మెరైన్‌ ఇంజనీరింగ్‌ కోర్సు చేయాలనుకుంటున్నారా..? అయితే ఇది గమనించండి..!

ABN , First Publish Date - 2021-11-08T15:15:43+05:30 IST

మీకు ఆసక్తి ఉంటే..

మెరైన్‌ ఇంజనీరింగ్‌ కోర్సు చేయాలనుకుంటున్నారా..? అయితే ఇది గమనించండి..!

ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నా. మెరైన్‌ ఇంజనీరింగ్‌ కోర్సు చేయాలనుకుంటున్నాను. దీనిలోకి ఎలా వెళ్లాలి సలహా ఇవ్వగలరు? 

- వాజిద్‌, రంగారెడ్డి

మీకు ఆసక్తి ఉంటే నాలుగు సంవత్సరాల మెరైన్‌ ఇంజనీరింగ్‌ చేయవచ్చు. జెఇఇ లేదా ప్రత్యేకమైన ఎంట్రెన్స్‌ ద్వారా దీనిలోకి అడ్మిషన్‌ ఇస్తారు. ఆయా సంస్థల వెబ్‌సైట్‌లో చూస్తే మీకు వివరాలు లభిస్తాయి. మెరైన్‌ ఇంజనీరింగ్‌ కెరీర్‌ ఎంచుకోవాలనుకున్నవారు కఠినమైన జీవితానికి అలవర్చుకోవాలి. నెలల తరబడి సముద్ర ప్రయాణం ఉంటుంది. నౌకలోని ఇంజన్‌రూమ్‌లో గడపాల్సి ఉంటుంది. ప్రయాణ కాలంలో కిలోమీటర్ల కొద్ది నీళ్లు తప్ప ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేదే ఉండదు. మానవ సంబంధాలు తక్కువగా ఉంటాయి. అయితే డ్యూటీ దిగిన తరువాత నెలల తరబడి సెలవులు ఇస్తారు. వీరికి జీత భత్యాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. చెన్నైలోని ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ, అలాగే ఎమెట్‌ యూనివర్సిటీ, ముంబై-పుణె హైవేమీద ఉన్న గ్రేట్‌ ఈస్ట్రన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మారిటైమ్‌ స్టడీస్‌, మహారాష్ట్ర అకాడమి ఆఫ్‌ నేవల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌, మధురైలోని ఆర్‌ఎల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నాటికల్‌ సైన్స్‌ తదితరాల్లో మీరు ఈ కోర్సు చేయొచ్చు. 



ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌

మా అబ్బాయి ఇంజనీరింగ్‌ పూర్తిచేశాడు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌ తీసుకొమ్మని సలహా ఇస్తున్నాం. కానీ తను మాత్రం ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వైపే మొగ్గు చూపుతున్నాడు. సలహా ఇవ్వగలరు? 

- గణేష్‌, వైజాగ్‌

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ చాలా మంచి రంగం. అయితే ఇది కొద్ది కాలేజీల్లో మాత్రమే అందుబాటులో ఉంది. దీనితో పోలిస్తే ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఎక్కువ కాలేజీల్లో అందుబాటులో ఉంది. దీనిలో చేరిన వారికి మంచి ఫౌండేషన్‌తోపాటు, పీజీలో చాలా ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఏ కోర్సులో చేరినప్పటికీ మంచి కాలేజీలో చదివిన వారికి భవిష్యత్తు ఉంటుంది. ఎలక్ట్రానిక్స్‌ చేసినప్పటికీ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌పై ఆన్‌లైన్‌ కోర్సులను చేసి కొంత నాలెడ్జ్‌ సంపాదించుకోవచ్చు. అవకాశాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి.



ప్రొడక్ట్‌ డిజైన్‌ 

ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. మేథ్స్‌లో కొంత వీక్‌. నాకు ప్రొడక్ట్‌ డిజైన్‌ అంటే చాలా ఆసక్తి. దీనిలోకి వెళ్లాలి అనుకుంటున్నాను. ఈ కోర్సుకు సంబంధించిన వివరాలు ఇవ్వగలరు?

- నీలిమ, కర్నూలు

ప్రొడక్ట్‌ డిజైన్‌ పట్ల ఆసక్తి ఉంటే నీవు బి.డిజైన్‌ కోర్సు చేయొచ్చు. ఇంటర్‌ పూర్తి చేసినవారు ఎవరైనా దీని ఎంట్రెన్స్‌ రాయవచ్చు. ప్రత్యేకించి మేథ్స్‌ ఉండాల్సిన పనిలేదు. అయితే మేథ్స్‌ వచ్చిన వారికి కొంత అడ్వాంటేజ్‌ ఉంటుంది. ఇందులో చేరాలనుకునే వారికి డ్రాయింగ్‌ స్కిల్స్‌ తప్పనిసరి. డిజైనింగ్‌లో కూడా పలు రకాలు ఉంటాయి. ఫ్యాషన్‌ డిజైనింగ్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, యానిమేషన్‌, ఇంటీరియర్‌ అండ్‌ ఫర్నిచర్‌ డిజైన్‌, ఇండస్ట్రియల్‌ డిజైన్‌, జువెలరీ/యాక్సెసరీ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌, సిరామిక్‌ అండ్‌ గ్లాస్‌ డిజైన్‌, ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌/కమ్యూనికేషన్‌ డిజైన్‌, ఆటో డిజైన్‌ మొదలైనవి ఇందులో ప్రధానమైనవి.  వీటన్నింటినీ అన్ని కాలేజీలు అందించవు. ఒక్కో కాలేజీ ఒక్కో రకమైన డిజైనింగ్‌ను అందిస్తుంటాయి. ఆసక్తిని బట్టి కోర్సును ఎంచుకోవచ్చు.


ఇంజనీరింగ్‌ కోర్సులకు ఐఐటీల తరహాలో, డిజైనింగ్‌కు ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైనింగ్‌’ సంస్థలు ఉన్నాయి. డిజైనింగ్‌లో అడ్మిషన్స్‌ కోసం యూసీడ్‌(‘అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌’), సీడ్‌, ఎఫ్‌డిడిఐ, నిఫ్ట్‌ తదితర ఎంట్రెన్స్‌లు రాయాల్సి ఉంటుంది. యూసీడ్‌ పరీక్ష ప్రతీ సంవత్సరం జనవరిలో ఉంటుంది.

- గోవర్ధనం కిరణ్‌కుమార్‌

మీక్కూడా ఏదైనా సందేహం ఉంటే సంప్రదించండి:

చిరునామా: వివరాలు ఇవిగో, కేరాఫ్‌ ఎడ్యుకేషన్‌ డెస్క్‌, ఆంధ్రజ్యోతి, 

ప్లాట్‌ నెం.76, రోడ్‌ నెం.70, అశ్వినీ ఎన్‌క్లేవ్‌, హుడా హైట్స్‌,

జర్నలిస్ట్‌ కాలనీ, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌-500 033


Updated Date - 2021-11-08T15:15:43+05:30 IST