మసాబా మార్క్‌ జ్యూస్‌!

ABN , First Publish Date - 2020-07-27T08:45:56+05:30 IST

కాకరకాయ అనగానే ముఖం చేదుగా పెడతారు కానీ దాంతో ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు.

మసాబా మార్క్‌ జ్యూస్‌!

కాకరకాయ అనగానే ముఖం చేదుగా పెడతారు కానీ దాంతో ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు. దానికి కాస్త కీరదోసను కూడా కలిపి జ్యూస్‌లా తీసుకుంటే రోగనిరోధకశక్తిని పెంచుతుందంటున్నారు ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తా. ఆరోగ్యకరమైన కాకరకాయ, దోసకాయ జ్యూస్‌ తయారీ, ఉపయోగాలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.


కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ‘ఇమ్యూనిటీ’ పెంచుకోవాలని అందరూ చెబుతున్నారు. అలాంటి ఒక జ్యూస్‌ ఇది. దీన్ని ఎలా చేయాలంటే... కాకరకాయ, కీరదోసలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి, జార్‌లో వేసి, గ్లాసు నీళ్లు పోయాలి. అందులో ఒక నిమ్మకాయ కూడా వేసి మిక్సీలో గ్రైండ్‌ చేయాలి. ఆ తర్వాత జ్యూస్‌ను వడపోసి తాగాలి.  


ప్రయోజనాలివే...

కాకరకాయ, కీరదోసకాయ జ్యూస్‌తో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాకర రసం రక్తపోటును తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సరిపడా ఉంచుతుంది. మెదడు, కణజాలం ఆరోగ్యాన్ని కాపాడుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. కాకరలో ఉండే ప్రొ విటమిన్‌ను శరీరం ఏ విటమిన్‌గా మారుస్తుంది. ఇది కంటి చూపు, చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది. కీరదోసలో కూడా విటమిన్‌ సి అధికంగా ఉంటుంది.


ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. శరీరంలో మోతాదుకు మించి ఉన్న నీటిని, విషపదార్థాలను కీరదోస తొలగిస్తుంది. చర్మం, జుట్టు పోషణకు ఉపయోగపడుతుంది. కీరదోసకాయలో పీచు, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండడం వల్ల రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది. అంతేకాదు పొట్టలో వేడిని విడుదల చేయడం ద్వారా నోటి దుర్వాసనకు కారణమయ్యే చెడు బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది.

Updated Date - 2020-07-27T08:45:56+05:30 IST