ముహూర్తాల వేళాయె..ఇక మోగనున్న పెళ్లి బాజాలు

ABN , First Publish Date - 2021-10-08T07:11:13+05:30 IST

వివాహాది శుభ ముహూర్తాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. గురు వారం నుంచి ఆశ్వయుజమాసం ప్రారంభం కానుండడంతో వరుసగా మూడు నెలలపాటు పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు వంటి శుభ కార్యక్రమాల ఘడియలు ఆసన్నమయ్యాయి.

ముహూర్తాల వేళాయె..ఇక మోగనున్న పెళ్లి బాజాలు

  • భారీగా శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు
  • కళకళలాడనున్న వివిధ రకాల మార్కెట్లు
  • ప్రారంభమైన శుభ ముహూర్తాలు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

వివాహాది శుభ ముహూర్తాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. గురువారం నుంచి ఆశ్వయుజమాసం ప్రారంభం కానుండడంతో వరుసగా మూడు నెలలపాటు పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు వంటి శుభ కార్యక్రమాల ఘడియలు ఆసన్నమయ్యాయి. భాద్రపదమాసంలో ముహూర్తాలు లేకపోవడంతో నెల రోజులపాటు ఎలాంటి శుభకార్యాలు జరగలేదు. మళ్లీ ఇప్పుడు దసరా ఉత్సవాల అంకురార్పణతో ప్రారంభ మయ్యే ఆశ్వయుజమాసం ప్రారంభం నుంచి పెళ్లి బాజాలు మోగనున్నాయి. కార్తీకమాసం శంకుస్థాపనలకు సర్వశ్రేష్ఠమని పంచాంగకర్తలు చెబుతున్నారు. దేవీ నవరాత్రులు, దీపావళి, కార్తీక మాసాలలో నిర్వ హించే వేడుకలతోపాటు పెళ్లిళ్లు, ఇతరశుభకార్యక్రమాలకు ముహూ ర్తాలు అధికంగా ఉండడంతో మార్కెట్లు సైతం కళకళలాడనున్నాయి. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంతోపాటు థర్డ్‌వేవ్‌ వస్తుందన్న ఆరోగ్య నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పెళ్లిళ్లకు వేల జంటలు సిద్ధమవుతున్నాయి. ఆశ్వయుజమాసం ప్రారంభం నుంచి మూడు నెలలపాటు మంచి ముహూర్తాలు ఉన్నట్టు బండారులంకకు చెందిన ప్రముఖ వాస్తు, జ్యోతిష పండితుడు కాలెపు భీమేశ్వరరావు సిద్ధాంతి వెల్లడించారు. వరుసగా మూడు నెలల పాటు వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనల ముహూర్తాలు భారీగా జరగనుండడం తో వస్త్ర వ్యాపారాలు, బంగారు ఆభరణాల వ్యాపారంతోపాటు కల్యాణ మండపాలు, టెంట్‌హౌస్‌లు, కిరాణా, డెకరేషన్స్‌ వంటి అనేక రకాల వ్యాపారులకు గిరాకీ ఏర్పడనుంది. గురువారం నుంచి ఆశ్వయుజ మాసం ప్రారంభం కావడంతో మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ నెల 7 నుంచి డిసెంబరు 29వ తేదీ వరకు అంటే కార్తీక, మార్గశిర మాసాల్లో వివాహాది శుభ ముహూర్తాలు అధికంగా ఉన్నాయి.


ముహూర్తాలు ఇలా..

ఈనెల 9నుంచి నవంబరు 4 వరకు ఆశ్వయుజమాసంలో.. అక్టోబరులో వివాహ ముహూర్తాలు నిర్ణయించిన తేదీలు : 9, 10, 13, 14, 15, 16, 20, 23, 24, 30, 31. గృహప్రవేశ ముహూర్తాలు : 7, 9, 10, 13, 14, 15, 16, 23, 24, 25, 28.

నవంబరు 5 నుంచి డిసెంబరు 4 వరకు కార్తీకమాసంలో..

వివాహ ముహూర్త తేదీలు : నవంబరు 6, 7, 10, 11, 12, 13, 14, 17, 20, 21, 26, 28. శంకుస్థాపనలు : 6, 10, 11, 13, 15, 17, 20, 21, 24, 29 తేదీలు. గృహప్రవేశ ముహూర్తాలు : 6, 10, 11, 12, 13, 14, 15, 20, 21, 24, 28, 29. 

డిసెంబరు 5 నుంచి జనవరి 2 వరకు మార్గశిరమాసంలో..

వివాహ ముహూర్త తేదీలు : డిసెంబరు 5, 8, 9, 10, 11, 12, 17, 18, 19, 24, 26, 29. గృహప్రవేశ ముహూర్తాలు : 8, 9, 10, 11, 12, 13, 17, 18, 19, 21, 22, 26, 28.

Updated Date - 2021-10-08T07:11:13+05:30 IST