ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరిట హైదరాబాద్‌లో భారీ మోసం

ABN , First Publish Date - 2021-04-05T12:25:07+05:30 IST

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరిట మోసాలు మళ్లీ వెలుగుచూస్తున్నాయి.

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరిట హైదరాబాద్‌లో భారీ మోసం

  • నగర మహిళ నుంచి రూ.1.2 కోట్లు కాజేసిన నిందితులు
  • ముగ్గురిని అరెస్టు చేసిన సైబర్‌క్రైం పోలీసులు

హైదరాబాద్‌ : ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరిట మోసాలు మళ్లీ వెలుగుచూస్తున్నాయి. హైదరాబాద్‌ సీసీఎస్‌ డిటెక్టివ్‌ విభాగం పోలీసులు తాజాగా  ముగ్గురిని అరెస్టు చేశారు. నగరానికి చెందిన మహిళ గత నెల 1న సీసీఎస్‌ సైబర్‌క్రైం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు జాయింట్‌ సీపీ అవినాశ్‌ మహంతి తెలిపారు. 


గతేడాది నవంబర్‌ 19న ఫేస్‌బుక్‌లో సాక్షిమెహతా, షేర్‌ ట్రేడింగ్‌ కన్సల్టెంట్‌ అంటూ నోటిఫికేషన్‌ వచ్చింది. సంప్రదింపులు, ఫోన్‌ నెంబర్ల షేరింగ్‌ తర్వాత కాల్‌ చేసిన నిందితులు న్యూఢిల్లీ, వసంత్‌కుంజ్‌లో సెంట్రల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ కం పెనీ ఉందని వివరించారు. డీ మ్యాట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసుకుంటే, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ద్వారా భారీగా లాభాలు వస్తాయని నమ్మించారు. నమ్మిన బాధితురాలు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వడంతోపాటు వారు చెప్పిన విధంగా రూ. 5 లక్షలు ట్రేడింగ్‌ నిమిత్తం వారి ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్‌ చేసింది. అనంతరం సాక్షి మెహతా అనే మహిళ మా ట్లాడి రూ.88 లక్షలు లాభం వచ్చిందని చెప్పింది. ఆ లాభం డబ్బులు కావాలంటే నిబంధనల ప్రకారం కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. 


మధ్యప్రదేశ్‌లో నివాసముంటూ వివిధ పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచిన నిందితులు మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో భారీగా లాభాలున్నాయని నమ్మించి సంబంధించిన కొన్ని స్ర్కీన్‌షాట్లు షేర్‌ చేసి బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల రూ. కోట్లలో లాభాలు అర్జించారని డమ్మీ ఫొటోలు చూపించి దండుకుంటున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఇప్పటి వరకు నిందితుల మీద సైబర్‌క్రైమ్‌లో మూడు కేసులు, ఛత్తీ‌స్‌గఢ్‌లోని అంబికాపుర్‌ పీఎ‌స్‌లో ఓ కేసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఇద్దరినీ గతంలోనూ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 


నమ్మిన బాధితురాలు నిందితులు చెప్పినట్లు వారు ఇచ్చిన ఖాతాల్లో మొత్తం రూ. 1.2 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేసింది. మోసపోయానని గ్రహించిన ఆమె న్యాయం చేయాలంటూ సీసీఎ్‌సను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె సమర్పించిన ఆధారాలు, ఖాతాలు, ఫోన్‌నెంబర్ల ఆధారంగా నిం దితులను గుర్తించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నివాసి తరుణ్‌ ప్రజాపతి (24), అదే ప్రాంతానికి చెందిన బబ్లూ చౌహాన్‌ (26), సందీప్‌ బాన్సోడే(27)లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు మొబైల్‌ ఫోన్లు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను స్వాధీనం చేసుకుని ట్రాన్సిట్‌ వారెంట్‌పై నగరానికి తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. నిందితులను విచారించగా, మోసాల తీరును వివరించారు.

Updated Date - 2021-04-05T12:25:07+05:30 IST