నాణ్యతకు మంగళం

ABN , First Publish Date - 2021-01-13T05:40:06+05:30 IST

అల్లాదుర్గం, జనవరి 12 : మురుగుకాలువలు, సీసీరోడ్ల నిర్మాణంలో 50కిలోల సిమెంట్‌కు 8గంపల కంకర, 3గంపల ఇసుక, 2 గంపల రాతిపొడి కలిపాలి ఇది నిబంధన కానీ కాంట్రాక్టర్లు అసలు ఇసుకనే వాడడం లేదు సిమెంట్‌ను తక్కువ చేసి రాతిపొడిని ఎక్కువగా కలుపుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు!

నాణ్యతకు మంగళం
మురుగుకాలువల నిర్మాణానికి వినియోగిస్తున్న డస్టు(ఇసుక పొడి) ఇదే

ఇసుక లేదని రాతిపొడి వినియోగం

నిబంధనలకు విరుద్ధంగా సీసీరోడ్డు, మురుగు కాలువ నిర్మాణం

నిర్లక్ష్యంగా పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు

 చర్యలు తీసుకోని అధికారులు


 అల్లాదుర్గం, జనవరి 12 :   మురుగుకాలువలు, సీసీరోడ్ల నిర్మాణంలో 50కిలోల సిమెంట్‌కు 8గంపల కంకర, 3గంపల ఇసుక,  2 గంపల రాతిపొడి కలిపాలి ఇది నిబంధన కానీ కాంట్రాక్టర్లు అసలు ఇసుకనే వాడడం లేదు సిమెంట్‌ను తక్కువ చేసి రాతిపొడిని ఎక్కువగా కలుపుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు!

మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం మాందాపూర్‌లో రెండు నెలల క్రితం గ్రామపంచాయతీ నిధులతో చేపడుతున్న మురుగుకాలువల నిర్మాణంలో సదరు కాంట్రాక్టర్‌  ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్టోన్‌డస్ట్‌ (రాతిపొడి) తో చేపట్టడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. సంబంధిత అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. మరోకాలనీలో చేపడుతున్న మురుగుకాలువల నిర్మాణంలోనూ ఇసుక వాడకుండా పూర్తిగా స్టోన్‌డస్ట్‌తో పనులు చేపట్టారు. ఇలా నాణ్యతకు తిలోదకాలిస్తూ పనులు చేపట్టడం ఈ ఒక్క మండలానికే పరిమితం కాలేదు. దాదాపు మెదక్‌ జిల్లాలో అభివృద్ధి పనుల పేరుతో కొందరు గుత్తేదార్లు ఇసుక కొరత సాకుతో స్టోన్‌డస్ట్‌తో నిర్మాణాలు చేపడుతూ సొమ్ముచేసుకుంటున్నారు. మురుగుకాలువ నిర్మాణ పనులకే కాకుండా గ్రామంలో ఇటీవల చేపట్టిన సీసీ రోడ్లు సైతం సైతం స్టోన్‌డస్ట్‌తో నిర్మించారని ప్రజలు చెబుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, గుత్తేదార్లు అందించే కమీషన్లకు కక్కుర్తి పడి పనులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు మురుగు కాలువలు, సీసీ రోడ్లలోనే స్టోన్‌డస్ట్‌ వాడారా? లేక ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాల్లోనూ అవినీతికి పాల్పడుతున్నారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మురుగుకాలువలు, సీసీరోడ్లు నాసిరకంగా నిర్మిస్తే కొన్నాళ్లు అవి పగిలిపోవడమో లేదా వర్షానికి కొట్టుకుపోతాయి. అదే ప్రభుత్వ భవనాల నిర్మాణంలోనూ స్టోన్‌డస్ట్‌ వినియోగిస్తే కొంత కాలానికే భవనానికి పగుళ్లు ఏర్పడతాయి. ఇలా అయితే ఎన్నో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాలు, సీసీరోడ్లు, మురుగుకాలువలు మూణ్నాళ్ల ముచ్చటగా మారే ప్రమాదముందని మెదక్‌ జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాసిరకంగా చేపడుతున్న పనులపై సంబంధిత అధికారులు విచారణ జరపాలని నాణ్యతతో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

 నాణ్యత పాటించకుంటే చర్యలు  : ఏఈ మొగులయ్య

అభివృద్ధి పనులకు ఇసుక కొరత ఉండటంతో 3:2 ప్రకారం ఇసుక, స్టోన్‌ డస్ట్‌ను నియోగించాలి. మాందాపూర్‌లో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో మొత్తం స్టోన్‌డస్టే వాడినట్లు ఫిర్యాదులు అందాయి. తాజాగా చేపట్టిన మురుగు కాల్వల నిర్మాణం పనులు సైతం అదే తరహాలో నాసిరకంగా చేపట్టడంపై విచారించి చర్యలు తీసుకున్నారు.


Updated Date - 2021-01-13T05:40:06+05:30 IST