పెళ్లి తంతు మమ!

ABN , First Publish Date - 2021-08-22T04:57:47+05:30 IST

అరె భలే చేశాడ్రా..

పెళ్లి తంతు మమ!

కరోనా సమయంలో తగ్గిన ఆర్భాటాలు

ప్రభుత్వ నిబంధనలు ఓ వైపు.. వైరస్‌ భయం మరో వైపు

ఖర్చు తగ్గిందనుకుంటున్న మధ్య, దిగువ తరగతివారు..

అతి కొద్దిమందితోనే పెళ్లిళ్లు పూర్తి

ఆహ్వానం అందుకున్నా వెళ్లేవారూ తక్కువే..

వైభవంగా జరిపించాలనుకునేవారికి నిరాశే..

ఇతర కార్యక్రమాలు అదే బాటలో..

ఎన్నో రంగాలపై తీవ్ర ప్రభావం


పెళ్లంటే ఆకాశమంత పందిరి.. బంధువుల సందడి.. తప్పెట్లు, మేళాల హోరు.. అడుగు కదిలితే ఫొటోలు.. అదిరిపోయే అలంకరణలు.. ఏడడుగులు నడిచి.. మూడు ముళ్లు వేసే సందర్భాన్ని పదిలం చేసుకునే ఈ పండుగ.. ఆర్భాటం అంతా ఇంతా కాదు.. రెండేళ్ల కిందటి వరకు ఈ పరిస్థితే కనిపించేది. జీవితంలో ఒక్కసారే కదా.. అనే భావన ఖర్చుకు వెనుకాడనీయకుండా చేసేది.. సంఘంలో తమ స్టేటస్‌ను ప్రదర్శించే వారూ పెళ్లి తంతును అంగరంగ వైభవంగా జరిపించేవారు. కానీ కరోనా అనే మహమ్మారి దీనిని మార్చివేసింది. మనుషులను దూరంగా నిలబెట్టిన ఈ పరిస్థితి వివాహ వేడుకలనూ దూరం చేసింది. 


గుంటూరుకు చెందిన ఓ పెద్దాయన తమ పిల్లల పెళ్లి ఖర్చు ఎలా చేయాలా అనుకుంటున్న సమయంలో కరోనా నిబంధనలు వచ్చాయి. దీంతో దగ్గరివారిని పిలిచి పెళ్లి కార్యక్రమం పూర్తి చేశాడు. ఖర్చు తగ్గింది కదా అని లోలోన సంతోషించాడు కూడా....! ఇంకొకరు పెళ్లి గ్రాండ్‌గా చేసి తమ తాహతును ప్రదర్శించాలనుకున్నారు. కానీ.. కరోనా కారణంగా పరిస్థితులు అనుకూలించక ఆ తంతును మమ అనిపించేశారు.


అమెరికాలో ఈ మధ్య కాలంలో ఓ పెళ్లి జరిగింది. ఇద్దరి మనసులు కలిశాయి.. తల్లిదండ్రులు ఒప్పుకొన్నారు.. ముహూర్తం కూడా కుదిరింది.. కానీ అక్కడి వారు ఇక్కడకు రావడం.. ఇక్కడివారు అక్కడికి వెళ్లడం కుదరలేదు. దీంతో మేం పెళ్లి చేసుకుంటాం.. మీరంతా ఆన్‌లైన్‌లో చూసేయండి అంటూ వధూవరులు చెప్పేశారు. తల్లిదండ్రులు ఈ జూమ్‌ పెళ్లి లింకును బంధువులందరికీ షేర్‌ చేశారు. 


గుంటూరు: అరె భలే చేశాడ్రా.. పెళ్లికి వచ్చిన వారు చెప్పుకొనే ఈ మాటలు విని అలా ఘనంగా జరిపించిన వారి మనసులు ఉప్పొంగేవి.. జీవితంలో ఒకసారే జరిగే పెళ్లి తంతును ఆర్భాటంగా చేయాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఉన్నంతలో గొప్పగా జరిపించాలనుకుంటారు. లగ్నాల దగ్గరి నుంచి పెళ్లి కార్యక్రమం ముగిసేవరకు వెనుకాడకుండా ఖర్చు పెట్టే వారు ఎందరో. మరీ స్థితిమంతులైతే ప్రీ వెడ్డింగ్‌ షూటింగ్‌ వంటి వాటితో తమ జ్ఞాపకాలను పదిలం చేసుకునేవారు. ఇప్పుడు కరోనా మహమ్మారి ఇదంతా మార్చివేసింది. పెళ్లి తంతును మమ అనిపించేలా చేసింది. మధ్య తరగతి వారికి ఈ పరిణామాలు కొంత ఊరట కల్పిస్తుండగా.. పెళ్లిళ్లపై ఆధారపడిన రంగాలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయాయి.


పెళ్లంటే సందడే..

తెలుగు లోగిళ్లలో పెళ్లంటే నిజంగా సందడే.. ఎవరి తాహతుకు వారు పెళ్లి కార్యక్రమాన్ని జరిపించుకోవడం సహజం. చాలామంది అప్పు చేసైనా వివాహ వేడుకలు గ్రాండ్‌గానే పూర్తి చేస్తారు. జీవితంలో ఒక్కసారే కదా అనే భావనే ఇందుకు కారణం. ఇందుకోసం రూ.కోటి నుంచి రూ.10 కోట్లవరకు ఖర్చు పెట్టేవారుకూడా ఉన్నారు. భారీ ఊరేగింపులు, తిన్నా తినకపోయినా విస్తరి నిండా పదార్ధాలు, ఏసీ కల్యాణ మండపాలు ఇవన్నీ పెళ్లిలో భాగమయ్యాయి. సంఘంలో పరువు కోసం.. నలుగురిలో గౌరవం కోసం ఆ స్థాయిలో చెయ్యాలని అంతా ఫిక్స్‌ అయ్యేవారు. ఏది తక్కువైనా నలుగురు ఏమనుకుంటారనే భావన కూడా ఇందుకు కారణం. ఈ క్రమంలో ఈవెంట్‌ నిర్వాహకులు కూడా ఇందులోకి వచ్చేశారు. డబ్బుంటే చాలు.. అన్నీ వారే సమ కూరుస్తారు.. అమ్మాయి.. అబ్బాయి పెళ్లి పీటల మీదకు వస్తే చాలు.. మిగతాదంతా వారే చూసుకుంటారు.


ఇప్పుడు మారిన పరిస్థితి..

రెండేళ్లుగా ఈ పెళ్లి తంతు మారిపోయింది. పేదా ధనిక అనే బేదం లేకుండా.. కరోనా చుట్టేసింది. ముహూర్తాలున్నా.. పెళ్లికి 50 మందికి మించి హాజరు కాకూడదనే ప్రభుత్వ నిబంధనల ప్రభావం కూడా కనిపిస్తోంది. ఈ శ్రావణమాసంలో ముహూర్తాలు ఎక్కువగానే ఉన్నాయి. చకచకా పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. కానీ.. ఎక్కడా మునుపటి ఛాయలు కనిపించడం లేదు. అంతా తూతూమంత్రంగా జరిగిపోతోంది. ఆడంబరాలు ఉండడం లేదు.. దగ్గరి వారినే పెళ్లికి పిలుస్తున్నారు. కొంతరైతే తమని పిలవకపోయినా ఏం అనుకోవడం లేదు. పిలిస్తే ఈ కరోనా టైంలో ఎక్కడ వెళ్లాల్సి వస్తుందోననే భయం.. ఒకవేళ వెళ్లినా సాయంత్రం సమయంలో అలా వెళ్లి కనిపించి ఇలా వచ్చేస్తున్నారు. 


ఆన్‌లైన్‌లోనే అన్నీ..

కరోనా సమయంలో శుభ కార్యాలకు ఆన్‌లైన్‌ వేదికగా మారింది. శుభలేఖలు ఆన్‌లైన్‌లోనే పంపిస్తున్నారు. లేదంటే ఫోన్‌లో చెబుతున్నారు. మరికొందరు యూట్యూబ్‌ లింక్‌, జూమ్‌ ద్వారా పెళ్లిని ఇంటివద్ద నుంచే చూస్తున్నారు. ఇది ఒక పరిణామం కాగా.. దూరప్రాంతంలో ఉండేవారికి కొంత వెసులుబాటుగా ఉంది. అమెరికాలో పెళ్లి జరిగితే.. ఇక్కడి నుంచి చూసి తలంబ్రాలు వేస్తున్నారు. 


ఉపాధిపై తీవ్ర ప్రభావం..

కరోనా సమయంలో పెళ్లి వంటి శుభకార్యాలు మమ అనిపిస్తుండడం.. దానిపై ఆధారపడిన ఎన్నో రంగాలపై ప్రభావం చూపిస్తోంది. ఈవెంట్‌ నిర్వాహకులు, క్యాటరింగ్‌, ట్రావెల్స్‌, అలంకరణ, మేళాలు, ఫొటోగ్రాఫర్లు, శుభలేఖలు ప్రింట్‌ చేసేవారు.. ఇలా ఒకటేమిటి చాలా రకాల ఉపాధిపై దారుణ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మంచి లగ్నాలు ఉండే సమయంలో కరోనా మొదటి, రెండవ దశ వచ్చింది. పెళ్లి చేసుకునే వారు సైతం ఖర్చు తగ్గించుకోవడం వారి ఉపాధి అవకా శాలను దెబ్బతీసింది. 


కొందరికి నిరాశే..  మరికొందరికి ఆనందమే..!

ఈ పరిస్థితి ఆర్థికంగా స్థితిమంతులై పెళ్ళి గ్రాండ్‌ జరిపించాలనుకునేవారికి కొంత నిరాశజనకంగా ఉంది. పెళ్లిలో తమ హోదా చూపించుకోవాలని చాలామంది భావిస్తుంటారు. నగలు, భోజనం, అలంకరణ.. వీటిలో పోటీ పడుతుంటారు. వారందరికీ ఈ పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉంది. కానీ మధ్య, దిగువ తరగతి వారు మాత్రం లోలోపల సంతోషిస్తున్నారు. పెళ్లి ఖర్చు తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. పైగా ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులను బట్టి ఆర్భాటం చేయాల్సిన పనిలేదు. భారీ ఊరేగింపుల ఖర్చూ ఉండదు. ప్రతిదానిలో వంకలు పెట్టేవారు కూడా ఉండరు. పెళ్లి చేసు కుని పిల్లలు బాగుంటే చాలని వీరంతా అనుకుంటున్నారు. 


పెళ్ళిళ్లే కాదు..

ఒక్క పెళ్లిళ్లే కాదు.. మిగిలిన శుభ, అశుభ కార్యాలు నిర్వహించే సందర్భంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఇంట్లో ఎవరైనా మృతి చెందితే కర్మకాండలకు భారీగా ఖర్చు చేసేవారు. వెయ్యి నుంచి రెండు వేల మందికి భోజనం పెట్టేవారు ఉన్నారు. అనంతరం తమ తాహతుకు తగ్గట్టు వచ్చిన వారికి వస్తువులు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరోనా భయంతో పాటు ప్రభుత్వ నిబంధనలు కూడా ఉన్నాయి. బంధువులు చనిపోతే ఫోన్‌ పరామర్శలతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇవనే కాదు.. గృహప్రవేశాలు.. ఓణీలు, పంచెల కార్యక్రమం.. పుట్టినరోజు వేడుకలు ఇవన్నీ అత్యంత సమీప బంధువులను మాత్రమే పిలుచుకుంటున్నారు. 


దూరమవుతున్న అనుబంధాలు..

పెళ్లి లేదా ఏదైనా శుభకార్యాల్లో బంధువులంతా ఎక్కడున్నా వచ్చి కలుసుకోవడం ఆనవాయితీ. ఎటువంటి పనులున్నా ఇటువంటి సందర్భంలో కలుస్తుంటారు. కానీ ఇప్పుడు కరోనా కారణంగా దూరం నుంచి రావడం భారంగా భావిస్తున్నారు. కుటుంబ సమేతంగా వెళ్లేవారు కూడా ఎవరో ఒకరు వెళ్లి అలా కనిపించి వస్తున్నారు. దీంతో మనుషుల మధ్య అనుబంధాలు కూడా కరువవుతున్నాయి. పిల్లలకు తమ మూలాలు దూరం అవుతున్నాయి. సొంత వాళ్లనే వీరు మీ పెదనాన్న, బాబాయి అనే పరిచయం చేసే రోజులు కూడా ఎంతో కాలం లేవు..! 

Updated Date - 2021-08-22T04:57:47+05:30 IST