాన్ని రచించారు. షాద్‌నగర్‌ నియోజక వర్గ సరిహద్దుల్లో నిరంతర నిఘా, గ్రామాల్లో యాంటీ డ్రగ్‌ స్క్వాడ్‌లను నియమించారు. ఇందులో ఒక కాని స్టేబుల్‌తోపాటు నలుగురు విద్యావంతులైన నలుగురు యువకులను నియమించారు. వీరు గ్రామాల్లో ఉన్న యువత పట్ల నిఘా ఉంచుతారు. ఎవరైనా నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలు చేపడితేవారు వివరాలను పోలీసులకు చేరవేస్తారు. అలాగే మండల కేంద్రాలు, షాద్‌నగర్‌ పట్టణంలో ఉన్న యువతపై మఫ్టీలో పోలీసులను నిఘా పెట్టారు. షాద్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు, నందిగామ, కొందుర్గు ప్రాంత పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాలను సేకరించారు. గంజాయి అలవాటు ఉన్నవారి పేర్లను సేకరించి ఆయా మండలాల పోలీసులు సమాచారం అందించారు. వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడంతోపాటు బైండోవర్‌ కేసులు నమోదు చేస్తామ న్నారు. మెడికల్‌ షాపుల్లో కొన్ని దీర్థకాలిక వ్యాధుల నివారణ కోసం ఎక్కువ మోతాదు కలిగిన మత్తు మందులు కూడా ఉన్నాయి. గంజాయికి దొరకనప్పుడు మత్తు ట్యాబ్లెట్లను కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. అందుకే మెడికల్‌ షాపులపై నిఘా పెట్టామన్నారు. గంజాయి నివారణకు ఈనెల 30న ఎక్సైజ్‌, డ్రగ్‌ఇన్‌స్పెక్టర్‌, తూనికలు, కొలతలశాఖ అధికారులతోపాటు మెడికల్‌షాపు నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఏసీపీ తెలిపారు. 


స్వాధీనం చేసుకున్న గంజాయి వివరాలు

డివిజన్‌ కిలోలు విలువ(రూ.లలో)

తాండూరు కిలో 30,000

చేవెళ్ల 7.53 2,10,000

శంషాబాద్‌ 06 1,80,000

షాద్‌నగర్‌ అరకేజి 20,000

పరిగి 20మొక్కలు 30,000

వికారాబాద్‌ కిలో 30,000

మేడ్చల్‌ 06 1,50,000

ఘట్‌కేసర్‌ 30 4,50,000

మొత్తం 56.53 11,00,000

Updated Date - 2021-10-28T04:47:28+05:30 IST