May 7 2021 @ 00:15AM

మాస్క్‌, వ్యాక్సిన్‌లే మన ఆయుధాలు

వినూత్నంగా దేశప్రజలకు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం కొవిడ్‌ సందేశం 


దేశంలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తోంది. ఈ గడ్డు పరిస్థితుల్లో కొవిడ్‌పై పోరాటంలో భాగంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు పలువురు సినీ ప్రముఖులు తమవంతుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ కోవలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం చేరింది. ఈ చిత్రంలోని నటీనటులు రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, అజయ్‌ దేవగణ్‌, అలియాభట్‌తో కలసి దర్శకుడు రాజమౌళి చిన్న వీడియో రూపంలో వినూత్నంగా కొవిడ్‌ సందేశాన్ని ఇచ్చారు. ఏకకాలంలో దేశ ప్రజలందరికీ చేరేలా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కొవిడ్‌ సందేశాన్ని అందించారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులను వివరిస్తూ, ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించి, కలసి కట్టుగా ధైర్యంగా నిలబడి కరోనాను ఎదుర్కోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవటం ద్వారా మన కుటుంబ సభ్యులు, స్నేహితులు, దేశాన్ని కాపాడుకోవాలని సందేశంలో పేర్కొన్నారు. 


‘‘కొవిడ్‌ పై పోరాటంలో మాస్క్‌, శానిటైజర్‌లే మన ఆయుధాలు. బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా సామాజిక దూరం పాటించండి’’ అని జూనియర్‌ ఎన్టీఆర్‌ కోరారు. ‘‘గతేడాది పరిస్థితులు మళ్లీ పునరావృతమవుతున్నాయి. మళ్లీ మనందరం కలసికట్టుగా కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాను ఎదుర్కోండి’’ అని రామ్‌చరణ్‌ స్పందించారు. ‘‘వ్యాక్సిన్‌పై అపోహలను తొలగించుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను వ్యాక్సిన్‌ తీసుకునేలా ప్రోత్సహించండి. వ్యాక్సిన్‌ తీసుకుంటామని ప్రతి ఒక్కరూ ప్రతిన పూనండి’’ అని అజయ్‌ దేవగణ్‌ సందేశం ఇచ్చారు. రాజమౌళి తన సందేశంలో ‘‘ఇంటిపట్టునే ఉండటం అన్నింటికంటే ముఖ్యం. అత్యవసరమైతేనే గడపదాటాలి’’ అని చెప్పారు. ‘‘కరోనా రెండో దశలో కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. మాస్క్‌ ధరించటంతో పాటు విధిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలి’’ అని అలియా కోరారు.