Apr 16 2021 @ 14:46PM

మారుతి గట్టిగానే ఇస్తాడట..!

టాలీవుడ్‌లో మారుతి సినిమాలకి మంచి క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఏమాత్రం తొందరపడకుండా సినిమా తర్వాత సినిమా చాలా సెటిల్డ్‌గా చేసుకుంటూ వస్తున్నాడు. మారుతి గత కొంతకాలంగా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ తీస్తూ ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటున్నాడు. ఈయన గత చిత్రం 'ప్రతిరోజూ పండగే' బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. కాగా ప్రస్తుతం యాక్షన్ హీరో గోపీచంద్‌తో 'పక్కా కమర్షియల్' సినిమాని తెరకెక్కిస్తున్నాడు మారుతి. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే కోర్ట్ సన్నివేశం తెరకెక్కిస్తున్నట్టుగా మారుతి - హీరోయిన్ రాశీఖన్నా పిక్ కూడా బయటికి వదిలారు. అయితే ప్రస్తుతం గోపీచంద్ 'పక్కా కమర్షియల్' సినిమా మీద బాగా నమ్మకాలు పెట్టుకున్నాడట. 

ఇప్పటికే సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన 'సీటీమార్' సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. తమన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కింది. గోపీచంద్‌కి హిట్ వచ్చి చాలా కాలం అవుతోంది. 'సీటీమార్' సినిమాతో మళ్ళీ సక్సస్ ట్రాక్ ఎక్కుతాడన్న నమ్మకంగా ఉన్న గోపీచంద్ మరూతి సినిమా 'పక్కా కమర్షియల్‌'తో తన ఫాంని కంటిన్యూ చేయనున్నట్టు చాలా ధీమాగా ఉన్నాడట. ఇక మారుతి కూడా ఈసారి గోపీచంద్‌తో తీసే 'పక్కా కమర్షియల్' సినిమాతో గట్టిగానే హిట్ కొట్టబోతున్నట్టు చెప్పుకుంటున్నారు. మొత్తానికి 'సీటీమార్', 'పక్కా కమర్షియల్' సినిమాలతో మళ్ళీ గోపీచంద్ సక్సస్ ట్రాక్ ఎక్కబోతునట్టు తెలుస్తోంది.