May 5 2021 @ 00:38AM

మాస్‌ పోలీస్‌... ఫ్యాక్షనిస్ట్‌

‘లక్ష్మీనరసింహా’, ‘చెన్న కేశవరెడ్డి’ లాంటి చిత్రాల్లో పోలీసాఫీసర్‌గా ప్రేక్షకులను మెప్పించారు నందమూరి బాలకృష్ణ. తాజాగా మరోసారి ఆయన పోలీస్‌ పాత్రలో కనిపించబోతున్నారు. బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్‌ మలినేని కలయికలో ఓ చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో బాలకృష్ణ మాస్‌ పోలీసాఫీసర్‌గా, ఫ్యాక్షనిస్ట్‌గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. మేలో ఈ సినిమాను సెట్స్‌ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్‌ చేశారు. కానీ కరోనా రెండో దశతో చిత్రీకరణ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘అఖండ’ చిత్రంలో బాలకృష్ణ నటిస్తున్నారు. గోపీచంద్‌ పవర్‌ఫుల్‌ కథను రెడీ చేశారు. ఇదిలా ఉండగా బాలకృష్ణ, కల్యాణ్‌ రామ్‌ కలసి త్వరలో ఓ చిత్రం చేయనున్నారని సమాచారం. ఈ చిత్రం కోసం దర్శకుడు అనిల్‌ రావిపూడి కథను సిద్ధం చేస్తున్నారని టాక్‌.