Abn logo
Apr 8 2020 @ 03:26AM

మూడో దశలోకి!

విదేశాలు, ఢిల్లీ కనెక్షన్‌ లేకున్నా

గుంటూరులో ఒకరికి కరోనా

ఎవరి ద్వారా, ఎలా సోకిందో!

ఇప్పటికి అలాంటివి 8 కేసులు

రాష్ట్రంలో మరో 11 పాజిటివ్‌

గుంటూరులోనే 9 కేసులు

నెల్లూరు, కడపలో ఒక్కొక్కరు

మొత్తం బాధితుల సంఖ్య 314

మృతుల సంఖ్య నాలుగు

మూడో దశ ప్రారంభంలో ఉన్నాం

ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు

2 లక్షల పరీక్షలు చేయాల్సి ఉంది

ఇప్పటికి 280 కేసులకు ఢిల్లీ లింక్‌

ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ వెల్లడి


ఎనిమిది మందికి ఎలా?


విదేశాల్లో వైరస్‌ సోకించుకున్న వారు, మర్కజ్‌ నిజాముద్దీన్‌లో బాధితులుగా మారిన వారు... వారి ద్వారా వైరస్‌ సోకిన వారు! రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినవివే! కానీ... వీరెవరితో సంబంధం లేని, ఎవరి ద్వారా వైరస్‌ సోకిందో తెలియని కేసులూ మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. ఇప్పటికి ఇలాంటి సస్పెన్స్‌ కేసులు 8 దాకా లెక్కతేలాయి.


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) : గుంటూరుకు చెందిన ఒక డాక్యుమెంట్‌ రైటర్‌కు సోమవారం కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన విదేశాలకు వెళ్లలేదు. ఆయన కుటుంబ సభ్యులూ విదేశాల నుంచి రాలేదు. ఢిల్లీ కనెక్షనూ లేదు. అంటే... ఇంకెవరి ద్వారానో ఆయనకు వైరస్‌ సోకిందన్న మాట! ఇలాంటి కేసులు ఇప్పటికే విశాఖ జిల్లాలో నాలుగు, కర్నూలు, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో ఒకటి చొప్పున బయటపడ్డాయి. అంటే... మొత్తం 8 మందికి ‘ఎవరి ద్వారా’ అన్నది తెలియకుండానే వైరస్‌ సోకింది. అధికారులు వారి ‘కాంటాక్ట్‌’ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో... రాష్ట్రంలో కరోనావ్యాప్తి 3వ దశ ప్రారంభంలో ఉందని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి చెప్పడం గమనార్హం.


సోమవారం కొత్తగా 11 కరోనా కేసులు బయటపడగా.. అందులో గుంటూరు జిల్లాకు చెందిన వారే 9 మంది ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 314కు చేరింది. మార్చి 31నాటికి మొత్తం కేసులు 44 మాత్రమే కాగా.. ఏడు రోజుల వ్యవధిలోనే ఆరు రెట్లు పెరగడం గమనార్హం. గుంటూరు జిల్లాలో ఇప్పటికి 41 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జిల్లాలో మంగళవారం నమోదైన కేసుల్లో... 15రోజుల క్రితం విదేశాల నుంచి గుంటూరుకు వచ్చిన మహిళ ఉన్నారు. ఆమె కుటుంబ సభ్యులను అధికారులు క్వారంటైన్‌కు తరలించనున్నారు.


మర్కజ్‌ నిజాముద్దీన్‌కు వెళ్లి వచ్చిన వ్యక్తి కుమార్తె (16)కు కూడా వైరస్‌ సోకింది. మంగళవారం పాజిటివ్‌ వచ్చిన మరో ఐదుగురికి కూడా ‘ఢిల్లీ కనెక్షన్‌’ ఉన్నట్లు గుర్తించారు. ఇక... విదేశాలు, ఢిల్లీ ప్రయాణంతో సంబంధం లేని డాక్యుమెంట్‌ రైటర్‌కు, ఆయన ద్వారా ఒక స్నేహితుడికీ వైరస్‌ సోకినట్లు తేలింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోనూ మరొకరికి కరోనా సోకినట్లు నిర్ధారణయింది. ఇతనికి ఢిల్లీ కనెక్షన్‌ ఉన్నట్లు గుర్తించారు. దీంతో జిల్లాలో బాఽధితుల సంఖ్య 28కి చేరింది. నెల్లూరులోనూ ఒకరికి కరోనా వైరస్‌ సోకి  మొత్తం కేసుల సంఖ్య 43కు చేరింది. కర్నూలులో శుక్రవారం మరణించిన వ్యక్తికి కరోనా సోకినట్లు సోమవారం నిర్ధారించారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్‌ మృతుల సంఖ్య నాలుగుకు పెరిగింది.


మూడో దశ మొదలు... 

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి మూడో దశ ప్రారంభంలో ఉందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో కమ్యూనిటీ సర్వైలెన్స్‌ (సామాజిక నిఘా), వ్యాధి నిర్ధారణ పరీక్షల సామర్థ్యం పెంపు, భవిష్యత్‌ అవసరాల మేరకు ఆస్పత్రులను సిద్ధం చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన సుమారు 29 వేల మందిని, ఢిల్లీ మర్కజ్‌ సమావేశాలకు వెళ్లిన సుమారు వెయ్యి మందిని గుర్తించి.. వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాం.


304 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వాటిలో 280 కేసులు మర్కజ్‌తో ముడిపడినవే. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి ద్వారా వారి కుటుంబీకులకు, వారి ద్వారా బంధుమిత్రులకు వైరస్‌ వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించాం’’ అని తెలిపారు. వీరంతా కలిపి మొత్తం 3,500 మంది ఉన్నారని, వీరి శాంపిల్స్‌ తీసుకుని పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ఇంటింటి సర్వే ద్వారా మరో 5 వేల మందిని గుర్తించామని, వైద్యాధికారుల సూచనల మేరకు వారిలో 1,800 నుంచి 2,000 మందికి పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. 65 ఏళ్ల వయసు వారు, హైపర్‌ టెన్షన్‌, డయాలసిస్‌ వంటి వ్యాధులతో బాధపడుతూ హై రిస్క్‌ కేటగిరీలో ఉన్నవారిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామన్నారు. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించి ఆంక్షలు విధించామని, లాక్‌డౌన్‌ ఉన్నా లేకున్నా గుంటూరు, విజయవాడ నగరాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌స్పాట్‌లలో ఆంక్షలు కొనసాగుతాయన్నారు.


‘ప్రస్తుతం రోజుకు వెయ్యి శాంపిళ్లను పరీక్షించగలుగుతున్నాం. మొత్తంగా 2 లక్షల టెస్టులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే 3 లక్షల ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లకు ఆర్డర్లు ఇచ్చాం. ప్రతి జిల్లాకో కోవిడ్‌ ఆస్పత్రి ఏర్పాటు చేశాం. రాష్ట్రస్థాయిలో 4 కోవిడ్‌ ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో పనిచేసే వైద్యులు, నర్సులు, సిబ్బందిని అవసరం మేరకు నియమించాం’’ అని తెలిపారు. వారందరికీ 12 వేల పీపీఈలు, 20 వేల ఎన్‌95 మాస్కులు, 40 లక్షల గ్లౌజులు, 12 లక్షల సర్జికల్‌ మాస్కులు, ఇతర రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచామని వివరించారు.


Advertisement
Advertisement
Advertisement