ఘనంగా ‘మాసి మఖం’ వేడుకలు

ABN , First Publish Date - 2022-02-17T13:47:04+05:30 IST

మాసి మఖం ఉత్సవాలను బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సముద్రతీర ప్రాంతాల్లో వైభవంగా జరుపుకొన్నారు. చెంగల్పట్టు జిల్లా మహాబలిపురంలో ఉన్న తలశయన పెరుమాళ్‌ ఆలయం 108 వైష్ణవ క్షేత్రాల్లో 63వ క్షేత్రంగా విలసిల్లుతోంది.

ఘనంగా ‘మాసి మఖం’ వేడుకలు

                            - సముద్రతీర ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు


పెరంబూర్‌(చెన్నై): మాసి మఖం ఉత్సవాలను బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సముద్రతీర ప్రాంతాల్లో వైభవంగా జరుపుకొన్నారు. చెంగల్పట్టు జిల్లా మహాబలిపురంలో ఉన్న తలశయన పెరుమాళ్‌ ఆలయం 108 వైష్ణవ క్షేత్రాల్లో 63వ క్షేత్రంగా విలసిల్లుతోంది. మాసి మఖ నక్షత్రం పురస్కరించుకొని మహాబలిపురం బీచ్‌ రోడ్డులో ఉన్న పుండరీక పుష్కరిణి ఆలయానికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు ప్రత్యేక అలంకరణలో పల్లకీలో వేంచేసి భక్తులను కటాక్షించారు. అనంతరం బుధవారం ఉదయం తలశయన పెరుమాళ్‌, వరాహ పెరుమాళ్‌ ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై సముద్రతీరంలో ఊరేగించారు. వేద పండితులు తీరంలో చక్రతాళ్వారుకు సంప్రదాయబద్ధంగా తీర్థవారి నిర్వహించారు. వేలాది మంది భక్తులు సముద్రంలో స్నానమాచరించి స్వామివారిని సేవించారు.


గిరిజనుల సంప్రదాయ పూజ

మాసి మఖంను పురస్కరించుకొని గిరిజనులు తమ కులదేవత కన్నియమ్మన్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాబలిపురం సముద్రతీరంలో గుడారాలు వేసుకొని సోమవారం రాత్రి నుంచి సంప్రదాయ నృత్యాలు, గ్రామీణ పాటలు పాడి సందడి చేశారు. సంవత్సరానికి ఒక్కసారి మాసి మఖం రోజున రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు మహాబలిపురానికి వచ్చి మూడు రోజులు మకాం వేస్తారు. వారు తమ కులదేవతను భక్తిశ్రద్ధలతో పూజించి, పెళ్లీడుకొచ్చిన పిల్లలకు నిశ్చితార్థం, వివాహాది శుభకార్యాలయాలు నిర్వహిస్తారు. తమ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన కొబ్బరి మట్టలతో చిన్న చిన్న గుడారాలు నిర్మించుకొని అక్కడే వంటా వార్పు చేసుకుంటారు.

Updated Date - 2022-02-17T13:47:04+05:30 IST