Mary Kom కన్నీళ్లు.. జడ్జీల తప్పిదం వల్లే ఓడిందా?

ABN , First Publish Date - 2021-07-30T02:49:42+05:30 IST

ఒలింపిక్స్‌లో రెండోసారి పతకం సాధించాలన్న భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ ఆశలు నేడు అడియాసలయ్యాయి

Mary Kom కన్నీళ్లు.. జడ్జీల తప్పిదం వల్లే ఓడిందా?

టోక్యో: ఒలింపిక్స్‌లో రెండోసారి పతకం సాధించాలన్న భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ ఆశలు నేడు అడియాసలయ్యాయి. కొలంబియాకు చెందిన ఇంగ్రిట్ వాలెన్షియాతో జరిగిన మహిళల ఫైవెయిట్ ప్రీ క్వార్టర్స్‌ ఫైనల్స్‌లో మేరీ కోమ్ ఓటమి పాలైంది. ఓటమి అనంతరం కన్నీళ్లు పెట్టుకున్న మేరీ కోమ్ జడ్జీలపై తీవ్ర విమర్శలు చేసింది. ఇంగ్రిట్‌కు అనుకూలంగా జడ్జీలు బౌట్‌లు ఇచ్చేశారని ఆరోపించింది. నిజానికి మేరీకోమ్‌పై చేసిన మూడు అటెంప్ట్స్‌లో ఇంగ్రిట్‌కు అదే తొలి విజయం కావడం గమనార్హం. వాలెన్షియాకు అనుకూలంగా ఐదుగురు జడ్జీలు 49 పాయింట్లు ఇవ్వగా, మేరీకోమ్‌కు మాత్రం 46 పాయింట్లు మాత్రమే కేటాయించారు. ఫలితంగా 4-1తో వాలెన్షియా విజయం సాధించింది.


విజేతను ప్రకటించడానికి ముందే మేరీకోమ్ చేతిని పైకెత్తింది. అయితే, అప్పటికే ఇంగ్రిట్‌ను విజేతగా ప్రకటించేశారు. దీంతో మేరీకోమ్ ఒక్కసారిగా విస్తుపోయింది. రింగ్‌లోనే మేరీ కన్నీళ్లు పెట్టుకుంది. అయినప్పటికీ చిరునవ్వుతో ఓటమిని అంగీకరించింది. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. జడ్జీల తప్పిదం వల్లే తాను మ్యాచ్‌ను ఓడినట్టు పేర్కొంది. ఇది దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసింది. 40 ఏళ్లు వచ్చే వరకు ఆడతానని స్పష్టం చేసింది. తానేం తప్పు చేశానో అర్థం కావడం లేదని, తాను ఓడిపోయానన్న విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.  

Updated Date - 2021-07-30T02:49:42+05:30 IST