ట్రంప్‌పై ట్విటర్ చర్యలను తప్పుపట్టిన ఫేస్‌బుక్ సీఈవో... ఏకిపడేస్తున్న నెటిజన్లు..

ABN , First Publish Date - 2020-05-28T19:15:10+05:30 IST

ప్రయివేటు యాజమాన్యాల కింద నడుస్తున్న డిజిటల్ సంస్థలు నిజనిర్ధారణ చేయాల్సిన అవసరం లేదంటూ...

ట్రంప్‌పై ట్విటర్ చర్యలను తప్పుపట్టిన ఫేస్‌బుక్ సీఈవో... ఏకిపడేస్తున్న నెటిజన్లు..

వాషింగ్టన్: ప్రయివేటు యాజమాన్యాల కింద నడుస్తున్న డిజిటల్ సంస్థలు నిజనిర్ధారణ చేయాల్సిన అవసరం లేదంటూ ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్టులపై ట్విటర్ ఫ్యాక్ట్ చెక్ లేబుల్స్ వేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ‘‘ప్రజలు ఆన్‌లైన్‌లో చెప్పేవన్నీ నిజాలా, కాదా అని నిర్థారించే పని ఫేస్‌బుక్ చేయదని నేను బలంగా నమ్ముతాను. ప్రయివేటు సంస్థలు, ప్రత్యేకించి ఇలాంటి సోషల్ మీడియా సంస్థలు ఆ పనిచేయకూడదు..’’ అని జుకెర్ స్పష్టం చేశారు. అలాగే సోషల్ మీడియా సంస్థలను సమీపం నుంచి పరిశీలిస్తున్నామనీ.. సోషల్ మీడియాను సెన్సార్ చేస్తామని ట్రంప్ సర్కారు పేర్కొనడం కూడా ‘‘అసంకల్పిత ప్రతీకార చర్య’’ కాదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సోషల్ మీడియా వినియోగదారులకు జుకెర్ వ్యాఖ్యలు ఏమాత్రం రుచించలేదు.


వాస్తవానికి ‘‘ఆన్‌లైన్ సెన్సార్షిప్‌కి, హానికరమైన ఫ్యాక్ట్‌చెక్‌కు ఫేస్‌బుక్ పుట్టిల్లులాంటిదనీ’’.. అలాంటిది సోషల్ మీడియా ఫ్యాక్ట్ చెక్ చేయకూడదని జుకెర్ చెప్పడం ‘‘హాస్యాస్పద’’మని ఓ నెటిజన్ విమర్శించాడు. ‘‘మార్క్ జుకెర్‌బర్గ్ ఏమనుకుంటున్నారో మనకు అనవసరం.. మనం మాత్రం ప్రజాస్వామ్యంలోనే జీవించాలి..’’ అని మరో నెటిజన్ వ్యాఖ్యానించగా.. ‘‘ఫేస్‌బుక్‌లో ప్రజలను అబద్ధాలు చెప్పేందుకు అనుమతించడం మంచి లాభసాటి అని జుకెర్ బర్గ్ అనుకుంటున్నారు..’’ అంటూ మరొకరు వ్యంగ్యాస్త్రం సంధించారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ ఇటీవల షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మెయిల్-ఇన్ ఓటింగ్ విధానంపై ఆయన చేసిన రెండు ప్రకటనలు సత్యదూరమనీ.. అవి ‘‘తప్పుదోవ పట్టించేలా’’ ఉన్నాయంటూ ముద్ర వేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్లపై ట్విటర్ ‘ఫ్యాక్ట్ చెక్ లేబుల్’ వేయడం ఇదే తొలిసారి కావడంతో ఈ నిర్ణయం సంచలనం సృష్టించింది. 

Updated Date - 2020-05-28T19:15:10+05:30 IST