Abn logo
Oct 5 2021 @ 09:21AM

HYD : ప్రేమించుకున్నారు.. నిశ్చితార్థం పూర్తి.. దీపావళికి పెళ్లి.. ఎన్నెన్నో కలలు.. ఇంతలోనే ఊహించని విషాదం.. రాత్రంతా తప్పతాగి.. పొద్దున్నే.. అసలేం జరిగింది..!

  • రాత్రంతా తప్పతాగి.. పొద్దున్నే కారు డ్రైవింగ్‌
  • కాబోయే జంటను కారుతో ఢీ కొట్టిన యువకుడు
  • యువతి దుర్మరణం.. 
  • ప్రాణాపాయంలో యువకుడు 
  • సిగ్నల్‌ వద్ద ప్రమాదం కేసులో విషాదకర  విషయాలు

ఎవరో ఒక జులాయి ఉన్మాదం ఎన్నో జీవితాలను చిదిమేస్తోంది. ఒకరి రాక్షసానందం మరెందరికో విషాదాన్ని మిగులుస్తోంది. హైదరాబాద్‌ రోడ్లపై అడుగుపెట్టాలన్నా, తమ దారిన తాము వాహనాలపై వెళ్లాలన్నా.. ఏ మూల నుంచి మృత్యువు ఎవడి రూపంలో ముంచుకొస్తుందోనన్న భయం వెంటాడుతోంది. ఆదివారం హద్దులు దాటిన మైకంలో కారు నడుపుతూ సిగ్నల్‌ దగ్గర ఆగిన ఓ జంటపై విరుచుకుపడ్డ సంఘటన సాధారణ పౌరులందరినీ బాధ పెడుతోంది. మరింత భయపెడుతోంది.


హైదరాబాద్‌ సిటీ : నేరేడ్‌మెట్‌ సైనిక్‌పురికి చెందిన అజయ్‌, లాలాపేటకు చెందిన జెన్నీఫర్‌ ఇద్దరూ మంచి స్నేహితులు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలు కలిశాయి. ఇద్దరి కుటుంబాలు కూడా వారికి పెళ్లిచేయాలని నిశ్చయించాయి. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది. దీంతో కాబోయే దంపతులు భవిష్యత్‌ గురించి, పెళ్లి తర్వాత దాంపత్య జీవితం గురించి ఎన్నో కలలు కన్నారు. దీపావళికి పెళ్లి చేసుకుని మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వాలని కలలు కంటున్నారు. వాహనదారుడి రూపంలో వచ్చిన ఒక పోకిరీ వారి కలలను కల్లలు చేశాడు. వారి జీవితంలో విషాదం నింపాడు. బైక్‌పై వెళ్తూ సిగ్నల్‌ వద్ద ఆగిన ఆ జంటను అతివేగంతో కారులో దూసుకొచ్చిన తాగుబోతు బలంగా ఢీకొట్టాడు. బైక్‌పై నుంచి కిందపడిపోయిన ఆ యువతి తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కొట్టుకొని దుర్మరణం చెందింది. ఎగిరి రోడ్డుమీద పడిన యువకుడు వెన్నెముకకు తీవ్ర గాయాలై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఒక తాగుబోతు చేసిన తప్పు కాబోయే దంపతుల పాలిట శాపంగా మారింది. ఏ పాపం తెలియని వాళ్ల జీవితాల్లో చీకట్లు నింపింది.

అసలేం జరిగింది..!

కాబోయే భార్యాభర్తలు అజయ్‌, జెన్నీఫర్‌లు శనివారం రాత్రి స్నేహితుల ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. రాత్రి అక్కడే పడుకొని ఆదివారం ఉదయం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌పై ఇంటికి బయల్దేరారు. మాదాపూర్‌ సీఐఐ వద్ద రెడ్‌ సిగ్నల్‌ పడటంతో బైక్‌ను ఆపారు. ఇంతలోనే వెనుకనుంచి అతివేగంగా దూసుకొచ్చిన ఎక్స్‌యూవీ-500 కారు అజయ్‌ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ఇద్దరూ ఎగిరిపడ్డారు. జెన్నీఫర్‌ తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. అజయ్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా తీవ్రగాయాలతో పాటు.. వెన్నెముక విరిగిపోయినట్లు వైద్యులు పేర్కొన్నట్లు తెలిసింది. బైక్‌ను ఢీ కొట్టిన అనంతరం నిందితుడు పరారయ్యాడు.

డేంజరస్‌ డ్రైవింగ్‌, 11 చలానాలు పెండింగ్‌..

సృజన్‌ డేంజరస్‌ డ్రైవింగ్‌తో కారును పరుగులు పెట్టించేవాడని పోలీసులు గుర్తించారు. గతేడాది అక్టోబర్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఏడాదిలో పోలీసులు 11 అతివేగం/డేంజరస్‌ డ్రైవింగ్‌ చలానాలు విఽధించినట్లు తేలింది. మొత్తం రూ. 11,385ల మేరకు జరిమానాలు చెల్లించాల్సి ఉంది. వాటిలో 10 చలానాలు సైబరాబాద్‌ పరిధిలోనే ఉన్నా ట్రాఫిక్‌ పోలీసులు ఆ వాహనాన్ని గుర్తించలేదు, సీజ్‌ చేయలేదు. ఆ కారుపై ఉన్న డేంజరస్‌ డ్రైవింగ్‌ చలానాలను బట్టి చూస్తే నిందితుడు ఎక్కువగా తెల్లవారుజామునే అతివేగంతో కారు నడిపినట్లు తెలుస్తోంది.

రాత్రంతా తప్పతాగి..

కూకట్‌పల్లికి చెందిన సృజన్‌ బీటెక్‌ పూర్తి చేసి పోకిరీగా తిరుగుతున్నాడు. తండ్రి ఒక అడ్వకేట్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. తమ ఎక్స్‌యూవీ-500 వాహనంలో హైదరాబాద్‌లో బలాదూర్‌ తిరగడం, రాత్రంతా స్నేహితుల ఇళ్లలో తప్పతాగి ఉదయాన్నే ఇంటికి వెళ్లడం అతని అలవాటుగా తెలిసింది. ఈ క్రమంలో శనివారం రాత్రంతా స్నేహితుని రూమ్‌లో తప్పతాగిన సృజన్‌ ఉదయాన్నే కారులో ఇంటికి బయల్దేరాడు. మొదటి నుంచి డేంజరస్‌ డ్రైవింగ్‌కు అలవాటపడిన సృజన్‌కు రాత్రి తాగిన మత్తు, నిద్రమత్తు తోడవడంతో ఆదివారం ఉదయం సిగ్నల్‌ వద్ద ఆగి ఉన్న అజయ్‌, జెన్నీఫర్‌లను ఢీకొట్టాడు. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం తీవ్రంగా గాలించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఎట్టకేలకు  సోమవారం సాయంత్రం ఆ పోకిరీ ఆటకట్టించి కటకటాల్లోకి నెట్టారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...