అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా పోలింగ్‌

ABN , First Publish Date - 2021-04-07T06:52:06+05:30 IST

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టం మంగళవారం ముగిసింది. తమిళనాడులో 71.79

అసెంబ్లీ ఎన్నికల్లో  భారీగా పోలింగ్‌

  • తమిళనాట  71.. కేరళలో 74 .. అసోంలో 82.. బెంగాల్లో 78ు
  • బెంగాల్‌లో హింస.. ఒకరి మృతి... 40 మందికి గాయాలు
  • ఐదుగురు అభ్యర్థులపై దాడి.. టీఎంసీ- బీజేపీ వర్గాల తీవ్ర ఘర్షణ
  • బెంగాల్‌ మూడోదశలో హింస


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టం మంగళవారం ముగిసింది. తమిళనాడులో 71.79 శాతం, కేరళలో 74 శాతం, పుదుచ్చేరిలో 80 శాతం పోలింగ్‌ నమోదైంది. హింసతో అట్టుడుకుతున్న బెంగాల్‌లో మూడో దశలో 78 శాతం, అసోం ఆఖరి దశలో 82.33 శాతం ఓటింగ్‌ జరిగింది. బెంగాల్‌ మినహా మిగిలిన రాష్ట్రాల్లో పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. బెంగాల్లో మరో ఐదు దశల పోలింగ్‌ జరుగుతుంది. వచ్చే నెల 2న అన్ని రాష్ట్రాల ఓట్లను లెక్కించనున్నారు.


బెంగాల్‌ కుత కుత....

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ మూడో దశ పోలింగ్‌లో హింస చెలరేగింది. ముఖ్యంగా దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో తృణమూల్‌, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి.


హుగ్లీ జిల్లాలో కాసేపట్లో పోలింగ్‌ ప్రారంభమవుతుందనగా ఓ బీజేపీ మద్దతుదారు ఇంట్లోకి తృణమూల్‌ కార్యకర్తలు చొరబడి, అడ్డువచ్చిన అతడి తల్లిని కొట్టి హత్య చేశారు. పలు చోట్ల గొడవల్లో 40 మందికి పైగా గాయపడ్డారు. ఇరువర్గాలు నాటు బాంబులు విసురుకుని బరిసెలతో కొట్లాడుకున్నాయి. అనేక పోలింగ్‌ కేంద్రాలను బీజేపీ కార్యకర్తలు ఆక్రమించారంటూ  మమతా బెనర్జీ ఆరోపించారు. కనీసం ఐదుగురు అభ్యర్థులపై దాడులు జరిగాయి. వీరిలో ఇద్దరు మహిళలు. ఏడుగురు అభ్యర్థుల వాహనాలను ధ్వంసం చేశారు. 





టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎంలు

హుగ్లీ జిల్లాలోని తులసీబెరియా అనే గ్రామంలో ఓ టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎంలు, వీవీప్యాట్‌ మెషీన్లు లభ్యం కావడంపై పెద్ద దుమారం చెలరేగింది. ఇది ఉలుబెరియా ఉత్తర నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ‘‘నేను ఎన్నికల డ్యూటీకి వెళ్లేసరికి ఆ బూత్‌ మూసి ఉంది. రోడ్డు మీద ఉండలేక ఆ నాయకుడి ఇంట్లో పెట్టి వాటి వద్దే నేను పడుకున్నాను!’’ అని సెక్టర్‌ ఆఫీసర్‌ తపన్‌ సర్కార్‌ వివరించారు. దీనిపై ఈసీ మండిపడింది. వెంటనే ఆ అధికారిని సస్పెండ్‌చేసింది. ఆ ఈవీఎంలను కూడా మంగళవారంనాటి పోలింగ్‌లో ఉపయోగించలేదు. ఎన్నికల్లో రిగ్గింగ్‌కే టీఎంసీ కుట్ర అనీ, దీనిపై స్వతంత్రదర్యాప్తు జరపాలని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఈసీని డిమాండ్‌ చేశారు. 




అసోంలోనూ ఘర్షణలు

గువాహటి: చెదురుమొదరు ఘర్షణలు మినహా అసోంలో ఆఖరి దశ పోలింగ్‌ ముగిసింది. 40 నియోజకవర్గాల్లో 337 మంది అభ్యర్థుల రాజకీయ భవిత ఈవీఎంల్లో నిక్షిప్తమయ్యింది. దక్షిణ సల్మారా, ధుబ్రీ జిల్లాల్లో సుమారు 90 శాతం పోలింగ్‌ నమోదు కావడం విశేషం. గోలక్‌గంజ్‌, బిలా్‌సపారా స్థానాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. అల్లరిమూకలు భద్రతా బలగాలపై రాళ్లు రువ్వడంతో లాఠీచార్జి జరిపారు. 14 మంది గాయపడ్డారు. భారీగా 83 శాతం ఓటింగ్‌ జరిగినందున తాము అధికారం నిలబెట్టుకోవడం ఖాయమని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. 




కేరళలో ఇద్దరు మృతి

కేరళలో మొత్తం 140 స్థానాల్లో 957 మంది అభ్యర్థుల భవిత ఈవీఎంల్లో నిక్షిప్తమయ్యింది. సీపీఎం నేతృత్వంలోని కూటమి రెండోసారి కూడా గెలిచి చరిత్ర సృష్టించడం ఖాయమని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఓటర్ల నాడి యూడీఎ్‌ఫనే కోరుకున్నట్లు ఓటింగ్‌ శాతం ధ్రువపరుస్తోందని తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ అన్నారు. ఓటెయ్యడానికి వెళ్లిన ఇద్దరు క్యూలో ఉండగానే కుప్పకూలి మరణించిన ఘటన పథనందిట్ట నియోజకవర్గంలోని అరణ్ముల పోలింగ్‌ కేంద్రం వద్ద చోటుచేసుకుంది. ఈ నియోజకవర్గంతో పాటు బీజేపీ పోటీలో ఉన్న మరికొన్ని చోట్ల ఆ పార్టీ కార్యకర్తలకు, సీపీఎం కార్యకర్తలకు ఘర్షణలు జరిగాయి. నలుగురు గాయపడ్డారు.



పుదుచ్చేరిలో పోటెత్తిన ఓట్లు

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారీగా 80.03 శాతం ఓటింగ్‌ జరిగింది. మాజీ ముఖ్యమంత్రి అయిన రంగస్వామి పోటీచేస్తున్న యానాంలో 84 శాతం పోలింగ్‌ నమోదైంది. 30 నియోజవర్గాల్లోని 324 మంది మంది అభ్యర్థుల భవిష్యత్తు మే నెల 2వ తేదీన కౌంటింగ్‌లో తేలిపోతుంది.  ఇక్కడ ప్రధానంగా యూపీఏ(కాంగ్రెస్‌, డీఎంకే, సీపీఐ, డీపీఐ) కూటమి, ఎన్‌డీఏ(ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌, బీజేపీ, అన్నాడీఎంకే) కూటమి పోటీ పడుతున్నాయి. గతానికి భిన్నంగా ఈ రెండు కూటముల నుంచీ సీఎం అభ్యర్థి ఎవరో ఖరారు కాలేదు. ఎనఢీఏ కూటమి సీఎం అభ్యర్థిని తానేనని ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత ఎన్‌.రంగస్వామి ప్రకటించుకోగా, ఎన్నికలయ్యాక నిర్ణయిస్తామని అదే కూటమిలోని బీజేపీ ప్రకటించింది.




సైకిల్‌పై పోలింగ్‌ కేంద్రానికి విజయ్‌

చెన్నై, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): సినీ హీరో విజయ్‌ చెన్నై శివారు నీలాంగరైలో తన నివాసం నుంచి సైకిల్‌పై పోలింగ్‌ బూత్‌వద్దకు వచ్చి ఓటేశారు. పెట్రో ధరల విషయంలో బీజేపీపైనిరసన తెలిపేందుకే విజయ్‌ అలా సైకిల్‌పై వచ్చారని డీఎంకే నేత ఉదయనిధి వ్యాఖ్యానించగా, మీ సొంత భాష్యాలు వద్దంటూ థౌజెండ్‌లైట్స్‌ బీజేపీ అభ్యర్థి ఖుష్బూ కౌంటరిచ్చారు.




హే... అయ్యప్పా!

కేరళలో పోలింగ్‌ రోజున కూడా శబరిమల వివాదం గట్టిగా ప్రతిధ్వనించింది. అయ్యప్పస్వామి కరుణ, ఆశీస్సులు సీపీఎం కూటమిపైన మెండుగా ఉన్నాయని ముఖ్యమంత్రి పినరయి వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్‌ ఇచ్చిన సీఎల్పీ నేత రమేశ్‌ చెన్నితాల-  అయ్యప్పస్వామి ఆగ్రహం, ఆ స్వామి భక్తుల కోపం సీపీఎంపై పడుతోందని అన్నారు. వీరిద్దరినీ టార్గెట్‌ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్‌-- ‘మూడేళ్లకిందట శబరిమలలో పినరయి ఓ భూతంలా ప్రవర్తించారని, భక్తుల మనోభావాలను గాయపర్చారని, ఆయన దుష్ట కృత్యాలను ప్రజలు మర్చిపోలేదని, ఈ ఎన్నికల్లో అది వెల్లడవుతుందని అన్నారు.  


Updated Date - 2021-04-07T06:52:06+05:30 IST