మరో నలుగురు..

ABN , First Publish Date - 2020-04-05T09:04:12+05:30 IST

కడప నగరంలో 2, బద్వేలు పట్టణంలో 2 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23కు చేరింది. ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ మత

మరో నలుగురు..

ఢిల్లీ కాంటాక్ట్స్‌ కడపలో ఇద్దరు, బద్వేలులో ఇద్దరు

23కు చేరిన కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు

అందరికీ మర్కజ్‌ లింకులే

రెడ్‌జోన్‌లో లాక్‌డౌన్‌ అమలు కఠినతరం

ఆ ప్రాంతాల్లో సోడియం హైడ్రోక్లోరైడ్‌ పిచికారి

144 సెక్షన్‌ ఉల్లంఘిస్తే కేసులు నమోదు


కడప, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):  కడప నగరంలో 2, బద్వేలు పట్టణంలో 2 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23కు చేరింది. ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో 17 మంది, వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. స్టేజ్‌ టు కేసులు నమోదు అవుతుండడంతో జిల్లా యంత్రాంగం, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


జిల్లాలో మార్చి 31వతేదీ వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ మత సంస్థ సభలకు జిల్లా నుంచి వెళ్లిన వారిలో అధికార యంత్రాంగం మొదట 34 మందిని గుర్తించింది. వారి శాంపిల్స్‌ తీసి తిరుపతి ల్యాబ్‌కు పంపగా, ఈ నెల 1వతేదీన 17 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారిగా జిల్లా అధికారులు ఉలిక్కిపడ్డారు. ఆయా ప్రాంతాల్లో కంటోన్మెంట్‌ (రెడ్‌జోన్‌), బఫర్‌ జోన్‌గా విభజించి లాక్‌డౌన్‌ పక్కా అమలుకు శ్రీకారం చుట్టారు.


ఢిల్లీ సభకు వెళ్లిన వారు, వారి కుటుంబ సభ్యులు, వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి కడప నగరంలోని ఫాతిమా మెడికల్‌ కళాశాలలోని ఐసోలేషన్‌, ప్రొద్దుటూరు ప్రభుత్వ వైద్యశాల ఐసోలేషన్‌కు తరలించారు. ప్రతిరోజూ జిల్లాలో పాజిటివ్‌ కేసులు వస్తుండడంతో అటు యంత్రాంగం, ఇటు ప్రజలు కలవరపడుతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారే కాకుండా.. వారి కుటుంబ సభ్యులు, వారితో సన్నిహితంగా ఉన్న వారికి కూడా పాజిటివ్‌ రావడంతో స్టేజ్‌ టు దశకు చేరుకున్నామని, లాక్‌డౌన్‌ మరింత కట్టుదిట్టం చేయక తప్పదని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు.


ఆ నలుగురు ఢిల్లీ రిటర్న్స్‌ బంధువులే

శనివారం 55 శాంపిల్స్‌ రిజల్ట్స్‌ వచ్చాయి. అందులో 51 నెగిటివ్‌ కాగా.. కడపలో ఇద్దరు, బద్వేలులో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆ నలుగురు కూడా ఢిల్లీ వెళ్లి వచ్చి పాజిటివ్‌ నిర్ధారణ అయిన బాధితుల బంధువులు, కుటుంబ సభ్యులే. ఇప్పటి వరకూ 23 పాజిటివ్‌ కేసులు రాగా, 17 మంది ఢిల్లీలోని మర్కజ్‌ మత సభకు వెళ్లి వచ్చిన వారు.


ఆరుగురు వారితో సన్నిహితంగా ఉన్నవారు కుటుంబసభ్యులే కావడం కొసమెరుపు. దీంతో వాళ్లతో కాంటాక్టు ఉన్న వారిని గుర్తించేందుకు సర్వే చేస్తున్నారు. బద్వేలులో 29 మందిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. రెడ్‌జోన్‌ పరిధిలో వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు వంటి లక్షణాలు ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నారు.


కోవిడ్‌-19 పాజిటివ్‌ ప్రాంతాల్లో ఇదీ పరిస్థితి

కడప నగరంలో ఇప్పటికే నాలుగు పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. వారి కుటుంబ సభ్యులు మరో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. లాక్‌డౌన్‌ పక్కాగా అమలు చేస్తున్నారు. రెడ్‌జోన్‌ ఏరియాలో ప్రతిరోజూ సోడియం హైడ్రోక్లోరైడ్‌ పిచికారి చేస్తున్నారు. బఫర్‌ జోన్‌ ప్రాంతాల్లో ఇప్పటికే ఒకసారి పిచికారి చేయగా, రెండో దఫా పిచికారికి సన్నాహాలు చేస్తున్నారు. 


ప్రొద్టుటూరు పట్టణంలో పది కేసులు నమోదు కాగా, 9 ఢిల్లీ మర్కజ్‌కు నేరుగా లింకు ఉంటే.. ఒకటి వారి కుటుంబ సభ్యులకు చెందిన కేసు. పట్టణం మొత్తం రెడ్‌జోన్‌గా గుర్తించారు. వీఽధివీధినా సోడియం హైడ్రోక్లోరైడ్‌ పిచికారి చేస్తున్నారు. మరో 53 శాంపిల్స్‌ రావాల్సి ఉంది. 70 మంది క్వారంటైన్‌లో ఉన్నారు.


బద్వేలు నగరంలో ఢిల్లీ మర్కజ్‌ నుంచి వచ్చిన ఒకరికి పాజిటివ్‌ రాగా కుటుంబ సభ్యులు తొమ్మిది మందిని కడప ఫాతిమా మెడికల్‌ కాలేజీకి తరలించి శాంపిల్స్‌ తీశారు. వారిలో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. పాజిటివ్‌ బాధితుడికి సన్నిహితంగా ఉన్న సమీప కుటుంబసభ్యులు మరో ఐదుగురిని కడపకు తరలించి శాంపిల్స్‌ తీశారు. పాజిటివ్‌ బాధితులు ఢిల్లీ నుంచి వచ్చాక వివిధ మత ప్రార్థనల్లో పాల్గొన్నట్లు గుర్తించి బద్వేలు పట్టణం గోపవరం మండలం రాచాయిపేట, పోరుమామిళ్ల మండలం గానుగపెంట గ్రామాలకు చెందిన 29 మందిని గుర్తించి బద్వేలు క్వారంటైన్‌కు త రలించారు.


పులివెందులలో ఇద్దరు, వేంపల్లెలో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఆ పట్టణాల్లో రెడ్‌జోన్‌ అమలు చేస్తున్నారు. 11గంటలకు నిబంధనలు ఉల్లంఘించి ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారనే విమర్శలున్నాయి.


కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల వివరాలు

నగరం 3వతేదీ 4వతేదీ మొత్తం

కడప 4 2 6

ప్రొద్దుటూరు 10 -- 10

పులివెందుల 2 -- 2

వేంపల్లె 2 -- 2

బద్వేలు 1 2 3

మొత్తం 19 4 23


జిల్లాలో కోవిడ్‌-19 వివరాలు

మొత్తం శాంపిల్స్‌ 328

రిజల్ట్స్‌ వచ్చినవి 285

నెగటివ్‌ 242

పాజిటివ్‌ 23

రిజల్ట్స్‌ పెండింగ్‌ 42

Updated Date - 2020-04-05T09:04:12+05:30 IST